కుక్కకాటుతో చిన్నారి జీవితంలో చీకట్లు | 8 year old girl severely bitten by Dog | Sakshi
Sakshi News home page

కుక్కకాటుతో చిన్నారి జీవితంలో చీకట్లు

Aug 13 2015 6:08 PM | Updated on Sep 29 2018 3:55 PM

కుక్క కాటుకు గురైన ఓ చిన్నారి తన జీవితాన్ని కోల్పోయింది. మెదడుకు తీవ్ర గాయం కావటంతో జీవచ్ఛవంలా గడపాల్సిన దయనీయ స్థితిలో కన్నవారికి తీవ్ర వేదనను మిగిల్చింది.

లంగర్‌హౌస్ (హైదరాబాద్) : కుక్క కాటుకు గురైన ఓ చిన్నారి తన జీవితాన్ని కోల్పోయింది. మెదడుకు తీవ్ర గాయం కావటంతో జీవచ్ఛవంలా గడపాల్సిన దయనీయ స్థితిలో కన్నవారికి తీవ్ర వేదనను మిగిల్చింది. ఈ సంఘటన లంగర్‌హౌస్‌లో చోటు చేసుకుంది. ఎస్సై ఐలయ్య తెలిపిన వివరాల ప్రకారం... లంగర్ హౌస్ డిఫెన్స్ కాలనీలో అమీన్ ఉల్ రెహమాన్ ఇంట్లో సమీఉల్ రెహమాన్ అనే వ్యక్తి కుటుంబంతో అద్దెకు ఉంటున్నాడు. ఈ నెల 7వ తేదీన సమీ కుమార్తె ఆయేషా (8) ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా అమీన్ పెంపుడు కుక్క దాడి చేసి, తీవ్రంగా గాయపరిచింది. తలకు తీవ్ర గాయం కాగా వెంటనే ఆస్పత్రికి తరలించారు. దాదాపు లక్ష రూపాయలు వెచ్చించి ఆమెకు ఆపరేషన్ చేయించారు.

అయితే మెదడుకి తీవ్ర గాయం కావటంతో ఇక ఆ బాలికకు ఏమీ గుర్తుండవనే నిజాన్ని వైద్యులు చెప్పటంతో సమీఉల్ రెహమాన్ హతాశుడయ్యాడు. యజమాని పెంపుడు కుక్క పలువురిపై దాడి చేసి గాయపరిచిందని, అలా వదిలేయవద్దని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని సమీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు అమీన్ ఉల్ రహమాన్, వాచ్‌మన్ హుస్సేన్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉంది. చలాకీగా కళ్ల ముందు ఆడుతూ, నవ్వుతూ తిరిగిన తమ కుమార్తె ఒక్కసారిగా ఇలా మారిపోవడంతో ఆమె తల్లిదండ్రుల రోదనకు అంతే లేకుండా పోయింది.

Advertisement
 
Advertisement
Advertisement