గతుకుల రోడ్లపై హ్యాపీ జర్నీ.. | Sakshi
Sakshi News home page

గతుకుల రోడ్లపై హ్యాపీ జర్నీ..

Published Thu, Oct 24 2019 7:55 AM

Air suspension seats For Bikes And Cars - Sakshi

ఒకవైపు మెట్రో నిర్మాణ పనులు, మరోవైపు ఫ్లై ఓవర్‌ నిర్మాణాలు.. వీటికి తోడు నాణ్యతలేని రోడ్లు.. చిన్నపాటి వర్షానికే ఎక్కడికక్కడ గుంతలమయంగా మారుతున్నాయి. నగరంలోని వందలాది కిలోమీటర్ల పొడవునా ఈ గుంతలే దర్శనమిస్తున్నాయి. బండి నడపాలంటేనే భయమేస్తుంది. మరోవైపు ట్రాఫిక్‌ రద్దీ. గంటల తరబడి రోడ్లపై పడిగాపులు. ఈ పరిస్థితుల్లో ప్రయాణంలో ఎలాంటి అలసట లేకుండా సాగిపోయేందుకు ఈ కొత్త సీటింగ్‌ సదుపాయం దొహదం చేస్తుందంటున్నారు తయారీదారులు. వీటిని https://bit.ly/338bHtr లింక్‌ ద్వారా బుక్‌ చేసుకోవచ్చంటున్నారు.

సాక్షి,సిటీబ్యూరో: నగర రోడ్లపై అడుగడుగునా గుంతలు.. అరగంట పాటు బండి నడిపితే వెన్ను నొప్పితో పాటు నడుము పట్టేస్తుంది. చినుకు పడితే చిత్తడిగా మారే రోడ్లుపై వాహనాలు నడపడం నరకప్రాయమే. ఎక్కడ ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి. అలాగని ఇంటి నుంవచి బండి బయటకు తీయకుండా ఉండలేం. నగరంలో ఏ చిన్న అవసరానికైనా ద్విచక్ర వాహనం నిత్యావసరం. ఇలాంటి పరిస్థితుల్లో గతుకుల రోడ్లపై, గుంతల్లోంచి బండి నడుపుతూ వెన్ను, నడుం నొప్పితో సర్వైకల్‌ స్పాండిలైటిస్‌ వంటి వ్యాధుల బారిన పడకుండా ఉండగలమా! నగర రహదారులపై బైక్‌లు, కార్లలో సాఫీగా ప్రయాణం చేయగలమా!!.. అంటే సాధ్యమేనంటోంది హైదరాబాద్‌ కేంద్రంగా ఆవిర్భవించిన ‘ఫీల్‌గుడ్‌ ఇన్నొవేషన్స్‌’ స్టార్టప్‌ సంస్థ. గతేడాది ఫిబ్రవరిలో  అహ్మదాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహుకు పరిచయం చేసిన 10 స్టార్టప్‌ సంస్థల్లో ఇది ఒకటి. ఎయిర్‌ సస్పెన్షన్‌ పద్ధతిలో రూపొందించిన సీట్లను వినియోగించడం ద్వారా వెన్ను నొప్పి సమస్య లేకుండా బైక్‌పై సాఫీ సాగిపోవచ్చని చెబుతున్నారు ఈ సంస్థ వ్యవస్థాపక ఇంజినీరింగ్‌ నిపుణులు మాధవరెడ్డి, సంతోష్‌కుమార్, విశ్వనాథ్‌. వీరు కలిసి చేసిన కుషన్‌ ప్రయోగం విజయవంతమైంది. కారు, బైక్‌ నడిపే సమయంలో డ్రైవర్‌కు సీటుకు మధ్య ఒక గాలిపొరతో కూడిన సీటింగ్‌ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తారు. ఇది కుదుపుల వల్ల వచ్చే ఒత్తిడిని డ్రైవింగ్‌ చేసే వ్యక్తులపై పడకుండా నిరోధిస్తుంది. 

బైక్‌ కోసం రూపొందించిన ఎయిర్‌ కుషన్‌ సీటు
ఇక సాఫీగా ప్రయాణం
బైక్, కారు నడిపేటప్పుడు కుదుపులను ఎదుర్కొనేందుకు ఇప్పటి వరకు జెల్, కుషన్, ఫోమ్‌ సీట్లను వినియోగిస్తున్నారు. కానీ వీటి నుంచి లభించే ప్రయోజనం చాలా తక్కువ. ఫీల్‌గుడ్‌ ఇన్పొవేషన్స్‌ రూపొందించిన ఫిగో సెయిల్‌ స్పోర్ట్, ఫిగో సెయిల్‌ పిలియన్, ఫిగో ఫ్లోట్‌ మూడు రకాల సీటింగ్‌ సదుపాయం ఎంతటి బలమైన కుదుపులనైనా తట్టుకొనే సామర్థ్యంతో ఉంటాయి. వాహనాలు గుంతల్లో పడినప్పుడు వెన్నుపై ఒత్తిడి పడకుండా సీటింగ్‌ మధ్యలో ఉన్న గాలిపొర అడ్డుకుంటుంది. దీంతో కనీసం 2 గంటల పాటు హాయిగా బండి నడపవచ్చునని చెబుతున్నారు సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన విశ్వనాథ్‌ మల్లాది. ‘మేం రూపొందించిన ఈ సీటింగ్‌ సదుపాయం వల్ల ఒక గాలిపొరపై కూర్చుని బండి నడుపుతున్నట్లుంటుంది’ అని చెప్పారు. ఫీల్‌గుడ్‌ ఇన్నొవేషన్స్‌ గతంలో కేవలం స్పోర్ట్స్‌ బైక్‌లను దృష్టిలో ఉంచుకొని సీట్లను రూపొందించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇప్పుడు అన్ని రకాల వాహనాలకు వినియోగించే అనువైన సీటింగ్‌ను అందుబాటులోకి తెచ్చారు. కార్లు, బైక్‌లకు షాక్‌ అబ్జర్వర్స్‌ వల్ల కొంతమేర ఒత్తిడి తగ్గుతుంది. మిగతా ఒత్తిడిని ఈ సరికొత్త ఎయిర్‌ సస్పెన్షన్‌ సీట్లు నిరోధిస్తాయి. ప్రస్తుతం ఈ సీట్లను ఆన్‌లైన్‌ ద్వారా విక్రయిస్తున్నారు. 

Advertisement
Advertisement