breaking news
distribution of Ration cards
-
14న రేషన్ కార్డుల పంపిణీ: ఉత్తమ్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 14న కొత్త రేషన్‌కార్డుల పంపిణీని ప్రారంభిస్తారని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. బుధవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులపై వృద్ధులు, వికలాంగుల సంక్షేమశాఖ మంత్రి, నల్లగొండ జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి ఉత్తమ్ ఈ విషయం వెల్లడించారు. 14న సాయంత్రం 6 గంటలకు తిరుమలగిరిలో నిర్వహించే బహిరంగ సభలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కొత్త రేషన్ కార్డులకోసం వచ్చిన దరఖాస్తులన్నింటినీ ఈ నెల 13లోగా పరిశీలించి, అర్హులను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశామన్నారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉప ఎన్నికలున్న చోట కొద్దిమందికి రేషన్ కార్డులు ఇచ్చిందే తప్ప అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్.. 44 కిలోమీటర్లలో 35 కిలోమీటర్లు పూర్తయిందన్నారు. ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి హెలికాప్టర్ ద్వారా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సర్వే చేసి పనులు పునఃప్రారంభిస్తామన్నారు. రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం: మంత్రి లక్ష్మణ్‌కుమార్ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్నిరకాలుగా అండగా ఉంటుందని మంత్రి లక్ష్మణ్‌కుమార్ తెలిపారు. ఎరువులు, విత్తనాల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. గత ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేసిందని, అలాకాకుండా తమ ప్రభుత్వం రైతులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి రైతు భరోసా వంటి పథకాలను అమలు చేస్తోందన్నారు. వానాకాలంలో విద్యుత్తు సమస్యలు రాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. రూ.1,200 కోట్లతో రోడ్లు: మంత్రి కోమటిరెడ్డి రాష్ట్రవ్యాప్తంగా రూ.1,200 కోట్లతో అన్ని మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్ల నిర్మాణం చేపడతామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. అధికారులు పథకాల అమలులో అవినీతికి ఆస్కారం ఇవ్వొద్దన్నారు. -
కలగానే కార్డులు!
► రేషన్ కార్డుల పంపిణీ ఇప్పట్లో లేనట్లే ► గతేడాది ఆగస్టులో పంపించిన ప్రభుత్వం ► జిల్లాల విభజన కారణంతో ఆగిపోయిన పంపిణీ ► కొత్తవి ముద్రించి ఇస్తామన్న సర్కారు.. మళ్లీ ఊసే లేదు ఇందూరు (నిజామాబాద్ అర్బన్): కొత్త రాష్ట్రంలో రేషన్ కార్డుల పంపిణీ కలగానే మారింది.. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు దాటింది. ఇదిగో రేషన్ కార్డులు.. అదిగో రేషన్ కార్డులు అంటూ ఊరించడమే తప్ప ఇంతవరకు లబ్ధిదారులకు ఇచ్చింది లేదు. కొత్త హంగులు, రంగులతో పాటు కుటుంబ సభ్యుల ఫొటోలు సైతం రంగుల్లోనే ముద్రించి ఇస్తామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం ప్రస్తుతం మౌనం వహిస్తోంది. మూడేళ్లలో ఏ ఒక్క కుటుంబానికి కూడా రేషన్ కార్డు జారీ చేసింది లేదు. అయితే వాస్తవానికి ప్రభుత్వం రేషన్ కార్డులను గతంలోనే ముద్రించి జిల్లాకు పంపింది. 2016 ఆగస్టులో జిల్లాల విభజన జరగక ముందు నిజామాబాద్, కామారెడ్డికి కలిపి 6.23 లక్షల కొత్త రేషన్ కార్డులను ముద్రించి పంపించింది. అదే సమయంలో జిల్లాలు, మండలాల విభజన తెరపైకి రావడం, ఏర్పాటు కావడం జరిగి పోయాయి. అప్పటికే జిల్లా పౌరసరఫరాల శాఖకు వచ్చిన రేషన్ కార్డులను మండలాల వారీగా విభజన చేసి తహసీల్దార్ కార్యాలయాలకు పంపించారు. జిల్లాల విభజన నేపథ్యంలో తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు లబ్ధిదారులకు ఆహార భద్రతకార్డులు పంపిణీ చేయవద్దని ప్రభుత్వం అధికారులకు సూచించింది. ఈ క్రమంలోనే జిల్లాల విభజన, కొత్త మండలాల ఏర్పాటు జరగడంతో రేషన్ కార్డుల పంపిణీకి బ్రేక్ వేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. జిల్లా, మండలాల విభజన, కొత్త మండలాలు ఏర్పడడంతో ముద్రించిన రేషన్ కార్డుల్లో పేర్లు మార్పు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ప్రస్తుతం, తహసీల్దార్ కార్యాలయాల్లోనే రేషన్ కార్డులు మూలుగుతున్నాయి. మళ్లీ కొత్తవి ముద్రించి ఇస్తామని ప్రభుత్వం చెప్పి ఏడాది అవుతున్నా.. ఇంతవరకు ఎలాంటి ఉలుకుపలుకు లేదు. అదే విధంగా ప్రస్తుతం రేషన్ షాపుల ప్రక్షాళన మొదలైంది. ఈ నెలలోనే రేషన్ షాపుల్లో బయోమెట్రిక్ మిషన్లు, ఎలక్ట్రానిక్ కాంటాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ క్రమంలో ఇప్పట్లో రేషన్ కార్డుల ముద్రణ జరిగే అవకాశాలు లేవు. దీంతో మరికొన్ని నెలలు, లేదా మరో సంవత్సరం పట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మళ్లీ ఆన్లైన్ స్టేటస్ కాగితాలే దిక్కు.. లబ్ధిదారులు రేషన్ దుకాణాలకు వెళ్లి సరుకులు పొందాలంటే గతంలో రేషన్ కార్డులు తీసుకుని వెళ్లే వారు. రేషన్ కార్డు ఉంటే ఎంతో ధీమాగా ఉండేది. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు రేషన్ కార్డులు లబ్ధిదారుల చేతికి అందలేదు. ఆన్లైన్లో ఉన్న స్టేటస్ కాగితాలే దిక్కయ్యాయి. ప్రతీ నెలా లబ్ధిదారులు ఇంటర్నెట్, మీ సేవ కేంద్రాలకు వెళ్లి ఆన్లైన్ స్టేటస్ తీసుకుని రావాలని డీలర్లు చెబుతుండడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో ఆహార భద్రతా కార్డులు 3,55,678, 19,946 అంత్యోదయ, 1146 అన్నపూర్ణ కార్డులున్నాయి. ఈ మొత్తం కార్డులు కలిపి 3,76,770 కార్డులున్నాయి. వీరందరు ముద్రించిన రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి గతేడాది ఉమ్మడి జిల్లాకు కలిపి రేషన్ కార్డులను ముద్రించి పంపించారు. అయితే జిల్లాలు, మండలాల విభజన కారణంగా రేషన్ కార్డుల పంపిణీ నిలిచి పోయింది. జిల్లా, మండలాల పేర్లు మార్చి మళ్లీ ముద్రించి పంపుతామని ఉన్నతాధికారులు చెప్పారు. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రభుత్వమే నిర్ణయం తీసుకుని, కార్డులను ముద్రించి జిల్లాకు పంపాల్సి ఉంది. – కృష్ణ ప్రసాద్, డీఎస్వో -
రికార్డ్ టూర్
⇒జిల్లాలోనే వరుసగా నాలుగు రోజులు ⇒మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి ⇒ఆరు బస్తీలు మోడల్ కాలనీలుగా అభివృద్ధి ⇒టెక్స్టైల్ పార్క్‌పై స్పష్టత ⇒3,917 ఇళ్లకు రూ.400 కోట్లు మంజూరు ⇒పింఛన్లు, కార్డుల పంపిణీపై ఆదేశాలు ⇒వచ్చే పర్యటనలో జిల్లా మొత్తంపై దృష్టి ⇒ముగిసిన సీఎం కేసీఆర్ పర్యటన సాక్షి ప్రతినిధి, వరంగల్ : జిల్లా చరిత్రలో వరుసగా నాలుగు రోజులు ముఖ్యమంత్రి ఉండడం అనేది జరగలేదు. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దీన్ని చేసి చూపించారు. జిల్లా కేంద్రం సమగ్ర అభివృద్ధి ప్రణాళికే లక్ష్యంగా కేసీఆర్ నాలుగు రోజుల పర్యటన సాగింది. క్షేత్రస్థాయి పరిస్థితులు స్వయంగా తెలుసుకోవడం, వాటికి తగినట్లు అక్కడే నిర్ణయాలు తీసుకోవడం, అధికారులు వెంటనే అమలు చేసేలా చూడడం.. చివరగా తన నిర్ణయాలు అమలు చేసి చూపించారు. సీఎం కేసీఆర్.. గురువారం సాయంత్రం ఆకస్మికంగా వరంగల్‌కు వచ్చారు. వస్తూ వస్తూనే వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని లక్ష్మీపురం, శాకరాసికుంట, గిరిప్రసాద్‌నగర్ మురికికాలనీలను సందర్శించారు. స్వయంగా పేదలకు ఇళ్లకు వెళ్లి వారి అవసరాలు తెలుసుకున్నారు. అధికారుల చర్యలతో అర్హులకు సామాజిక పింఛన్లు, రేషన్‌కార్డులు రాకపోవడం సీఎం కేసీఆర్ దృష్టికి వచ్చింది. బస్తీల్లో పేదల దయనీయ పరిస్థితి చూసి చలించిపోయారు. ఐదు నెలల్లోపు అందరికీ ఇళ్లు కట్టించి ఇస్తానని ప్రకటించారు. క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకున్న కేసీఆర్ వెంటనే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అర్హులందరికీ పింఛన్లు, రేషన్‌కార్డులు ఇచ్చే వరకు వరంగల్ విడిచి వెళ్లనని ప్రకటించారు. మొదట నగర పరిస్థితిని చూపి వరంగల్ కమిషనర్ జి.సువర్ణపండాదాస్పై, సామాజిక పింఛన్ల, రేషన్‌కార్డుల పంపిణీపై కలెక్టర్ జి.కిషన్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. తన లక్ష్యాలు వారికి స్పష్టంగా వివరించి కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఇలా ఆదేశాలు అమలు చేసేలా యంత్రాంగాన్ని ఆదేశిస్తూనే.. శుక్రవారం, శనివారం బస్తీల్లో పర్యటించారు. గురువారం, శుక్రవారం పర్యటించిన బస్తీల్లో సర్వే పూర్తి చేసి అర్హులైన 3,957 డబుల్ బెడ్ రూం(వన్ ప్లస్ వన్) ఇళ్లను నిర్మిస్తామని ప్రకటించారు. ప్రకటన ఆచరణలో వచ్చేలా నిర్ణయాలు తీసుకునేందుకు రాష్ట్ర స్థాయి యంత్రాంగాన్ని జిల్లాకు రప్పించారు. అన్నింటికీ అనుమతులు జారీ చేశారు. ఆదివారం ఆరు బస్తీల్లో మోడల్ కాలనీలకు శంకుస్థాపన చేశారు. నాలుగేళ్లలోపు నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు, రేషన్‌కార్డులు అందేలా చూసే బాధ్యతను అధికారులతోపాటు స్థానిక ఎమ్మెల్యేలు డి.వినయ్‌భాస్కర్, కొండా సురేఖలకు అప్పగించారు. శనివారం పర్యటించిన వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గాల్లోని బస్తీల్లో మోడల్ కాలనీల నిర్మాణానికి ఎనిమిది రోజుల్లో వచ్చి శంకుస్థాపన చేస్తానని ప్రకటించారు. ఈ బస్తీల్లో సర్వే బాధ్యతలు ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డిలకు అప్పగించారు. మురికివాడలు, పింఛన్లు, రేషన్‌కార్డులతోపాటు.. వరంగల్ నగర సమగ్ర అభివృద్ధికి తాను మళ్లీ జిల్లాకు వచ్చేలోపు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. భూపాలపల్లి నియోజకవర్గంపై ప్రత్యేక సమీక్ష జరిపి ఆ ప్రాంత అభివృద్ధికి నిర్ణయాలు తీసుకున్నారు. టెక్స్టైల్ పార్కు ఏర్పాటుపై మరోసారి స్పష్టత ఇచ్చారు. ఉపాధి అవకాశాలు కల్పించే ఈ పరిశ్రమ ఏర్పాటు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. నాలుగు రోజుల పర్యటనతో ఆగిపోకుండా.. ఎనిమిది రోజుల్లోపు వస్తానని చెప్పారు. దీంతో వరంగల్ అభివృద్ధి విషయంలో సీఎం కేసీఆర్‌కు దీర్ఘకాలిక లక్ష్యం ఉన్నట్లుగా కనిపిస్తోంది. పర్యటనపై నేతలతో చర్చలు సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన వెనుక ప్రధానంగా మూడు లక్ష్యాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. పరిపాలనను వేగవంతం చేయడం, ప్రభుత్వ యంత్రాంగం కారణంగా విమర్శలు ఎదుర్కొన్న పింఛన్లు, రేషన్‌కార్డుల పంపిణీపై పేదలకు భరోసా ఇవ్వడం, హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయడం.. ఈ నగరంలో మేయర్ స్థానం దక్కించుకోవడం లక్ష్యాలుగా సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన సాగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రిగా తాను ఎక్కడ ఉన్నా పరిపాలపై ప్రభావం ఉండకూదనే ఉద్దేశంతో కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. ముఖ్యమైన రాష్ట్ర స్థాయి అధికారులను వరంగల్‌కు రప్పించారు. వరంగల్‌కు సంబంధించి తాను తీసుకనే నిర్ణయాలపై ప్రజల స్పందన ఎలా ఉందనే విషయాన్ని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్యనాయకుల వద్ద అడిగి తెలుసుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య ఇంటికి తేనేటి విందుకు వెళ్లినప్పుడు పార్టీ కార్యకర్తలతో ఇదే అంశంపై చర్చించారు. డివిజన్ల పునర్విభజన ప్రక్రియ పూర్తి కాపోవడంతో వరంగల్ నగరపాలక సంస్థలకు ఎన్నికలు జరగలేదు. టీఆర్ఎస్కు మొదటి నుంచి గట్టి పట్టున్న జిల్లా కావడంతో వరంగల్ మేయర్ పదవిని ఈసారి ఎలాగైనా దక్కించుకోవాలనే లక్ష్యంతో కేసీఆర్ ఉన్నారు. వరంగల్ నగరం పరిధిలోని వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గాల్లోని బస్తీల్లో పర్యటించి నగరంలోని అన్ని వర్గాల ప్రజల్లో అభివృద్ధి అంశంపై చర్చకు తెరతీశారు. పరిశీలించడంతోనే ఆగకుండా రెండు రోజుల్లోనే కాలనీ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి నిర్ణయాలతో వరంగల్ నగరం ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వంపై సానుకూలత పెంచిందని టీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.ఇది వచ్చే ఎన్నికల్లో తమకు ఉపయోగపడుతుందని చెబుతున్నారు.