నా భార్య వేధిస్తోంది.. న్యాయం చేయండి | Sakshi
Sakshi News home page

నా భార్య వేధిస్తోంది.. న్యాయం చేయండి

Published Tue, May 5 2015 9:32 AM

A husband complain on his wife

సంగారెడ్డి క్రైం: తన భార్య తనతో పాటు పిల్లలనూ ఇంటి నుంచి గెంటి వేసి, తప్పుడు కేసులు పెడతానని భయపెడుతోందని మునిపల్లి మండలం మల్లారెడ్డిపేటకి చెందిన మచ్కూరి చంద్రయ్య ఆరోపించారు. తన భార్య కవిత వేధింపులకు గురిచేయడమేగాక రూ.40 లక్షలు ఇవ్వాలని, లేకుంటే కేసులు పెడతానని బెదిరిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని సోమవారం ఆయన జిల్లా ఎస్పీని కలిసి గ్రీవెన్స్‌లో వినతిపత్రం సమర్పించారు.
     
కల్హేర్ మండలం నాగ్దర్‌కు చెందిన మేత్వారి గోపాల్‌తో ఐదేళ్ల క్రితం పెళ్లి జరిగిందని సదాశివపేటకు చెందిన సుమలత పేర్కొంది. తమకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని చెప్పారు. కాగా గత నెల గోపాల్ మరో మహిళతో రెండో వివాహం చేసుకున్నాడని, తనకు న్యాయం చేయాలని కోరారు. అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేస్తున్న భర్త, కుటుంబ సభ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సదాశివపేట మండలం నందికంది గ్రామానికి చెందిన స్వప్న కోరారు.
     
గజ్వేల్‌మండలం ప్రజ్ఞాపూర్ రాజీవ్హ్రదారి పక్కన 22 గుంటల భూమి వుందని, ఆ భూమిని హెచ్‌పీ పెట్రోల్ బంక్ యజమానులు సురేష్‌కుమార్, స్వామిగౌడ్, మధుకర్‌గౌడ్, విజయభాస్కర్‌లు స్వాధీనం చేసుకున్నారని బాధితురాలు లక్ష్మి ఆరోపించింది. అదేమిటని ప్రశ్నించిన తనను చంపుతానని బె దిరిస్తున్నారని తెలిపింది. తగు చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని కోరింది.

ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన కొడుకుకు మాయమాటలు చెప్పి 60 తులాల వెండిని ఎర్రొల్ల లింగం, శ్రీనివాస్ అనే వ్యక్తులు దొంగిలించారని సిద్దిపేట మండలం తడ్కపల్లికి చెందిన బైండ్ల పుష్ప ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకొని తన వెండి వస్తువులు ఇప్పించాలని ఎస్పీని కోరారు.

Advertisement
 
Advertisement
 
Advertisement