మైనార్టీ గురుకుల కాలేజీల్లో 960 సీట్లు 

960 seats in Minority Gourmet Colleges - Sakshi

ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ఆహ్వానం 

నేడు అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్‌ జారీ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన మైనార్టీ గురుకుల జూనియర్‌ కాలేజీల్లో 2018–19కి ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం తెలంగాణ రాష్ట్ర మైనార్టీ గురుకులాల విద్యా సంస్థల సొసైటీ (టెమ్రీస్‌) చర్యలు చేపట్టింది. 12 జూనియర్‌ కళాశాల్లో ఇంటర్‌ ఫస్టియర్‌లో 960 సీట్లను భర్తీ చేయనుంది. 11 గురుకులాల్లో ఎంపీసీ, బైపీసీ గ్రూపులు ఏర్పాటు చేస్తోంది, నిజామాబాద్‌లో సీఈసీ, ఎంఈసీ గ్రూపులు మాత్రమే ఏర్పాటు చేస్తోంది. ప్రతి సెక్షన్‌లో 40 చొప్పున ఎంపీసీలో 440, బైపీసీలో 440 సీట్లు భర్తీ చేయనుంది. సీఈసీలో 40, ఎంఈసీలో 40 సీట్లు భర్తీ చేసేలా ప్రణాళిక రూపొందించింది.

12 మైనార్టీ గురుకుల జూనియర్‌ కళాశాలల్లో బాలికలకు మూడింటిని ప్రత్యేకంగా కేటాయించింది. రంగారెడ్డి జిల్లాలోని హయత్‌నగర్‌(బాలుర), ఇబ్రహీంపట్నం(బాలికల), నిజామాబాద్‌(బాలుర), కామారెడ్డి(బాలుర), నల్లగొండ జీవీగూడెం(బాలుర), నల్లగొండ(బాలికల), వరంగల్‌ రంగసాయిపేట(బాలుర), మహబూబ్‌నగర్‌(బాలుర), వనపర్తి (బాలుర), హైదరాబాద్‌ బార్కాస్‌(బాలుర), సంగారెడ్డి(బాలుర), జహీరాబాద్‌(బాలుర) జూనియర్‌ కాలేజీలు ప్రారంభం కానున్నాయి.  

15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు 
మైనార్టీ గురుకుల జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం శనివారం నోటిఫికేషన్‌ జారీ కానుంది. ఈ నెల 5 నుంచి 15 వరకు ఆన్‌లైన్‌లో అడ్మిషన్‌ కోసం ఎలాంటి రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. 16 నుంచి 20 వరకు పదో తరగతిలో వచ్చిన గ్రేడ్‌ల ఆధారంగా విద్యార్థుల ఎంపిక, 21న ఎంపికైన వారి జాబితా విడుదల, 22 నుంచి 25 వరకు ఎంపికైన విద్యార్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఉంటుంది. జూన్‌ 1 నుంచి తరగతులు ప్రారంభించేలా టెమ్రీస్‌ చర్యలు చేపట్టింది. మొత్తం సీట్లలో 75% సీట్లు మైనారిటీలకు, 25% మైనార్టీయేతరులకు కేటాయిస్తారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top