జంతుహింస.. నేరం


మంచిర్యాల రూరల్ : మానవ ప్రయోజనం కోసం పశువులు, జంతువులకు అనవసరమైన నొప్పి, బాధను కలిగించడాన్ని నిరోధించేందుకు జంతువులపై క్రూరత్వ నివారణ/నిరోధక చట్టం రూపొందింది. దీనిపై అవగాహన లేకుం డా కొందరు రైతులు, జంతు వ్యాపారులు ఇష్టారీతిన పశువులు, జంతువులను హింసకు గురిచేస్తుంటారు.



పశువులు, జంతువులపై క్రూరంగా ప్రవర్తిస్తే వారిపై చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు, పశువులను ఇతర ప్రాంతాలకు తరలించే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను మంచిర్యాల ఏడీఏ కుమారస్వామి వివరించారు. జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం పకడ్బందీగా అమలు చేసేందుకు గత నెలలో కలెక్టర్ సమక్షంలో సమావేశం నిర్వహించారు. ప్రతీ రెవెన్యూ డివిజన్‌లో చట్టం అమలుకు కమిటీలు ఉన్నాయి.



 మండల స్థాయిలోనూ కమిటీలు పనిచేస్తున్నాయి. వీటిలో పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్, అటవీశాఖ, మున్సిపల్ ఇలా 12 నుంచి 20 శాఖల అధికారులు సభ్యులుగా ఉన్నారు. కమిటీల పనితీరు పర్యవేక్షణకు డివిజన్ స్థాయిలో ఆర్డీవో, జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు.

 

చట్టంలోని ముఖ్యాంశాలు..

 జంతువులపై క్రూరత్వ నివారణ/నిరోధక చట్టం 1960 అనుసరించి ప్రభుత్వం పలు సూచనలు చేసింది. ఓవర్ డ్రైవింగ్, ఓవర్ లోడింగ్, అధికంగా కొట్టడం, చిత్రహింస లు వంటి అనవసరమైన నొప్పిని కలిగించే ప్రతీ చర్యను క్రూరత్వంగా పరిగణిస్తారు.

 చిన్న వయస్సులో ఉన్న వాటిని గానీ, వ్యాధి బారిన పడిన పశువులు, జంతువులను గానీ పనులకు ఉపయోగించరాదు.

 అవసరం కోసం లేదా కావాలని శరీరానికి హాని కలిగించే మందులు, పదార్థాలను జంతువులకు ఇవ్వకూడదు.

 పశువులను ఒకచోట నుంచి మరో చోటకు తరలిస్తున్నప్పుడు వాటికి నొప్పి కలిగించకూడదు. ఇరుకుగా ఉన్న వాహనంలో, స్థాయికంటే ఎక్కువగా ఉన్న వాహనంలో ఎక్కువ పశువులను తరలించడం నేరం.

 జంతువులను దాని శరీర ఆకారానికి తగ్గట్లు పంజరం, భాండాగారంలో ఉంచడం సరైన పద్ధతి. అలా కాకుండా ఇరుకుగా ఉండి, దాని కదలికలు కూడా చేయలేని వాటిలో ఉంచడం నేరం.

 పశువులు, జంతువులను అనవసరంగా భారీ గొలుసులతో ఎక్కువ సమయంపాటు కట్టేసి ఉంచడం నేరం.

  చిత్రహింసలకు గురిచేయడం, చంపడం, పోరాటానికి ఎరగా వాడడం నిషేధం.

  అడవుల్లో వన్యప్రాణులను వేటాడం, ఆటవిడుపుగా వన్యప్రాణులను చంపడం నేరం.

 

నేరం, శిక్షలు..

జంతువులను చంపడం, చిత్రహింసలకు గురిచేయడం, ఆటవిడుపుగా హేళన చేయడం వంటి నేరాలకు పాల్పడితే సెక్షన్1(ఏ) ప్రకారం జరిమానా విధిస్తారు.  ఒకవేళ జరిమానా విధించిన తర్వాత మూడేళ్లలో మరోసారి ఇలాంటి తప్పు చేస్తే జరిమానాతోపాటు మూడు నెలల శిక్ష విధిస్తారు.

 ఈ నేరాలకు గల కారణాలను నాన్ కాగ్నిజేబుల్‌గా పరిగణిస్తారు. పట్టుబడ్డ వారిని పోలీసులు వారెంటుతో అరెస్టు చేస్తారు.

 ఒకరికి సంబందించిన పెంపుడు కుక్కను వేరొకరు చంపినప్పుడు అది కాగ్నిజేబుల్ నేరం కింద పరిగణిస్తారు. ఆ వ్యక్తికి ఐపీఎస్ సెక్షన్ 428 కింద జరిమానా లేదా రెండేళ్ల జైలు శిక్ష, కొన్నిసార్లు రెండూ విధించే అవకాశం ఉంది.

 పశువుల యజమానులు పాల దిగుబడిని పెంచేందుకు అనవసరంగా మందులను పలు పద్ధతుల ద్వారా ఎక్కించి బాధ కలిగిస్తారు. వారికి సెక్షన్ 12 ప్రకారం రూ. 1000 జరిమానా లేదా రెండేళ్ల జైలు శిక్ష లేదా రెండు శిక్షలు విధిస్తారు.

 డెయిరీ ఫార్మర్స్ తమ పశువుల పాలదిగుబడిని పెంచేందుకు ఆక్సీటస్ వాడితే సెక్షన్ 12 కింద రెండేళ్ల జైలు శిక్ష విధించడంతోపాటు, డెయిరీ ఫాం యజమానితోపాటు ఆ మందులు అమ్మిన దుకాణం లెసైన్స్ రద్దు చేసి, ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తారు.

 పశువుల సంతలో పశువులను కొనే వ్యక్తి వాటిని ఎందుకు కొంటున్నారనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలి. సంతలో పశువులకు నీటి సౌకర్యంతోపాటు పశువైద్యాధికారి అందుబాటులో ఉండేలా చూడాలి.

 జంతువుల రవాణా నిబంధనలు 1998

 పశువులు, జంతువులను రవాణా చేసేప్పుడు స్థానిక పశువైద్యాధికారి వాటిని పరిశీలించి అవి ఆరోగ్యంగా ఉన్నాయని నిర్దారించిన తర్వాతే తరలించాలి.

 అప్పుడే ఈనిన పశువు లేదా అనారోగ్యంతో ఉన్న పశువును తరలించడం నేరం.

చూడితో ఉన్న పుశువు, లేగదూడలను వేరే పశువులతో కలిపి రవాణా చేయడం నేరం.

అనారోగ్యంతో బాధపడే పశువులను చికిత్స కోసం తరలించేప్పుడు వేరే పశువులతో కలపరాదు.

 

జంతువులను వధించాలంటే..

 సెక్షన్ 2(సీ) ఆఫ్ పీసీఏ 1960 వధశాలలకు నిబంధనలు ఉన్నాయి. వధశాలలు తప్పనిసరిగా లెసైన్స్ పొంది ఉండాలి.

 చూడితో ఉన్న, మూడు నెలల కంటె  తక్కువ వయస్సు ఉన్న జంతువులను వధించడం నిషేధం.

 వధించే ప్రతీ జంతువును పశువైద్యాధికారితో సర్టిఫై చేయించాలి. లేదంటే నేరంగా పరిగణిస్తారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top