వీలైనంత త్వరలో నిమ్స్‌లో వైద్యసేవలు | As soon as possible NIMS In Medical Services | Sakshi
Sakshi News home page

వీలైనంత త్వరలో నిమ్స్‌లో వైద్యసేవలు

Jun 16 2014 12:28 AM | Updated on Oct 9 2018 7:52 PM

వీలైనంత త్వరలో నిమ్స్‌లో వైద్యసేవలు - Sakshi

వీలైనంత త్వరలో నిమ్స్‌లో వైద్యసేవలు

బీబీనగర్‌లోని నిమ్స్ (నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సెన్సైస్)లో వీలైనంత త్వరలో వైద్యసేవలు ప్రారంభిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య తెలిపారు.

- మొదట ఓపీ విభాగం ప్రారంభిస్తాం
- అంచలంచెలుగా అభివృద్ధి
- అదనపు నిధుల కోసం కేబినెట్‌లో చర్చిస్తా
- ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య

బీబీనగర్ :  బీబీనగర్‌లోని నిమ్స్ (నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సెన్సైస్)లో వీలైనంత త్వరలో వైద్యసేవలు ప్రారంభిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య తెలిపారు. ఆదివారం హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న ఆయన బీబీనగర్‌లోని నిమ్స్ యూనివర్సిటీలో ఎర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆస్పత్రిని ప్రారంభించేందుకు అయ్యే అంచనా వ్యయం, వైద్యాధికారులు, సిబ్బంది నియామకం తదితర అంశాలపై చర్చించి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. వీలైనంత త్వరలో ప్రజలకు వైద్యసేవలు అందించేలా మొదట ఓపీ (అవుట్ పేషంట్) విభాగాన్ని ప్రారంభిస్తామన్నారు. వైద్య, ఆరోగ్యశాఖలను ప్రక్షాళన చేస్తానన్నారు.

నిమ్స్ అభివృద్ధికి అదనపు నిధుల కోసం కేబినెట్‌లో కూడా చర్చిస్తామన్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరిచే దిశగా హెల్త్‌హబ్, టూరిజం ఏర్పాటుచేసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. పదేళ్ల ఉమ్మడి రాజధానిలో హెల్త్ యూనివర్సిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని, దానిని ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయాన్ని ఆలోచించి కేబినెట్‌లో నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు. గ్రామీణస్థాయిలో ప్రతి గడపకు, వైద్యం, మందులు చేరేలా, అంటువ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. పేదలకు కార్పొరేట్ వైద్యం అందేలా కృషి చేస్తానన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రక్షాళన చేసి మరింత ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఓపీ విభాగం ప్రారంభించిన అనంతరం అంచలంచెలుగా నిమ్స్‌ను అభివృద్ధి చేస్తామన్నారు.   
 
ఆలేరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా
ఆలేరు : ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తాటికొండ రాజయ్య అన్నారు. ఆదివారం హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న ఆయనకు ఆలేరులో టీఆర్‌ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తామని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు.

తెలంగాణ సాధనలో ప్రతి ఒక్కరి కృషి ఉందన్నారు. బంగారు తెలంగాణను సాకారం చేసేందుకు ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. బంగారంపై తీసుకున్న వ్యవసాయ రుణాలను కూడా ప్రభుత్వం మాఫీ చేస్తుందని చెప్పారు. ఎమ్మెల్యే గొంగిడి సునీత మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నూటికి నూరు శాతం నెరవేరుస్తుందని చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలూ అక్కర్లేదన్నారు.

ఈ సందర్భంగా రాజయ్య, సునీతలు స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.  ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల ఆస్పత్రి నిర్మాణం చేపట్టాలని కోరుతూ టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఉపముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేశారు.  డప్పు కళాకారులతో కలిసి ఉప ముఖ్యమంత్రి కొద్దిసేపు డోలు వాయించి ఉత్తేజపరిచారు. కార్యక్రమంలో జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రాష్ట్ర నాయకులు గొంగిడి మహేందర్‌రెడ్డి, జెడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్,  నాయకులు ఆకవ రం మోహన్‌రావు, చింతకింది మురళీ, దాసి సంతోష్, కాసగల్ల అనసూర్య, పిక్క శ్రీను, బింగి రవి, పోరెడ్డి శ్రీనివాస్, రచ్చ కావ్యశ్రీ, ఆడెపు బాలస్వామి, కర్రె అశోక్, బొంకూరి బాల్‌నర్సయ్య, బండారి సాంబయ్య, బైరి చంద్రంగౌడ్, జైరాంనాయక్, పల్ల జోగిరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement