మార్చి తొలి వారంలో బడ్జెట్ సమావేశాలు | Budget sessions to be started March first week | Sakshi
Sakshi News home page

మార్చి తొలి వారంలో బడ్జెట్ సమావేశాలు

Jan 7 2015 2:39 AM | Updated on Sep 2 2017 7:19 PM

రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మార్చి తొలి వారంలో నిర్వహించనున్నారు.

అసెంబ్లీ రూల్స్ కమిటీ భేటీలో నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మార్చి తొలి వారంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు స్పీకర్ మధుసూదనాచారి అధ్యక్షతన మంగళవారం జరిగిన అసెంబ్లీ రూల్స్ కమిటీలో సూత్రప్రాయంగా నిర్ణయించారు. రూల్స్ కమిటీలో 14 మంది సభ్యులుగా ఉన్నప్పటికీ తాజా భేటీకి ఐదుగురే హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నిబంధనలనే కొన్ని సవరణలతో తెలంగాణ అసెంబ్లీకి వర్తింపజేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. సభా నిర్వహణకు సంబంధించి పార్లమెంటు విధి విధానాలను అధ్యయనం చేసేందుకు త్వరలో ఢిల్లీకి వెళ్లాలని రూల్స్ కమిటీ సభ్యులు నిర్ణయించారు. అవసరమైతే ఇతర రాష్ట్రాల్లోని అసెంబ్లీ నిబంధనలను కూడా పరిశీలించాలని కొందరు సభ్యులు స్పీకర్‌కు సూచించారు. శాసనసభా సమావేశాల్లో ఎక్కువ మంది సభ్యులకు మాట్లాడే అవకాశం వచ్చేలా పని వేళలను పెంచాలని విపక్ష పార్టీల సభ్యులు ప్రతిపాదించారు. పిటిషన్స్, ప్రివిలేజెస్, గవర్నమెంట్ అస్యూరెన్సెస్ కమిటీల్లో ఏడుగురు చొప్పున సభ్యులు, రూల్స్ కమిటీలో 11 మంది సభ్యులు ఉండాలన్న చర్చ జరిగింది.
 
  మొత్తం 16 అసెంబ్లీ కమిటీల్లో దాదాపు అందరు సభ్యులకు అవకాశమిచ్చేలా కూర్పు ఉండాలన్న సూచన కూడా వచ్చింది. చివరకు ఈ అన్ని అంశాలపై మరో సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులందరికీ అవకాశం వచ్చేలా సమయాన్ని పెంచాలని కోరినట్లు ఈ భేటీలో పాల్గొన్న బీజేపీఎల్పీ నేత లక్ష్మణ్ చెప్పారు. విభజన చట్టానికి అనుగుణంగా అసెంబ్లీ నిబంధనలు రూపొందించాలని సూచించామన్నారు. ఈ సమావేశంలో ప్రత్యేక ఆహ్వానితులుగా డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సున్నం రాజయ్య, వివేకానంద, లక్ష్మణ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మా దేవేందర్‌రెడ్డికి సభ్యులంతా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement