కట్నం వద్దు.. గుణమే ముద్దు

Anti Dowry Day Special Story In Sakshi

గుణగణాలుంటే చాలు

కట్నకానుకలు వద్దంటున్న నేటి ‘యువ’తరం

ప్రస్తుతం మారాల్సింది పెద్దలే

నేడు ‘వరకట్న వ్యతిరేక దినోత్సవం’

సాక్షి, రామగుండం : ఈ రోజుల్లో కట్నం అనే ప్రసక్తి లేకుండా ఒక్క వివాహం కూడా జరగడం లేదంటే అతిశయోక్తి కాదు. పేద, మధ్యతరగతి కుటుంబాలను ‘కట్నకానుకలు’ సతమతం చేస్తున్నాయి. ‘పెళ్లీడొచ్చిన కొడుకులు కట్నాలు తెచ్చే బంగారు బాతులు.. ఎదిగిన ఆడపిల్లలైతే..? తల్లిదండ్రుల గుండెలపై కుంపట్లు..’ అనే భావనతో ఉంటున్నారు. తరాలు మారుతున్నాయి.. నేటి యువతలో కూడా కొంగొత్తగా స్వరాలు ధ్వనిస్తున్నాయి. ఆదర్శ భావాలున్న ఆధునిక యువతరంలో అక్కడక్కడా కొత్తగా తొంగిచూస్తున్నాయి. ఒక వైపు తల్లిదండ్రుల పేదరికాన్ని గౌరవిస్తూనే.. మరోవైపు కట్నం కోసం పరితపించే వారి ఆలోచనల్ని సున్నితంగా మార్చేందుకు నేటి యువతరం ప్రయత్నిస్తోంది. ఇరువర్గాలను ఒప్పించి కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటున్నారు. నేడు ‘వరకట్న వ్యతిరేక దినోత్సవం’ సందర్భంగా ప్రత్యేక కథనం.

చట్టం చేసి పాతికేళ్లు దాటినా..
వరకట్నం నిషేధపు చట్టం అమలులోకి వచ్చి పాతికేళ్లు దాటింది. చట్టం అమలు చేయడంలో అనేక లోపాలు చోటు చేసుకుంటుండడంతో మహిళలు తీవ్ర మానసిక ఇబ్బందులకు గురవుతున్నారు. కోరి చేసుకున్న వివాహాల్లో కూడా కట్నం ప్రభావం చూపుతుండటం మహిళల పట్ల శాపంగా మారింది. పెరిగిపోయిన ధనాకాంక్ష, మానవ సంబంధాలన్నీ డబ్బు చుట్టూ తిరుగుతున్నాయి. అదనపు కట్నం కావాలంటూ అనేక రకాలుగా హింసిస్తున్న సంఘటనటున్నాయి. కొందరు ఇవన్నీ మౌనంగా భరిస్తున్నారు. ఇంకొందరైతే తల్లిదండ్రులకు భారం కావడం ఇష్టంలేక లోకాన్ని వదులుతున్నారు.

498–ఏ చట్టంలో మార్పులు..
మహిళల కోసం ఏర్పాటు చేసిన వరకట్న నిషేధపు చట్టం ‘498–ఏ’ను కొందరు దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. చాలా వరకు కట్నం సమస్య కాకపోయినా అవగాహన లోపంతో భర్తతో పాటు అత్తమామ, ఆడపడులు, ఇలా అందరిపై కేసులు పెట్టి మానసిక ఆందోళనకు గురి చేస్తున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. 90 శాతం ఇలాంటి కేసులు ఎక్కువగా ఉంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం 498–ఏ చట్టంలో పలు మార్పులు చేసింది. ఫిర్యాదు చేసిన వెంటనే అరెస్ట్‌ చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది.

అవగాహన కల్పిస్తున్న వెబ్‌సైట్‌..
మ్యారేజ్‌ బ్యూరోలు, మాట్రిమోనియల్‌ వెబ్‌సైట్స్‌ ఉన్నప్పటికీ యువతీ, యువకుల మధ్యవర్తిత్వం నెరవడం వరకే వారి పనిగా మారింది. ‘కట్నం’ ఇత్యాది విషయాల్లో జోక్యం చేసుకునేందుకు సాహసం చేయలేక పోతున్నారు. ఈ సంప్రదాయాన్ని బ్రేక్‌ చేస్తూ దేశంలోనే తొలిసారిగా కట్నం ప్రసక్తి లేకుండా వివాహం చేసుకునే యువతీ, యువకులను ప్రోత్సహించేందుకు పదిహేనేళ్ల క్రితం ‘ఐ డోంట్‌ వాంట్‌ డౌరీ.కామ్‌’ అనే పేరుతో హైదరాబాద్‌లో కొందరు వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ‘స్వయంవరం’ పేరుతో శ్రీకారం చుట్టిన ఈ వెబ్‌సైట్‌ సంస్థ నేటి తరం యువతతోపాటు పెద్దలు కూడా మారేలా అవగాహన కల్పిస్తోంది.

వరకట్న నిషేధంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని యైటింక్లయిన్‌కాలనీకి చెందిన టి.శ్రవణ్‌కుమార్‌– కృష్ణకుమారి అనే మాజీ సింగరేణి ఉద్యోగి దంపతులు ‘సదాశయ ఫౌండేషన్‌’ అనే స్వచ్ఛంద సంస్థతో వినూత్న ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. కట్నం తీసుకోకుండా వివాహాలు జరగాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కేవలం ప్రచారం చేయడం వరకే పరిమితం కాకుండా కట్నం తీసుకోకుండా ఇంట్లో పిల్లలకు పెళ్లిల్లు చేసి ఆదర్శంగా నిలిచారు. 1982లో తన సోదరుడు శ్రీనివాస్‌కు గీత అనే అమ్మాయితో కట్నం లేకుండా వివాహం జరిపించాడు. అలాగే 2011లో తమ పెద్ద కుమారుడు విక్రంకు, సౌమ్య అనే అమ్మాయితో కట్నం తీసుకోకుండా వివాహం జరిపించారు. 2013లో కూడా వారి చిన్నకుమారుడు అన్వేష్‌కు సైతం శ్రవంతి అనే అమ్మాయితో కట్నం లేకుండా వివాహం చేసి ఆదర్శంగా నిలిచారు. ప్రతీ ఏడాది ‘వరకట్న వ్యతిరేక దినోత్సవం’ సందర్భంగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ దంపతులను ఆదర్శంగా తీసుకున్న మరో ఆరు కుటుంబాలు కూడా వారి పిల్లలకు కట్నం తీసుకోకుండా పెళ్లిళ్లు చేయడం గమనార్హం.

సిరిసిల్లకల్చరల్‌: పెళ్లి ఇద్దరి జీవితాలను కలిపి శాశ్వతంగా నడిపించేది. జీవితం ఇద్దరిదైనప్పుడు ఒకరు మాత్రమే ఆర్థిక నష్టానికి ఎందుకు లోను కావాలి. అందుకే కట్నం అవసరం లేదనుకోవడం జరిగింది. 20 ఏళ్ల క్రితం జరిగిన విషయం. అప్పట్లో పెళ్లి కుదుర్చుకునే సందర్భంలో కట్నం విషయం అంతగా ప్రస్తావనకు రాలేదు. పైగా సమీప బంధువుల అమ్మాయి కావడం కూడా కారణం కావచ్చు. కట్నం అవసరం లేకుండానే పెళ్లి జరిగింది. 
– కనుకుంట్ల లక్ష్మీపతి– జ్యోత్న్న 

కట్నం వద్దన్నలింగమూర్తి దంపతులు
గోదావరిఖనిలోని సింగరేణి సంస్థ ఓసీపీ–1లో సీనియర్‌ ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్న చెవుడవరపు లింగమూర్తి–రాజరాజేశ్వరి దంపతులు కట్నం తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నారు. సింగరేణిలో మెకానికల్‌ ఫోర్మెన్‌ చేస్తున్న తన పెద్ద కుమారుడు యోగేష్‌ప్రకాష్‌కు కట్నం తీసుకోకుండా రవళికతో 2017లో వివాహం జరిపించారు. కట్నం వద్దంటూ కుమారుడికి పెళ్లి జరిపించిన లింగమూర్తి దంపతులను పలువురు అభినందిస్తున్నారు. కట్నం ముఖ్యం కాదు.. గుణగణాలు ఉంటే చాలు.. అంటూ లింగమూర్తి దంపతులు వరకట్నానికి వ్యతిరేకంగా సమాజంలో పెద్దల మనసు మార్చడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

ఇరువర్గాల పెద్దలను ఒప్పించి..
గోదావరిఖని ఎన్టీపీసీకి చెందిన గోలివాడ ప్రదీప్‌కుమార్‌ 2017లో కేరళ రాష్ట్రం వాయినాడు ప్రాంతానికి చెందిన షాజిత అనే యువతిని కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు. జాతీయ సమైక్యతా భావాన్ని పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన శిబిరంలో నెహ్రూ యువ కేంద్రం తరుఫున పాల్గొన్న ప్రదీప్‌కుమార్‌కు అదే శిబిరంలో పాల్గొన్న షాజిత పరిచయమైంది. తర్వాత పెళ్లి చేసుకోవడానికి ఇరు వర్గాల పెద్దలను ఒప్పించారు. దీంతో కట్నం తీసుకోకుండా షాజితను పెళ్లి చేసుకున్నట్లు ప్రదీప్‌కుమార్‌ తెలిపాడు. పాప రితణ్య పుట్టడంతో చాలా హ్యాపీగా ఉన్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు దంపతులు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top