ఇన్సూరెన్స్‌ ఉంటే సరిపోదు! | West Asia Conflict Impact On Flights, Why Indian Tourists Must Rethink About Travel Insurance, Hidden Risks Explained | Sakshi
Sakshi News home page

ఇన్సూరెన్స్‌ ఉంటే సరిపోదు!

Apr 6 2026 10:22 AM | Updated on Apr 6 2026 10:55 AM

West Asia Conflict Flights Why Indian Tourists Must Rethink Travel Insurance

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగాన్ని కుదిపేస్తోంది. మార్చి నెలలో ఏకంగా 5,500కు పైగా విమానాలు రద్దు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఏప్రిల్‌ నెల అంటే భారతీయులకు సెలవుల కాలం. పిల్లలకు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఉండటంతో చాలామంది విదేశీ ప్రయాణాలు ప్లాన్ చేసుకుంటారు. పర్యాటక శాఖ గణాంకాల ప్రకారం 2025లోనే సుమారు 3.27 కోట్ల మంది భారతీయులు విదేశాలకు వెళ్లారు. అయితే, ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశీ ప్రయాణం చేసేవారు కేవలం ట్రావెల్ ఇన్సూరెన్స్‌ ఉంటే సరిపోతుందని భావిస్తే పొరపాటే. యుద్ధ సమయంలో ఇన్సూరెన్స్‌ కంపెనీల నిబంధనలు పూర్తిగా మారిపోతాయి.

సాధారణ సమయాల్లో ఇన్సూరెన్స్‌ కవరేజీ ఇలా..

సాధారణంగా ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రధానంగా ఐదు అంశాలను కవర్ చేస్తుంది.

సామాను కోల్పోవడం: 300 డాలర్ల నుంచి 1,000 డాలర్ల వరకు కవరేజీ.

పాస్‌పోర్ట్ పోగొట్టుకోవడం: 200 నుంచి 300 డాలర్ల వరకు.

వైద్య ఖర్చులు: 2,50,000 నుంచి 5,00,000 డాలర్లు వరకు (కనీసం 24 గంటల హాస్పిటలైజేషన్ అవసరం).

ప్రమాదాలు: 20,000 నుంచి 30,000 డాలర్ల వరకు.

ట్రిప్ క్యాన్సిలేషన్: అనారోగ్యం, వాతావరణం లేదా సాంకేతిక కారణాల వల్ల విమానం రద్దయితే సుమారు 1,000 డాలర్ల వరకు కవరేజీ ఉంటుంది.

యుద్ధం వస్తే.. మీ పాలసీ పనిచేయదు!

ఇక్కడే అసలు చిక్కు ఉంది. ఒకవేళ మీ విమానం రద్దు కావడానికి లేదా మీకు గాయాలు కావడానికి యుద్ధం ప్రత్యక్ష కారణమైతే (ఉదాహరణకు: ఎయిర్‌పోర్టుపై డ్రోన్ దాడులు, రన్‌వేల మూసివేత, బాంబు దాడులు) ఇన్సూరెన్స్ కంపెనీలు పైసా కూడా చెల్లించవు. మెజారిటీ ఇన్సూరెన్స్ పాలసీల్లో ‘వార్ ఎక్స్‌క్లూజన్’ క్లాజ్ ఉంటుంది.

వైద్య సాయం: యుద్ధం వల్ల కలిగే గాయాలకు (పేలుళ్ల వల్ల వచ్చే శిథిలాలు తగలడం వంటివి) ఇన్సూరెన్స్ వర్తించదు. ఇలాంటి సమయాల్లో ప్రభుత్వాల సాయం లేదా సొంత ఖర్చులపైనే ఆధారపడాలి.

హోటల్ ఖర్చులు: విమానాలు రద్దయి యుద్ధ ప్రాంతాల్లో చిక్కుకుపోతే హోటల్ ఖర్చులను ప్రయాణికులే భరించాలి లేదా ఎయిర్‌లైన్స్ ఇచ్చే వెసులుబాటును వాడుకోవాలి.

సురక్షితంగా ప్రయాణించడం ఎలా?

ప్రస్తుత పరిస్థితుల్లో పశ్చిమాసియా మీదుగా కాకుండా ఇతర మార్గాల్లో ప్రయాణించడం ఉత్తమం. ప్రస్తుతం క్షేమంగా ఉన్న మార్గాలు.. జపాన్, చైనా, థాయిలాండ్, సింగపూర్, మలేషియా, వియత్నాం, ఆస్ట్రేలియా. అమెరికా పశ్చిమ తీరానికి వెళ్లేవారు హాంకాంగ్ మీదుగా వెళ్లడం సురక్షితం. అలాగే యూరప్‌ వెళ్లే కొన్ని విమానాలు పశ్చిమాసియాను తప్పించుకుంటూ మ్యూనిచ్ వంటి నగరాల మీదుగా నడుస్తున్నాయి.

ఇన్సూరెన్స్ ప్రీమియం ఎంత ఉండొచ్చు?

టాటా ఏఐజీ, ఐసీఐసీఐ లాంబార్డ్, హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో, డిజిట్ వంటి కంపెనీలు ట్రావెల్ ఇన్సూరెన్స్ అందిస్తున్నాయి. షెంజెన్ దేశాలకు వెళ్లే నలుగురు సభ్యులున్న కుటుంబానికి (ఇద్దరు పిల్లలతో కలిపి) రూ.6,500 నుంచి రూ.10,000 వరకు వసూలు చేస్తున్నాయి. అమెరికా ట్రిప్ కోసం రూ.10,000 నుంచి రూ.24,000 వరకు ఆఫర్‌ చేస్తున్నాయి. అయితే, విదేశీ ప్రయాణానికి వెళ్లేముందు మీ పాలసీలోని నిబంధనలు, మినహాయింపులు, షరతులు క్షుణ్ణంగా చదవాలి. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఎయిర్‌లైన్స్ ఇచ్చే రీఫండ్, రీషెడ్యూల్ ఆప్షన్లపై అవగాహన పెంచుకోవడం ఎంతో ముఖ్యం.

ఇదీ చదవండి: ట్రంప్ పాచిక పారేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement