డీఐఎంఎస్‌లో ఏసీబీ తనిఖీలు

ACB Raids On ESI Health Department In Telangana - Sakshi

బీమా వైద్య సేవల విభాగం నుంచి పలు దస్త్రాల సేకరణ 

పూర్తి స్థాయి పరిశీలన తర్వాతే విజిలెన్స్‌కు నివేదిక 

వారంలోపు సమర్పించే అవకాశం 

సాక్షి, హైదరాబాద్‌: కార్మిక శాఖ పరిధిలోని బీమా వైద్య సేవల విభాగాన్ని (ఐఎంఎస్‌) అవినీతి నిరోదక శాఖ (ఏసీబీ) జల్లెడ పడుతోంది. ఔషధ కొనుగోళ్లు, వైద్య పరీక్షల కిట్ల కొనుగోళ్లలో భారీగా అవకతవకలు జరిగినట్లు ప్రభుత్వం అంతర్గత పరిశీలనలో స్పష్టం కావడంతో వాస్తవ పరిస్థితిని పరిశీలించేందుకు ఏసీబీ రంగంలోకి దిగింది. కొనుగోళ్ల వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావడంతో గతంలో విజిలెన్స్‌ విభాగం ప్రత్యేక పరిశీలన నిర్వహించి నివేదికను ప్రభుత్వానికి సమర్పించగా.. తాజాగా మరింత లోతైన అధ్యయనం కోసం ప్రభుత్వం ఏసీబీని రంగంలోకి దింపింది. ఆర్థికపరమైన అంశాలను నిగ్గు తేల్చడంలో ఏసీబీ సమర్థవంతమైనది కావడంతో ఆ బాధ్యతను ప్రభుత్వం ఏసీబీకి అప్పగించింది.

ఈ క్రమంలో బీమా వైద్య సేవల విభాగం సంచాలక కార్యాలయం నుంచి కీలక పత్రాలను పరిశీలించారు. వారికి అవసరమైన సమాచారాన్నంతా రికార్డు చేసుకున్నారు. అదేవిధంగా గత ఐదేళ్లలో కొనుగోలు చేసిన సరుకులు, పరికరాల తాలూకు బిల్లులతోపాటు టెండర్లు, కాంట్రాక్టర్ల ఎంపిక ప్రక్రియకు సంబంధించిన సమాచారాన్ని సైతం సేకరించారు. ప్రస్తుతం వాటిని విశ్లేషిస్తున్నారు. నిబంధనల ప్రకారమే జరిగాయా లేక అవకతవకలు జరిగాయా అనే కోణంలో లోతైన పరిశీలన చేస్తున్నట్లు ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి. ఆ శాఖ జరిపిన లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత పరిశీలన నివేదికను తిరిగి విజిలెన్స్‌కు ఇవ్వనున్నట్లు తెలిసింది.
 
డీఐఎంఎస్‌లో వణుకు.. 
అవినీతి ఆరోపణలతో ఏసీబీ యంత్రాంగం బీమా వైద్య సేవల సంచాలకుల (డీఐఎంఎస్‌) కార్యాలయంలో తనిఖీలు నిర్వహించడంతో ఆ విభాగంలోని ఉద్యోగుల్లో వణుకు మొదలైంది. ఈఎస్‌ఐ ఆస్పత్రుల నిర్వహణంతా ఈ శాఖ ద్వారానే జరుగుతుంది. ఈఎస్‌ఐ ఉద్యోగుల వైద్య సేవలకు సంబంధించి మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ పంపిణీ కూడా ఇదే శాఖ నిర్వహిస్తోంది. వైద్య బిల్లులు కోసం వచ్చే కార్మికుల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నయనేది ఈ కార్యాలయంపై ప్రధాన ఆరోపణ. మరోవైపు మందులు, మెడికల్‌ కిట్ల కొనుగోళ్లలో అవకతవకలను విజిలెన్స్‌ సైతం ప్రాథమికంగా నిర్ధారించడంతో కార్యాలయ అవినీతి భాగోతం బట్టబయలైంది. తాజాగా ఏసీబీ అధికారుల తనిఖీలతో ఉద్యోగులంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అన్ని సెక్షన్లకు అవినీతి మరకలు ఉండటంతో కొందరు సిబ్బంది సెలవులు పెట్టేశారు. మరికొందరు కార్యాలయానికి వచ్చినప్పటికీ ఎవరితోనూ మాట్లాడకుండా కుర్చీకే పరిమితమయ్యారు. తాజాగా డీఐఎంఎస్‌ కార్యాలయంలోకి ఇతరులను అనుమతించకపోవడం గమనార్హం.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top