సరోవరంలో పాలమూరు వాసుల పాట్లు | 13 tourists trapped in hilsa | Sakshi
Sakshi News home page

సరోవరంలో పాలమూరు వాసుల పాట్లు

May 30 2016 4:00 AM | Updated on Sep 4 2017 1:12 AM

సరోవరంలో పాలమూరు వాసుల పాట్లు

సరోవరంలో పాలమూరు వాసుల పాట్లు

మానస సరోవరం వద్ద కైలాస పర్వతం పర్యాటక ప్రాంతాన్ని చూసేందుకు వెళ్లిన మహబూబ్‌నగర్‌జిల్లా వాసులు ఇబ్బందుల్లో చిక్కుకున్నారు.

 హిల్సాలో చిక్కుకున్న 13 మంది పర్యాటకులు
 
 మహబూబ్‌నగర్ క్రైం: మానస సరోవరం వద్ద కైలాస పర్వతం పర్యాటక ప్రాంతాన్ని చూసేందుకు వెళ్లిన మహబూబ్‌నగర్‌జిల్లా వాసులు ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. కనీసం తినడానికి తిండి లేక.. పడుకోవడానికి సౌకర్యాలు లేక.. కంటి నిండా నిద్రరాక నానా అవస్థలు పడుతున్నామని వారు తమ బంధువులు, మీడియా ప్రతినిధులకు ఆదివారం ఫోన్ ద్వారా తెలిపారు. జిల్లా కేంద్రానికి చెందిన బీజేపీ జిల్లా కార్యదర్శి బాలరాజు, శారద దంపతులు, స్థానిక పంచవటి పాఠశాల కరస్పాండెంట్ శ్రీకాంత్‌రెడ్డి, అనితరెడ్డి దంపతులు, ఆనంద్, శైలజ దంపతులతో పాటు కూతురు అనన్య, ఉపాధ్యాయుడు శ్రీనివాస్‌రెడ్డి, చేతన దంపతులు, శివానందస్వామి, సుధారాణి దంపతులు, మక్తల్‌కు చెందిన కొండయ్య, రవి కలసి ఈనెల 16న రాత్రి శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి విమానంలో వెళ్లారు. అక్కడి నుంచి నేపాల్ టూరిజం ప్యాకేజీ అనే సంస్థకు ఒక్కొక్కరూ రూ.రెండు లక్షలు వెచ్చించి ప్రత్యేక హెలికాప్టర్‌లో నేపాల్-చైనా సరిహద్దులోని మానస సరోవరం కైలాస పర్వతంలో ఉన్న శివుడిని దర్శించుకునేందుకు వెళ్లారు. దర్శనానంతరం తిరుగు ప్రయాణంలో చైనా-నేపాల్ సరిహద్దు అయిన హిల్సా అనే పర్వత ప్రాంతంలో ఇరుక్కుపోయారు.  

 మోసం చేసిన టూరిజం సంస్థ!
 వీరిని తీసుకెళ్లిన టూరిజం సంస్థ వారు ఏ మాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితులు తెలిపారు. ప్రస్తుతం జిల్లావాసులు ఉంటున్న ప్రాంతం చైనా-నేపాల్ సరిహద్దులోని చెకింగ్ పాయింట్ వద్ద చిన్న చిన్న గుడిసెలు, దాబాలు తప్ప ఇతర ఇళ్లు ఉండవు. ఇలాంటి ప్రతికూల పరి స్థితుల్లో జిల్లావాసులు కూర్చోవడానికి కూడా స్థలం లేక అవస్థలు పడుతున్నారు. అక్కడ ఉన్న బాధితులు జిల్లా మీడియా వారికి సమాచారం ఇచ్చారనే కారణంతో వారందరి పాస్‌పోర్టులు తీసుకున్నట్లు తెలిసింది. వాతావారణం అనుకూలిస్తే తప్ప వారు అక్కడి నుంచి రావడానికి వీల్లేదు.  కలెక్టర్, మంత్రులు స్పందించి తమ వారిని ఎలాగైనా జిల్లాకు తీసుకురావాలని వారు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement