టెన్త్‌ పరీక్షల నిర్వహణకు సిద్ధం

All Set For Tenth Class Students Exams In Telangana - Sakshi

హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం.. విచారణ నేటికి వాయిదా

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలను ఈనెల 8 నుంచి నిర్వహించేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. కరోనా నేపథ్యంలో హైకోర్టు జారీ చేయబోయే మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్షలను నిర్వహిస్తామని, అందుకు అనుమతి ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించింది. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న తరుణంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారో లేదో వివరించాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై తాము నివేదిక అందజేశామని అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ తెలిపారు. తమకు ఆ నివేదిక ప్రతి అందనందున విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. కరోనా వైరస్‌ వ్యాప్తిలో ఉన్నందున పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ ఎం.బాలకృష్ణ దాఖలు చేసిన వ్యాజ్యంతో పరీక్షలను నిర్వహించాలనే నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ సీహెచ్‌ సాయిమణివరుణ్‌ దాఖలు చేసిన మరో ప్రజాహిత వ్యాజ్యాలపై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. పరీక్షలు నిర్వహించరాదని ఇచ్చిన స్టే ఉత్తర్వులను గతంలోనే హైకోర్టు రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 8 నుంచి పరీక్షల నిర్వహణకు తీసుకున్న చర్యలపై నివేదిక ధర్మాసనానికి అందకపోవడంతో విచారణ వాయిదా పడింది.

పరీక్షల నిర్వహణకు పక్కా జాగ్రత్తలు..
‘ఈ నెల 8 నుంచి పరీక్షల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకున్నాం. పరీక్షకు పరీక్షకు మధ్య రెండ్రోజుల వ్యవధి ఉండేలా జాగ్రత్త తీసుకున్నాం. పరీక్షకు ముందు, తర్వాత పరీక్ష కేంద్రాలను, పరిసరాలను, భవనాలను క్రిమిసంహారాలతో శుభ్రం చేస్తాం. చిన్న పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను, పరీక్షలు నిర్వహించే స్థితిలోని పాఠశాలల్లో ఉన్న విద్యార్థులను పెద్ద ప్రాంగణాలున్న పాఠశాలలకు, కాలేజీలకు తరలించేలా చర్యలు తీసుకున్నాం. పరీక్ష కేంద్రంలోకి వెళ్లే విద్యార్థులను స్క్రీనింగ్‌ చేసేందుకు వీలుగా కేంద్రాల వల్ల తగినన్ని థర్మల్‌ స్క్రీనింగ్‌తోపాటు శానిటైజర్లు, మాస్క్‌లు సిద్ధం చేశాం. డీఈవోల పర్యవేక్షణలో హెల్ప్‌లైన్‌ ఏర్పాటుచేసి విద్యార్థుల తల్లిదండ్రులకు పరీక్ష కేంద్రాలు, ఇతర సమాచారాన్ని తెలిపే ఏర్పాట్లు చేశాం.

ఒక్కో పరీక్ష కేంద్రంలో గతంలో 200 – 240 మంది విద్యార్థులుండే సంఖ్యను గరి ష్టంగా 120కి తగ్గించాం. ఒక్కో విద్యార్థి మధ్య 5 నుంచి 6 అడుగుల దూరం ఉండేలా చర్యలు తీసు కుంటాం. పరీక్ష కేంద్రాల్ని 2,530 నుంచి 4,535కి పెంచాం. ఒక్కో ఇన్విజిలేటర్‌ 10 నుంచి 12 మంది విద్యార్థులను మాత్రమే పర్యవేక్షించేలా చూస్తున్నాం. 26,422 మంది అదనపు సిబ్బంది సేవలను వినియోగిస్తాం. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద వైద్య సిబ్బంది ఉంటారు. ఆయుష్‌ శాఖ ద్వారా రోగనిరోధక మం దులు తెప్పించే ప్రయత్నాలు చేస్తున్నాం. జిల్లాల్లో విద్యార్థుల రవాణా సౌకర్యానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం.

జీహెచ్‌ఎంసీ పరిధిలోనూ విద్యార్థుల కోసం బస్సులు నడుపుతాం. పరీక్ష కేంద్రానికి చేరుకునేందుకు హాల్‌టికెట్‌నే ప్రయాణ పాస్‌గా పరిగణిస్తారు. విద్యార్థులు, టీచర్లు, ఇతర సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు ధరించేలా చర్యలు తీసుకుంటాం. విద్యా ర్థులకు థర్మల్‌ పరీక్షలు చేసి, జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్న వారిని ప్రత్యేక గదుల్లో ఉంచుతాం. గదుల వద్ద శానిటైజర్లు, మరుగుదొడ్ల వద్ద సబ్బులు, శానిటైజర్లు అందుబాటులో ఉంటాయి. పరీక్షకు ముందు, తరువాత పరీక్ష కేంద్రాలను సోడి యం హైపోక్లోరైట్‌తో శుభ్రం చేస్తాం. జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడే టీచర్లు, ఇతర సిబ్బందిని విధులకు దూరంగా ఉంచుతాం’అని ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top