Indiramma House Beneficiaries
-
ఇందిరమ్మ ఇళ్లలో ఇష్టారాజ్యం
సాక్షి, రంగారెడ్డిజిల్లా: పారదర్శకంగా జరగాల్సిన ఇందిరమ్మ ఇళ్ల అర్హుల ఎంపిక పూర్తిగా రాజకీయ కోణంలో జరిగినట్లు.. సిఫార్సులకే పెద్దపీట వేసినట్టు విమర్శలు వస్తున్నాయి. అధికారుల క్షేత్రస్థాయి సర్వేకు భిన్నంగా అర్హుల జాబితా రూపొందినట్లు ఆరోపణలు లేకపోలేదు. మొదటి విడత పైలెట్ ప్రాజెక్టులో భాగంగా కొంత వరకు అర్హులకే ఇళ్లు దక్కినప్పటికీ.. రెండో విడత జాబితా తయారీ పూర్తిగా ఎమ్మెల్యే, వారి అనుచరుల కనుసన్నల్లో పూర్తయింది. ఇందిరమ్మ కమిటీలు సిఫార్సు చేసిన కార్యకర్తలు/ఓటర్లకే ఇళ్లను కట్టబెట్టినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అర్హులకు బదులు అనర్హులు వచ్చి చేరినట్లు సమాచారం. విషయం అధికారులకు తెలిసీ ఏమీ చేయలేక.. వారు సూచించిన పేర్లను లబ్ధిదారుల జాబితాలో చేర్చుతున్నట్టు తెలుస్తోంది. ఫలితంగా పేదల సొంతింటి కల నెరవేరకుండా పోతోంది. రాజకీయ జోక్యంతో.. ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం జిల్లా వ్యాప్తంగా 80.54 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కులగణన/ఇంటింటి సర్వేలో భాగంగా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అర్హులను గుర్తించారు. సర్వేలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, జియో ట్యాగింగ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. ఎంపిక చేసిన బృందాలు దరఖాస్తు దారుని ఇంటికి చేరుకుని వివరాలు సేకరించాయి. ఒక కుటుంబానికి ఒకే ఇల్లు కేటాయించేలా జాబితా రూపొందించారు. అర్హులైన లబ్ధిదారుల జాబితాను తొలుత ఎంపీడీఓలు/ మున్సిపల్ కమిషనర్ల లాగిన్లో ఉంచారు. గ్రామ సభలు/వార్డు సభల్లో ఆయా లబ్ధిదారుల జాబితాను చదివి విన్పించారు. తీరా తుదిజాబితా (Final List) రూపకల్పనలో రాజకీయ పైరవీకారులకే పెద్దపీట వేసినట్లు తెలిసింది.తొలి విడతలో 15 వేల ఇళ్లు మంజూరు కాగా, వీరిలో ఇప్పటికే ఏడు వేల మందిని ఎంపిక చేసి, వారికి ధ్రువీకరణ పత్రాలు సైతం జారీ చేశారు. మిగిలిన వారికి మరో రెండు మూడు రోజుల్లో అందజేయాల్సి ఉంది. పారదర్శకంగా, నిజాయితీగా పేదలకు దక్కాల్సిన ఇళ్లు రాజకీయ జోక్యంతో పార్టీ నాయకులు తన్నుకుపోతున్నారు. ఎమ్మెల్యే చెప్పిన వారి పేర్లను మాత్రమే జాబితాలో చేర్చుతుండటం.. ఎండీఓ, మున్సిపల్ కమిషనర్లు వాటినే ధ్రువీకరిస్తుండటం.. కలెక్టర్, జిల్లా ఇన్చార్జి మంత్రి వాటికి ఆమోదముద్ర వేస్తుండటం వివాదాస్పదంగా మారుతోంది. అందని ఆర్థిక సాయం.. పెరిగిన సిమెంట్ ధర మరోవైపు ఇందిరమ్మ ఇల్లు మంజూరై, సొంత ఖర్చులతో బేస్మెంట్ వరకు పూర్తి చేసిన వారికి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఆర్థిక సహకారం అందకపోవడంతో వారు అయోమయంలో పడి పోయారు. ఇప్పటికే చేతిలో ఉన్న సొమ్ము పూర్తిగా ఖర్చు కాగా, కొత్తగా మార్కెట్లో అప్పు పుట్టని పరిస్థితి. అంతేకాదు ఇంటి నిర్మాణం 600 చదరపు అడుగుల విస్తీర్ణానికి మించకూడదనే నిబంధనకు తోడు ఇటీవల పెరిగిన సిమెంట్, కూలీ ధరలు కూడా లబ్ధిదారుల పాలిట శాపంగా మారుతున్నాయి. ఏప్రిల్ నెలాఖరు వరకు సిమెంట్ బస్తా రూ.290 నుంచి రూ.300 వరకు ఉండగా, ప్రస్తుతం ఒక్కో బస్తా ధర (కంపెనీని బట్టి) రూ.30 నుంచి రూ.50 వరకు పెరిగింది. పెరిగిన ధరలు భారంగా మారనుండటంతో మెజార్టీ లబ్ధిదారులు పిల్లరు గుంతలు, బేస్మెంట్ దశలోనే నిర్మాణాలను నిలిపివేయడం గమనార్హం. ఇదిలా ఉంటే కొంత మంది మధ్యవర్తులు కొత్తగా ఇళ్లు కట్టుకోవాలని భావించే ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేని సాధారణ మధ్య తరగతి ప్రజలకు ఇళ్లు మంజూరు చేయిస్తామని ఆశ చూపించి, వారి నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.చదవండి: హైదరాబాద్ మెట్రోకు అరుదైన గౌరవం -
డబుల్ ధమాకా కోసం..
ఖమ్మం హవేలి: తమను గెలిపిస్తే బడుగు, బలహీన వర్గాల వారందరికీ 125 గజాల్లో రూ.3 లక్షలతో డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇస్తామంటూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చినఎన్నికల హామీపై ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు కోటి ఆశలు పెట్టుకున్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో.. ఈ హామీ అమలు ప్రక్రియ ప్రారంభం ఎప్పుడెప్పుడా.. అని ఎదురుచూస్తున్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లపై ఆశలు పెట్టుకున్న లబ్ధిదారులు.. ఇప్పటికే మంజూరైన ఇళ్ల నిర్మాణానికి ఆసక్తి చూపడం లేదు. ఇలా, జిల్లాలో 1,15,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. ఇళ్ల మంజూరు కోసం ఇంకా అనేకమంది దరఖాస్తు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఇందిరమ్మ పథకం కింద ఇళ్లు మంజూరైన వారు.. వాటి స్థానంలో కొత్త పథకం కింద డబుల్ బెడ్రూం ఇళ్లే కావాలని కోరుతున్నారు. గత ఎన్నికల ముందు ‘రచ్చబండ’లో 61,958 ఇళ్లు మంజూరవగా.. కేవలం 1800 మాత్రమే నిర్మాణం పూర్తయ్యాయి. మరో 10,420 ఇళ్లు ప్రారంభ దశలో ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 2006-2007 నుంచి ఇప్పటివరకు మొత్తం 4,01,000 ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలతో 1,15,000 ఇళ్ల నిర్మాణం ఇంతవరకు ప్రారంభమే కాలేదు. 2,22,000 ఇళ్లు పూర్తయ్యాయి. మరో 64,000 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. నిర్మించిన ఇళ్ల కోసం 2006-07 నుంచి ఇప్పటివరకు జిల్లాలో 1,017 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి 1,19,000 ఇళ్లు నిర్మాణం పూర్తయింది. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం హామీతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కొత్త పథకం కింద వచ్చే ఇళ్లు మాత్రమే కావాలని లబ్ధిదారులు కోరుతున్నారని, గతంలో మంజూరైన ఇళ్లను నిర్మించేది లేదని చెబుతున్నారని గృహ నిర్మాణ అధికారులు చెబుతున్నారు. కొత్త గృహ నిర్మాణ పథకం విధివిధానాల కోసం గృహ నిర్మాణ శాఖ అధికారులు కూడా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గత మార్చి 17 నుంచి మే 24 వరకు ఆన్లైన్ చేసిన బిల్లులు నిలిచిపోయాయి. మే 24న ఆన్లైన్ ప్రక్రియను క్లోజ్ చేశారు. జిల్లాకు సంబంధించి 45కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఆన్లైన్ ప్రక్రియ తిరిగి ప్రారంభమైతేనే ఈ బిల్లులు లబ్ధిదారుల ఖాతాలో నేరుగా జమవుతాయని గృహ నిర్మాణ శాఖ జిల్లా ప్రాజెక్టు డెరైక్టర్ వైద్యం భాస్కర్ తెలిపారు.