అయోధ్య తీర్పు: ఒవైసీ స్పందన

Asaduddin Owaisi Says Not Satisfied With Ayodhya Verdict - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అయోధ్య వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు తనకు అసంతృప్తి కలిగించిందని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. ఒక వర్గం వారికి మాత్రమే కోర్టు తీర్పు ఇచ్చినట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. అయోధ్య రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంలో భారత సర్వోన్నత న్యాయస్థానం శనివారం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. రామజన్మ న్యాస్‌కే వివాదాస్పద స్థలాన్ని అప్పగించాలని కోర్టు ఆదేశించింది. అదే విధంగా అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి సున్నీ వక్ఫ్‌ బోర్డుకు ప్రత్యామ్నాయంగా ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో అసదుద్దీన్‌ మాట్లాడుతూ... బాబ్రీ మసీదు నిర్మాణానికై సున్ని వక్ఫ్‌ బోర్డు న్యాయవాదులు తమ వాదనలు బలంగా వినిపించారని తెలిపారు. ‘అక్కడ బాబ్రీ మసీదు ఉందన్న విషయం శాస్త్రీయంగా తేలింది. సుప్రీం తీర్పు అసంపూర్తిగా ఉంది. ఈ విషయంలో ముస్లిం వర్గానికి అన్యాయం జరిగింది. దానంగా ఇచ్చే ఐదెకరాల భూమి మాకు అక్కర్లేదు. భారత రాజ్యాంగంపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. మా హక్కుల కోసం చివరిదాకా పోరాడతాం. ఆ ఐదెకరాల స్థలాన్ని కచ్చితంగా తిరస్కరించాల్సిందే. మా మీద సానుభూతి, అభిమానం చూపాల్సిన అవసరం లేదు’ అని పేర్కొన్నారు. ఏదైమైనా సుప్రీంకోర్టును తీర్పును గౌరవిస్తామని అయితే అదే సర్వోన్నతమైనది కాదు అని వ్యాఖ్యానించారు.

కాగా అయోధ్య వివాదంలో అసదుద్దీన్‌ కాంగ్రెస్‌ పార్టీ తీరును తప్పుబట్టారు. ‘ముందు భారతదేశాన్ని హిందూ దేశం అని పిలవడం ఆపాలి. కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా దూకి ఆత్మహత్యకు పాల్పడాలి. కాంగ్రెస్ పార్టీ వల్లే బాబ్రీ మసీదు చేజారింది. 1992 డిసెంబర్ 6 న బాబ్రీ మసీదును కూల్చివేశారు. అంతకన్నా ముందు జరిగిన పరిణామాలను పరిగణనలోకి తీసుకుని కోర్టు విచారణ మొదలుపెట్టింది. బాబ్రీ మసీదు సాధించుకోవడం మా జన్మ హక్కు. బాబ్రీ మసీదు విషయంలో ప్రతీ ఒక్క అంశాన్ని కోర్టు ముందుకు తీసుకొచ్చారు. అయితే సుప్రీం కోర్టు తుది తీర్పు శాసనం. భారత దేశంలోని లౌకిక వాద భావాలను పరిగణనలోకి తీసుకొని కోర్టు తీర్పు వెలువరిస్తుందని ఆశించాం. కానీ ఈ తీర్పు మా జీవితాలను ఒత్తిడికి గురి చేసింది. ఏదేమైనా సుప్రీం కోర్టు తీర్పును గౌరవిస్తాం. 1045 పేజీల ప్రతులను పరిశీలించి నిర్ణయం కోర్టు తీసుకుంది. ముస్లింలు ఏ విషయంలోనూ భయపడాల్సిన అవసరం లేదు. చివరి శ్వాసదాకా మన హక్కు కోసం పోరాడుదాం. రాజ్యాంగంపై నమ్మకం ఉంది. ఎన్ని సంవత్సరాలైనా న్యాయం కోసం వేచి చూద్దాం. శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదని ఆకాంక్షిస్తున్నా’ అని ఒవైసీ పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top