9 స్థానాలకు ఉప ఎన్నిక తప్పదా? | 9 seats in sub election | Sakshi
Sakshi News home page

9 స్థానాలకు ఉప ఎన్నిక తప్పదా?

Jan 28 2015 3:26 AM | Updated on Sep 2 2017 8:21 PM

రాష్ట్రంలో ఉప ఎన్నికల నగారా మోగనుందా... టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇదే ఆలోచనలో ఉన్నారా..

⇒ టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేల రాజీనామాపై జోరుగా చర్చ
⇒ అనర్హత వేటుపై పెండింగ్‌లో స్పీకర్ నిర్ణయం
⇒ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు యోచనపై ఊహాగానాలు

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉప ఎన్నికల నగారా మోగనుందా... టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇదే ఆలోచనలో ఉన్నారా.. ప్రస్తుతం రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ ఇది. వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్న తొమ్మిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంపై స్పీకర్ నిర్ణయం ఇంకా పెండింగ్‌లో ఉంది. అలాగే మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న తలసాని శ్రీనివాస్‌యాదవ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

దీనిపైనా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని టీడీపీ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించింది. అలాగే వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్, టీడీపీలు సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు గడ్డం విఠల్‌రెడ్డి, కనకయ్య, రెడ్యానాయక్, కాలే యాదయ్యతోపాటు టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్‌యాదవ్, తీగల కృష్ణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు చెందిన మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లు తమ తమ పార్టీలను వదిలి టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయా పార్టీల నాయకత్వాలు వీరిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ మధుసూదనాచారికి ఫిర్యాదు చేశాయి.

ఈ పరిస్థితుల్లో తమ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చే యించి ఉప ఎన్నికలకు వెళ్లాల్సిన అనివార్య పరిస్థితి ఉందన్నది రాజకీయవర్గాల అభిప్రాయం. వీరిపై అనర్హత వేటు వేయకుండా, లేదంటే రాజీనామానాలు చేయించకుండా సభలోనే ఉంచి నడిపించడం అంత తేలికైన విషయం కాదని, ఉప ఎన్నికలకు పోవడం ఒక్కటే టీఆర్‌ఎస్ ముందున్న ఏకైక మార్గమని పరిశీ లకులు విశ్లేషిస్తున్నారు. దీనిపై సీఎం కేసీఆర్ మదిలో ఏముందన్నది టీఆర్‌ఎస్ వర్గాల్లోనే స్పష్టత లేదు. పార్టీలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయిస్తే, 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement