తెలంగాణ ఇయ్యలే.. గుంజుకున్నం

Arya Vysya Leaders Joins Into TRS Party In Hyderabad - Sakshi

ఆర్యవైశ్యుల చేరిక కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ 

కేసీ గుప్తా అంటే కల్వకుంట్ల చంద్రశేఖర గుప్తా 

ఎన్నికల వాతావరణం వచ్చినట్టే... 

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ఎవ్వరో ఇయ్యలేదని, గుంజుకున్నామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ మంత్రి కె.తారక రామారావు అన్నారు. శుక్రవారం హైదరాబాద్, సికింద్రాబాద్‌కు చెందిన ఆర్యవైశ్య ప్రముఖులు టీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కేటీఆర్‌ కలసి వారికి టీఆర్‌ఎస్‌ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేటీఆర్‌ మాట్లాడుతూ వాసవి క్లబ్‌ను ఏర్పాటు చేసింది కేసీ గుప్తా అని, కేసీ గుప్తా అంటే కల్వకుంట్ల చంద్రశేఖర గుప్తా అని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు, వైశ్యులకు ఎక్కడో సంబంధముందన్నారు. యాదాద్రి, హైదరాబాద్‌లో చారిటబుల్‌ ఆసుపత్రుల కోసం స్థలం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.

తెలంగాణలో అది చేయలేదు, ఇది చేయలేదని మాట్లాడుతున్న కాంగ్రెస్‌ నేతలు అధికారంలో ఉన్నప్పుడు చేసిందేమిటో చెప్పాలన్నారు. 60 ఏళ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ నేతలే అభివృద్ధి చేస్తే ఇప్పుడు అడగాల్సిన అవసరం ఏముందన్నారు. ఇంకా దేశంలో వేలాది గ్రామాలకు కరెంటు దిక్కులేదన్నారు. అనేక గ్రామాలకు రోడ్లు లేవని, దీనివల్ల కోట్లాది మందికి కనీస సౌకర్యాలు ఎందుకు లేవో కాంగ్రెస్‌ నేతలు చెప్పాలని కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. తెలంగాణకు కాంగ్రెస్‌ చేసిన ద్రోహం అంతా ఇంతా కాదన్నారు. సోనియమ్మే తెలంగాణ ఇచ్చినట్టుగా కాంగ్రెస్‌వాళ్లు చెబితే ఎవరూ నమ్మరని కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ ఎవ్వరో ఇయ్యలేదని, తెలంగాణను తామే గుంజుకున్నామన్నారు.  

గోస పెట్టినందుకు కాంగ్రెస్‌ను ఓడించారు... 
తెలంగాణను గోస పెట్టినందుకే గత ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీని ఓడించారని కేటీఆర్‌ అన్నారు. బీజేపీ నేతలు ఏదో యాత్ర పేరిట ప్రజలను చైతన్యం చేస్తారట అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు ఇప్పటికే చైతన్యవంతులన్నారు. అదే చైతన్యంతో ఈసారి కూడా బీజేపీ నేతల వీపులు పగలగొడ్తారని కేటీఆర్‌ హెచ్చరించారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణి చేయడానికి సీఎం కేసీఆర్‌ పనిచేస్తున్నారని చెప్పారు. ఇంటింటికీ నీళ్లు ఇచ్చుడు పక్కా అని, కాంగ్రెస్‌ వాళ్ల కాళ్ల కిందకు నీళ్లు తెచ్చుడు పక్కా అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. అగ్రకులాల్లోనూ పేదలు ఉన్నారని చెప్పారు. అగ్రకులాల్లోని పేదలను ఆదుకోవడానికి కళ్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. భవిష్యత్తులోనూ అగ్రకులాల్లోని పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇంకో 15 ఏళ్లు టీఆర్‌ఎస్‌ అధికారంలో ఉంటుందని, ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ఉంటారని జోస్యం చెప్పారు. ఎన్నికల కాలం వచ్చిందంటే గాలి మాటలు వినిపిస్తాయన్నారు.

నోటికి ఏది వస్తే అది మాట్లాడే నాయకులు వస్తరని హెచ్చరించారు. ఇంటింటికీ తులం బంగారం కూడా ఇస్తామని చెప్పి, ఓట్లు వేసేదాకా మాయమాటలు చెప్తారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల వాతావరణం వచ్చిందన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీఆర్‌ఎస్‌దే అధికారమని చెప్పారు. హోంమంత్రి నాయిని మాట్లాడుతూ ఆర్యవైశ్యులకు ప్రజలతో నేరుగా సంబంధాలుంటాయని,. అలాంటి ఆర్యవైశ్యులు టీఆర్‌ఎస్‌లో చేరడం మంచి పరిణామమన్నారు. కాంగ్రెస్‌ పార్టీని అడ్రస్‌ లేకుండా చేద్దామన్నారు. దేశవ్యాప్తంగా మోదీ గ్రాఫ్‌ పడిపోయిందన్నారు. బీజేపీ రాష్ట్ర నేతలు ఏవేవో మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ గడికి గండి పెట్టుడు కాదని, ఢిల్లీలో బీజేపీ గడీకి గండి పెడుతున్నామన్నారు. మంత్రి తలసాని మాట్లాడుతూ సమస్య ఏదైనా సరే కేటీఆర్‌కు చెప్తే సీఎం కేసీఆర్‌కు చెప్పినట్టేనన్నారు. ఈమధ్య కొందరు కొత్త బిచ్చగాళ్లు యాత్రల పేరుతో ప్రజలను కలుస్తున్నారని విమర్శించారు. గత 60 ఏళ్లలో అధికారంలో ఉన్నప్పుడు ఎలా పాలించారో, అలానే పాలించాలని కాంగ్రెస్‌ నేతలు కోరుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్‌ నేతలు చెప్పినట్టుగా ఎలా నడుస్తామని తలసాని ప్రశ్నించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top