బాలికను పీక్కుతిన్న కుక్కలు | 3 Year Old Girl Dies After Stray Dog Attack | Sakshi
Sakshi News home page

బాలికను పీక్కుతిన్న కుక్కలు

Apr 21 2026 1:04 AM | Updated on Apr 21 2026 1:03 AM

3 Year Old Girl Dies After Stray Dog Attack

సుల్తానాబాద్‌ రూరల్‌: ఆరుబయట ఆడుకుంటున్న ఓ బాలిక (3)పై దాడిచేసిన కుక్కలు.. నోటకరుచుకుని పొలాల్లోకి లాక్కెళ్లి పీక్కుతిన్నాయి. ఈ హృదయవిదారక ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం కాట్నపల్లి గ్రామ శివారులోని ఇటుకబట్టీల్లో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్సై చంద్రకుమార్, వలస కారి్మకుల కథనం ప్రకారం.. ఒడిశా రాష్ట్రం సుల్‌సుల్యా ప్రాంతానికి చెందిన సరస్వతి బెహ్రా–బాబుబెహ్రా తమ కుమారుడు అజుస్‌ బెహ్రా (6), కూతురు దివ్య బెహ్రా(3)తో కలిసి ఐదునెలల క్రితం సుల్తానాబాద్‌ మండలం కాట్నపల్లిలోని భారణి (బీబీఏ) ఇటుకబట్టీలో పనికి కుదిరారు.

సరస్వతి బెహ్రా అప్పటికే గర్భవతి. ఈక్రమంలో మూడు నెలల క్రితం సుల్తానాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో మరో ఆడశిశువుకు జన్మనిచ్చింది. అయితే, సోమవారం సెలవు కావడంతో ఇటుకబట్టీలోని కార్మికులు తమ పనుల కోసం సుల్తానాబాద్‌ పట్టణానికి వెళ్లారు. పలువురు పిల్లలు అక్కడ ఆడుకుంటుండగా చూసిన దివ్య బెహ్రా అటుగా వెళ్లింది. 

ఏమైందో ఏమోగానీ.. ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు పాప కనిపించక పోవడంతో వెతికారు. ఈ క్రమంలో పంటపొలాల్లో దివ్య జీవచ్ఛవంలా పడిఉండడాన్ని గుర్తించి బోరుమన్నారు. వీధి కుక్కలు దాడి చేయడంతోపాటు నోట కరుచుకొని పంట పొలాల్లోకి ఈడ్చుకెళ్లి పీక్కుతినడంతో మృతి చెందినట్లు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement