
సమావేశంలో మాట్లాడుతున్న ఉత్తమ్
సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కార్యక్రమం ప్రారంభం
పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడి
ఎరువులు అందుబాటులో ఉంచాలి: మంత్రి లక్ష్మణ్
రూ.1,200 కోట్లతో రోడ్ల అభివృద్ధి: మంత్రి కోమటిరెడ్డి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 14న కొత్త రేషన్‌కార్డుల పంపిణీని ప్రారంభిస్తారని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. బుధవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులపై వృద్ధులు, వికలాంగుల సంక్షేమశాఖ మంత్రి, నల్లగొండ జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి ఉత్తమ్ ఈ విషయం వెల్లడించారు. 14న సాయంత్రం 6 గంటలకు తిరుమలగిరిలో నిర్వహించే బహిరంగ సభలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కొత్త రేషన్ కార్డులకోసం వచ్చిన దరఖాస్తులన్నింటినీ ఈ నెల 13లోగా పరిశీలించి, అర్హులను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశామన్నారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉప ఎన్నికలున్న చోట కొద్దిమందికి రేషన్ కార్డులు ఇచ్చిందే తప్ప అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్.. 44 కిలోమీటర్లలో 35 కిలోమీటర్లు పూర్తయిందన్నారు. ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి హెలికాప్టర్ ద్వారా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సర్వే చేసి పనులు పునఃప్రారంభిస్తామన్నారు.
రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం: మంత్రి లక్ష్మణ్‌కుమార్
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్నిరకాలుగా అండగా ఉంటుందని మంత్రి లక్ష్మణ్‌కుమార్ తెలిపారు. ఎరువులు, విత్తనాల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. గత ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేసిందని, అలాకాకుండా తమ ప్రభుత్వం రైతులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి రైతు భరోసా వంటి పథకాలను అమలు చేస్తోందన్నారు. వానాకాలంలో విద్యుత్తు సమస్యలు రాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు.
రూ.1,200 కోట్లతో రోడ్లు: మంత్రి కోమటిరెడ్డి
రాష్ట్రవ్యాప్తంగా రూ.1,200 కోట్లతో అన్ని మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్ల నిర్మాణం చేపడతామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. అధికారులు పథకాల అమలులో అవినీతికి ఆస్కారం ఇవ్వొద్దన్నారు.