
డబుల్ ధమాకా కోసం..
తమను గెలిపిస్తే బడుగు, బలహీన వర్గాల వారందరికీ 125 గజాల్లో రూ.3 లక్షలతో డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇస్తామంటూ టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చినఎన్నికల హామీపై ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు కోటి ఆశలు పెట్టుకున్నారు.
ఖమ్మం హవేలి: తమను గెలిపిస్తే బడుగు, బలహీన వర్గాల వారందరికీ 125 గజాల్లో రూ.3 లక్షలతో డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇస్తామంటూ టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చినఎన్నికల హామీపై ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు కోటి ఆశలు పెట్టుకున్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి రావడంతో.. ఈ హామీ అమలు ప్రక్రియ ప్రారంభం ఎప్పుడెప్పుడా.. అని ఎదురుచూస్తున్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లపై ఆశలు పెట్టుకున్న లబ్ధిదారులు.. ఇప్పటికే మంజూరైన ఇళ్ల నిర్మాణానికి ఆసక్తి చూపడం లేదు. ఇలా, జిల్లాలో 1,15,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. ఇళ్ల మంజూరు కోసం ఇంకా అనేకమంది దరఖాస్తు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఇప్పటికే ఇందిరమ్మ పథకం కింద ఇళ్లు మంజూరైన వారు.. వాటి స్థానంలో కొత్త పథకం కింద డబుల్ బెడ్‌రూం ఇళ్లే కావాలని కోరుతున్నారు. గత ఎన్నికల ముందు ‘రచ్చబండ’లో 61,958 ఇళ్లు మంజూరవగా.. కేవలం 1800 మాత్రమే నిర్మాణం పూర్తయ్యాయి. మరో 10,420 ఇళ్లు ప్రారంభ దశలో ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 2006-2007 నుంచి ఇప్పటివరకు మొత్తం 4,01,000 ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలతో 1,15,000 ఇళ్ల నిర్మాణం ఇంతవరకు ప్రారంభమే కాలేదు.
2,22,000 ఇళ్లు పూర్తయ్యాయి. మరో 64,000 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. నిర్మించిన ఇళ్ల కోసం 2006-07 నుంచి ఇప్పటివరకు జిల్లాలో 1,017 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి 1,19,000 ఇళ్లు నిర్మాణం పూర్తయింది. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం హామీతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కొత్త పథకం కింద వచ్చే ఇళ్లు మాత్రమే కావాలని లబ్ధిదారులు కోరుతున్నారని, గతంలో మంజూరైన ఇళ్లను నిర్మించేది లేదని చెబుతున్నారని గృహ నిర్మాణ అధికారులు చెబుతున్నారు.
కొత్త గృహ నిర్మాణ పథకం విధివిధానాల కోసం గృహ నిర్మాణ శాఖ అధికారులు కూడా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గత మార్చి 17 నుంచి మే 24 వరకు ఆన్‌లైన్ చేసిన బిల్లులు నిలిచిపోయాయి. మే 24న ఆన్‌లైన్ ప్రక్రియను క్లోజ్ చేశారు. జిల్లాకు సంబంధించి 45కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆన్‌లైన్ ప్రక్రియ తిరిగి ప్రారంభమైతేనే ఈ బిల్లులు లబ్ధిదారుల ఖాతాలో నేరుగా జమవుతాయని గృహ నిర్మాణ శాఖ జిల్లా ప్రాజెక్టు డెరైక్టర్ వైద్యం భాస్కర్ తెలిపారు.