1.08 కోట్ల బతుకమ్మ చీరలు

1.08 crore bathukamma Sarees for bathukamma utsavalu - Sakshi

అక్టోబర్‌లో పంపిణీకి ఏర్పాట్లు 

తెల్లకార్డు ఆధారంగా లబ్ధిదారుల నిర్ధారణ 

ఒక్కో చీర విలువ రూ.280 

చీరల పంపిణీపై సీఎస్‌ జోషి సమీక్ష 

సాక్షి, హైదరాబాద్‌: బతుకమ్మ ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్రంలోని పేద మహిళలకు చీరలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. పండుగ అక్టోబర్‌లో వస్తున్న నేపథ్యంలో ఆలోపే పంపిణీ జరగనుంది. తెల్ల రేషన్‌ కార్డున్న కుటుంబాల్లో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు చీరలు ఇవ్వనున్నారు. పౌర సరఫరాల శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో తెల్ల కార్డు ఉన్న కుటుంబాల్లో 1.08 కోట్ల మంది మహిళలు ఉన్నారు. వీరి వివరాలు సరి చూసుకుని చీరలు పంపిణీ చేయనున్నారు. పాలిస్టర్‌ చీర, జరీ అంచుతో ఉండే ఈ చీరలన్నీ ఈసారి రాష్ట్రంలోనే తయారవుతున్నాయి. ఒక్కో చీరకు రూ.280 చొప్పున ఖర్చవుతోంది.

ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పర్యవేక్షిస్తోంది. బతుకమ్మ చీరల పంపిణీ, హరితహారం, కంటి వెలుగు, మైనారిటీ, చేనేత కార్మికుల సంక్షేమ కార్యక్రమాలు తదితరాలపై జిల్లాల కలెక్టర్లతో మంగళవారం జోషి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. చీరల పంపిణీకి ఏర్పాట్లు చేసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. కార్యక్రమం విజయవంతం చేసేందుకు గ్రామ, పట్టణ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. గతేడాదిలానే గ్రామాల వారీగా చీరల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని, జిల్లా స్థాయిలో ఓ గోదామును ఎంపిక చేసుకోవాలని ఆదేశించారు. చేనేత, సహాయక కార్మికులకు 60 కోట్లతో ‘నేతన్నకు చేయూత’పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 17,000 మంది నమోదు చేసుకున్నారని.. మిగతా కార్మికుల పేర్లు నమోదయ్యేలా చూడాలని ఆదేశించారు.  

పెద్ద ఎత్తున ‘చేనేత’చెక్కుల పంపిణీ 
చేనేత కార్మికులకు చెక్కుల పంపిణీ, అవగాహన కార్యక్రమాన్ని జిల్లా ప్రజాప్రతినిధులు, మంత్రుల సహకారంతో సెప్టెంబర్‌ చివరలో పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్లకు జోషి సూచించారు. జాతీయ రహదారుల భూ సేకరణను వేగవంతం చేయాలని, ఈ అంశంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ప్రధాన మంత్రి జనవికాస్‌ కార్యక్రమం కింద మైనారిటీ సంక్షేమ శాఖకు మంజూరైన హాస్టళ్ల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మసీదులు, చర్చ్‌ల నిర్మాణానికి రూ.240 కోట్లతో గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌కు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. వాతావరణం అనుకూలంగా ఉన్నందున నాలుగో విడత హరితహారం లక్ష్యాలను సెప్టెంబర్‌ నెలాఖరుకల్లా 100 శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. వచ్చే ఏడాది హరితహారం కోసం నర్సరీల ఏర్పాటు పనులు మొదలు పెట్టాలన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top