కేటీఆర్‌ పర్యటనలో మాజీ స్పీకర్‌ మదుసుదనాచారికి చేదు అనుభవం!

Bitter Experience FOR MLC Madhusudhana Chary In KTR Visit Warangal - Sakshi

గణపురం: మంత్రి కేటీఆర్‌ గణపురం మండల పర్యటనలో మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసుదనాచారికి చేదు అనుభవం ఎదురైంది. కేటీఆర్‌కు స్వాగతం పలికేందుకు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ వద్దకు వెళ్తున్న క్రమంలో గణపురం ప్రధాన రోడ్డుపై ఆయన వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తాను మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసుదనాచారిని అని తెలపడంతో ఆయన వాహనాన్ని వదిలిపెట్టారు. కానీ ఆయన వెంట వచ్చే నాయకుల వాహనాన్ని సైతం పోలీసులు అడ్డుకున్నారు.

దీంతో ఆగ్రహానికి గురైన సిరికొండ వాహనంలో నుంచి దిగి వచ్చి నన్ను, నా వెంట వచ్చే నేతలను అడ్డుకుంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు వాహనాన్ని హెలిప్యాడ్‌ వద్దకు వెళ్లేందుకు అనుమతిచ్చారు. అక్కడ నుంచి హెలిప్యాడ్‌ వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన మరో బందోబస్తు వద్ద కూడా సిరికొండ వాహనాన్ని నిలిపి ఆయన అధికార పీఏను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు.

కాగా.. కేటీఆర్‌ పర్యటనలో కావాలనే సిరికొండను అడుగడుగునా అవమానించారని ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్సీ కవిత పర్యటనలో టీబీజీకేఎస్‌ భవన నిర్మాణ శంకుస్థాపన శిలాఫలకంలో సిరికొండ పేరు లేకపోవడం ఆయన వర్గీయులను ఆగ్రహానికి గురిచేసింది. అప్పటి నుంచి ఎమ్మెల్యే గండ్ర వ్యవహారంపై అసంతృప్తితో ఉన్నారు.

ఈక్రమంలో కవిత సమక్షంలోనే సిరికొండ, గండ్ర వర్గీయులు పోటా పోటీగా నినాదాలు చేసుకున్నారు. కాగా.. కేటీఆర్‌ పర్యటనలో సిరికొండ వాహనాన్ని పోలీసులు తెలియక అడ్డుకున్నారా? లేక గండ్ర ఆదిపత్య పోరు కోసం చేయించారా? అని సిరికొండ వర్గీయులు, ప్రజలు చర్చింకుంటున్నారు.  

అంతటా వర్గపోరే.. 
రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ పర్యటనలో ఆసాంతం బీఆర్‌ఎస్‌ పార్టీలో వర్గపోరు కనిపించింది. ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వర్గీయులు నినాదాలతో హోరెత్తించారు. డబుల్‌ బెడ్‌ రూంల ప్రారంభోత్సవం, బహిరంగ సభ వద్ద జై సిరికొండ, చారి సాబ్‌ జిందాబాద్‌ అంటూ కొందరు నినాదాలు చేయగా.. మరికొందరు జై గండ్ర జైజై గండ్ర అంటూ నినదించారు.

బహిరంగ సభలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతున్న సమయంలో అభిమానులు చాలామంది జై సిరికొండ అంటూ నినాదాలు చేయడంతో.. ‘మీకు దండం పెడతా, ఆపండి.. ఇది మన కార్యక్రమం, సజావుగా జరగనివ్వండి’ అని మంత్రి కోరారు. ఇదిలా ఉండగా సభలో కూర్చున్న పలువురు ‘భూకబ్జాదారులు.. ఎమ్మెల్యే అనుచరులు’ అంటూ నినాదాలు చేశారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top