
30 ఏళ్ల కిందటి పథకాలున్నాయా!
‘ఇరవై, ముప్ఫై ఏళ్ల కిందటి కాలం చెల్లిన పథకాలు ఇప్పటికీ రాష్ట్ర బడ్జెట్‌లో ఉన్నాయి. ఇవి అవసరం లేనివి కాదా? ఇప్పుడు వీటికేమైనా ప్రాధాన్యముందా?
బడ్జెట్ పద్దులపై సీఎస్ విస్మయం
సాక్షి, హైదరాబాద్: ‘ఇరవై, ముప్ఫై ఏళ్ల కిందటి కాలం చెల్లిన పథకాలు ఇప్పటికీ రాష్ట్ర బడ్జెట్‌లో ఉన్నాయి. ఇవి అవసరం లేనివి కాదా? ఇప్పుడు వీటికేమైనా ప్రాధాన్యముందా? ఎప్పుడైనా సమీక్షించుకున్నారా’ అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ వివిధ విభాగాల అధికారులను ప్రశ్నించారు. సరైన సమాధానం చెప్పలేక సంబంధిత అధికారులు నోరెళ్లబెట్టారు. పథకాల కుదింపు ఎజెండాగా రాజీవ్‌శర్మ సమక్షంలో సోమవారం జరిగిన సమావేశంలో ఈ చర్చ జరిగింది.
విద్యా శాఖలో ముప్ఫై ఏళ్ల కిందటి ఆపరేషన్ బ్లాక్ బోర్డు పథకం ఇప్పటికీ రాష్ట్ర బడ్జెట్‌లో ఉంది. ఇది అమల్లో లేని పథకమైనప్పటికీ ఏటా విద్యాశాఖ ప్రతిపాదనలు పంపించటం, ఆర్థిక శాఖ యథాతథంగా బడ్జెట్‌లో పొందుపరచటం ఆనవాయితీగా మారింది. అదే తరహాలో పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన ప్రతిభావంతులకు అవార్డులు, పారితోషికం ఇచ్చే పథకం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విభాగాలన్నింటా ఉంది.
వీటన్నిం టినీ ఏదో ఒక పద్దు కింద ఒకే శాఖకు అప్పగిస్తే సిబ్బంది తగ్గడంతో పాటు పనితీరు సమర్థంగా ఉంటుందని చర్చ జరిగింది. స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం సైతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ విభాగాలన్నీ విడివిడిగా నిర్వహిస్తున్నాయి. వీటిని సైతం ఒకే పద్దుగా ఒకే శాఖ పరిధి లో ఉంచితే నిర్వహణ కూడా సులభంగా ఉం టుం దని, రెండేసి చెల్లింపులు జరిగే లొసుగులకు అడ్డుకట్టు వేసినట్లవుతుందని భావించినట్లు తెలిసింది.
రెండు మూడు రోజుల్లో జాబితా...
వరుస పనిదినాలైన శనివారం, సోమవారం కొనసాగిన ఈ సమావేశాలు ఇంకా పూర్తి కాలేదు. మరో నాలుగైదు విభాగాలు మిగిలినందున మంగళవారం పోలింగ్ సెలవు ఉన్నప్పటికీ ఈ సమీక్షను కొనసాగించాలని సీఎస్ నిర్ణయించారు. సమావేశాలు ముగిసిన తర్వాత ఈ నెల ఐదు కల్లా ఏయే పథకాలను విలీనం చేయాలి.. వేటిని రద్దు చేయాలి.. అనే స్పష్టత వస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. వీటి ఆధారంగా తుది జాబితాను అదే రోజు సీఎం ఆమోదానికి పంపించే అవకాశాలున్నాయి.