‘ఎగ్‌’ నామం..  | Anganwadi Centers Eggs Is Not Distributed | Sakshi
Sakshi News home page

‘ఎగ్‌’ నామం.. 

Apr 17 2019 11:37 AM | Updated on Jul 11 2019 5:40 PM

Anganwadi Centers Eggs Is Not Distributed - Sakshi

సాక్షి, వరంగల్‌ రూరల్‌ : మహిళలు, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలనేది అంగన్‌వాడీ సెంటర్ల లక్ష్యం. ప్రీ స్కూల్‌ ఎడ్యుకేషన్, బాలామృతం, ఆరోగ్యలక్ష్మి , హెల్త్‌ చెకప్‌ వంటి చాలా ప్రాజెక్టులు ఈ సెంటర్ల కిందికే వస్తాయి. మహిళ గర్భవతి అయినప్పటి నుంచి చిన్నారులు పెద్దయ్యేవరకు వారి సంరక్షణ బాధ్యతలు అంగన్‌వాడీలదే. అలాంటి సెంటర్లు అబాసుపాలవుతున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం అందని ద్రాక్షలాగే మారింది. ప్రతీ ఒక్కరికి పౌష్టికాహారం అందించాలని, ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావొద్దనే లక్ష్యంతో ప్రభుత్వం అంగన్‌వాడీలను బలోపేతం చేస్తూ వస్తోంది. '

కాని అధికారుల నిర్లక్ష్యం లబ్ధిదారుల పాలిట శాపంగా మారింది. పౌష్టికాహారం మాట అటుంచితే నెలవారీగాసరఫరా చేసే గుడ్లు సక్రమంగా ఇవ్వకపోవడం గమనార్హం. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని ఉద్దేశంతో నెలలో 16 కోడి గుడ్లను సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత నాలుగు నెలల నుంచి సరఫరా నిలిచిపోవడంతో ప్రత్యామ్నయ ఏర్పాట్లు  చేయలేదు. దీంతో బాలింతలు, గర్బిణీ స్త్రీలు, చిన్నారులకు కోడి గుడ్డు అందడం లేదు. జిల్లాలో నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట ప్రాజెక్టులున్నాయి.

ఈ ప్రాజెక్టుల పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలకు నేరుగా కోడి గుడ్ల సరఫరా చేస్తారు. ప్రతి సంవత్సరం జిల్లా సంక్షేమ శాఖ కోడి గుడ్ల సరఫరాకు టెండర్లు ఆహ్వనిస్తారు. దక్కించుకున్న వారు కోడి గుడ్లను సరఫరా చేస్తుంటారు. నర్సంపేట ప్రాజెక్ట్‌ పరిధిలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు గత నాలుగు నెలలుగా కోడిగుడ్ల సరఫరా నిలిచిపోయింది. గుడ్ల సరఫరా కావడం లేదని అధికారులకు తెలిసినప్పటికీ పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు. గుడ్లు రావడంలేదని బాలింతలు, గర్భిణీలు అంగన్‌వాడీలపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండడంతో వారు సమాధానం చెప్పలేక ఇబ్బందులు పడుతున్నారు. వేగలేక ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదు చేశారు.

టెండర్‌ కొనసాగింపు
అంగన్‌వాడీ కేంద్రాల్లో కోడి గుడ్ల సరఫరా కోసం ప్రతి ఏడు మార్చిలో టెండర్లను ఆహ్వానిస్తారు. కోడి గుడ్ల సరఫరాకు ఎవరు తక్కువ కోడ్‌ వేస్తే వారికి అప్పగిస్తారు. నెక్‌ ధర ప్రకారం కోడి గుడ్డుకు ధరను చెల్లిస్తారు.  ప్రతి ఏడు ఏప్రిల్‌ 1 నుంచి టెండర్‌ ప్రారంభం అవుతుంది. కానీ ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ ఉండటంతో ఏప్రిల్, మే ఈ రెండు నెలలు టెండర్లను పొడిగించారు.

908 అంగన్‌వాడీలు.. 
జిల్లా వ్యాప్తంగా 908 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 76 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు, 832 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. జిల్లాలో మూడు ప్రాజెక్టులు నర్సంపేట. పరకాల, వర్ధన్నపేటలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల వారు 18,074,  3 నుంచి 6 సంవత్సరాల లోపు చిన్నారులు 12,140, గర్భిణీ స్త్రీలు, బాలింతలు ఉన్నారు. 7 నెలల నుంచి 3 సంవత్సరాల వయస్సువారు 18,074 , 3 నుంచి 6 సంవత్సరాల వయస్సు వారు 12,140, గర్భిణీ స్త్రీలు, బాలింతలు 9767 ఉన్నారు.

ఆరోగ్యలక్ష్మి పథకం కింద 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు ఒక పూట భోజనంతో పాటు ఉడికించిన గుడ్లు, కుర్‌కురేలు, గర్భిణీ, బాలింతలకు పోషక విలువలతో కూడిన ఒక పూట సంపూర్ణ భోజనంతో పాటు 200 మి.లీ పాలు, ఉడికించిన గుడ్లు ప్రతీ రోజు అందిస్తున్నారు. 7 నెలల నుంచి 3 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు నెలకు 2.5 కిలోల బాలామృతం, 16 గుడ్లు అందిస్తున్నారు. 

గుడ్లు అందించడంలేదు..
గర్భిణీలకు పౌష్టికాహారం అందిస్తారనే ఉద్దేశంతో అంగన్‌వాడీ సెంటర్లకు వెళ్తున్నాం. కాని అంగన్‌వాడీ సెంటర్‌లో గుడ్లు పెట్టడంలేదు. అంగన్‌వాడీ సెంటర్‌లకు ఐదు ఆరు నెలల నుంచి గుడ్లే రావడం లేదు. మేం కొనుగోలు చేయాలంటే రూ. 5కు ఒక్క గుడ్డు ఉంది. తక్షణమే ప్రభుత్వం స్పందించి అంగన్‌వాడీ సెంటర్లకు గుడ్లు అందించాలి – చిలుక ప్రభావతి,  సర్వాపురం 

ఆ కాంట్రాక్టర్‌ను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టాం
నర్సంపేటకు కోడిగుడ్లను సరఫరా చేసే సదరు కాంట్రాక్టర్‌ను కలెక్టర్‌ ఆదేశాల మేరకు బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టాం.  త్వరలో జిల్లా నెక్‌ కమిటీ ఆధ్వర్యంలో నర్సంపేట పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలకు కోడి గుడ్లను సరఫరా చేస్తాం.–సబిత, జిల్లా సంక్షేమ అధికారి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement