16 నుంచి ‘స్వచ్ఛ హైదరాబాద్’ | 16 of the 'swaccha Hyderabad' | Sakshi
Sakshi News home page

16 నుంచి ‘స్వచ్ఛ హైదరాబాద్’

May 13 2015 2:32 AM | Updated on Sep 19 2018 6:36 PM

16 నుంచి ‘స్వచ్ఛ హైదరాబాద్’ - Sakshi

16 నుంచి ‘స్వచ్ఛ హైదరాబాద్’

ప్రస్తుతం కోటికిపైగా జనాభా ఉన్న మహానగరంలో ఎక్కడి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే లక్ష్యంతో ఈనెల 16 ....

సీఎం, గవర్నర్‌తో సహా 33,500 మంది సిబ్బంది పాల్గొంటారని మంత్రి తలసాని వెల్లడి
 
హైదరాబాద్: ప్రస్తుతం కోటికిపైగా జనాభా ఉన్న మహానగరంలో ఎక్కడి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే లక్ష్యంతో ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు ‘స్వచ్ఛ తెలంగాణ-స్వచ్ఛ హైదరాబాద్’ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..  ప్రజల అవసరాలకు తగ్గట్టుగా తాగునీరు, రహదారులు, ట్రాఫిక్ సమస్యలు, మురుగునీటి పారుదల.. తదితర సమస్యలన్నింటికీ స్వచ్ఛ హైదరాబాద్ పరిష్కారం చూపనుందన్నారు. ఈ కార్యక్రమంలో 33,500 మంది వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొంటారన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌ను 400 భాగాలుగా విభజించి, ప్రతి విభాగానికి ఒక బృందం స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని పర్యవేక్షించేలా ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో బృందంలో 15 మంది సభ్యులు ఉంటారని, వీరిలో బిల్‌కలెక్టర్లు, రెవెన్యూ, విద్యుత్, జీహెచ్‌ఎంసీ, వాటర్‌వర్క్స్, శానిటేషన్ సిబ్బంది ఉంటారని చెప్పారు.

ముఖ్యమంత్రి, గవర్నర్‌తో సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు.. మొత్తం ప్రభుత్వం యంత్రాంగమంతా ప్రజలముందుకు వెళుతోందన్నారు. అప్పటికప్పుడు పరిష్కరించగల సమస్యల (వీధిలైట్లు, ఆట వస్తువులు, ఈ-లైబ్రరీలు, పార్కుల్లో సదుపాయాలు.. తదితర) కోసం ప్రతి బృందానికి రూ.50 లక్షల నిధులు కేటాయించామన్నారు. శానిటేషన్ నిమిత్తం 700 వాహనాలను సిద ్ధం చేశామన్నారు. ఇందులో  కాలనీల వాసులు, బస్తీ కమిటీలు, స్చచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలన్నారు. అలాగే.. ఆయా ప్రాంతాల్లో అర్హులకందాల్సిన పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్లు,  షాదీముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలకు సంబంధించి ఫిర్యాదులను కూడా అధికారులు స్వీకరిస్తారని మంత్రి తలసాని తెలిపారు. స్వచ్ఛ హైదరాబాద్ గురించి మరిన్ని వివరాలు, సూచనల కోసం కాల్ సెంటర్(040-21111111)ను కూడా ఏర్పాటు చేశామన్నారు.
 
రేపు ‘స్వచ్ఛ హైదరాబాద్’పై  సీఎం కేసీఆర్ సమీక్ష

 
హైదరాబాద్: ‘స్వచ్ఛ హైదరాబాద్’ కార్యక్రమం నిర్వహణపై చర్చించేందుకు ఈనెల 14న సచివాలయంలో హైదరాబాద్ నగర ప్రజాప్రతినిధులతో ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అధ్యక్షతన సమత బ్లాక్‌లో ఈ సమావేశం జరుగుతుంది. అన్ని పార్టీలు.. నగరానికి చెందిన ప్రతి ఒక్కరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా గ్రేటర్ సిటీని పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దే అంశాలపై ఇందులో చర్చిస్తారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయతోపాటు హైదరాబాద్‌కు చెందిన రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, మహేందర్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, అసదుద్దీన్ ఒవైసీ, హనుమంతరావు, ఎంఏ ఖాన్, కె.కేశవరావు, సీహెచ్.మల్లారెడ్డిలతో పాటు అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్సీలు, నగర పరిధిలోని ఎమ్మెల్యేలు, కంటోన్మెంట్ వైస్ చైర్మన్, సభ్యులు ఈ సమావేశంలో పాల్గొంటారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement