మొరాయించిన గుల్మార్గ్‌ గొండోలా  | 300 Tourists Rescued to Gulmarg Gondola Cable car in jammu kashmir | Sakshi
Sakshi News home page

మొరాయించిన గుల్మార్గ్‌ గొండోలా 

May 26 2026 12:47 AM | Updated on May 26 2026 12:47 AM

300 Tourists Rescued to Gulmarg Gondola Cable car in jammu kashmir

సాంకేతిక సమస్యతో గాల్లోనే నిలిచిన 65 క్యాబిన్లు 

హాహాకారాలు చేసిన 300 మంది పర్యాటకులు 

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం గుల్మార్గ్‌లో సోమవారం సాయంత్రం తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. గొండోలా అని పిలిచే కేబుల్‌ కార్‌ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తడంతో 65 క్యాబిన్లు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. అందులోని సుమారు 300 మంది ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ గాల్లోనే ఉండిపోయారు. కొన్ని క్యాబిన్లు 500 అడుగుల ఎత్తులో ఆగిపోగా పర్యాటకులు భయంతో హాహాకారాలు చేశారు. దీనికి తోడు భారీ వర్షం కురియడంతో రక్షణ చర్యలకు విఘాతం ఏర్పడింది. 

సోమవారం మధ్యాహ్నం ఘటన చోటుచేసుకుంది. దాదాపు ఐదు గంటలపాటు శ్రమించి మొదటి విడతగా క్యాబిన్లలో ఉండిపోయిన 179 మంది పర్యాటకులను సురక్షితంగా కిందికి దించారు. తాళ్లు, నిచ్చెనల సాయంతో మరో రెండు గంటల అనంతరం మిగతా వారినీ రక్షించారు. పోలీసులు, ఆర్మీతోపాటు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం(ఎన్‌డీఆర్‌ఎఫ్‌), జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(ఎన్‌డీఆర్‌ఎఫ్‌) సభ్యులు సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 500 అడుగుల ఎత్తులో నిలిచిపోయిన క్యాబిన్లలో వారిని కిందికి దించడం అత్యంత క్లిష్టమైన వ్యవహారంగా మారిందని అధికారులు చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement