-
అహ్మదాబాద్ వేదికగా.. ప్రధానిపై సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు
అహ్మదాబాద్ (గుజరాత్): మతాల మధ్య ప్రధాని మోదీ చిచ్చుపెడుతున్నారని.. గాంధీ విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఏఐసీసీ ప్లీనరీ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గాడ్సే సిద్ధాంతాన్ని మోదీ ప్రోత్సహిస్తున్నారని.. ఎట్టిపరిస్థితుల్లోనూ తెలంగాణలో బీజేపీని అడుగుపెట్టనివ్వం అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు.వచ్చే రోజుల్లో బీజేపీని ఓడించే బాధ్యత కార్యకర్తలు తీసుకోవాలి. దేశంలో కుల గణన చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ. బ్రిటీష్ వాళ్లు ఎలా దేశాన్ని లూటీ చేశారో.. బీజేపీ నేతలు కూడా అలానే లూటీ చేస్తున్నారు. బిట్రీష్ వాళ్ల కంటే బీజేపీ వాళ్లే ప్రమాదకరం. బ్రిటీష్ వాళ్లను తరమికొట్టినట్టే బీజేపీని కూడా ఓడగొట్టాలి. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు.’’ అని రేవంత్ చెప్పుకొచ్చారు. -
‘కేసీఆర్‌ది సాగు భాష..రేవంత్‌ది చావు భాష’
హైదరాబాద్,సాక్షి: దేవుని మీద ఒట్టు పెట్టి.. దేవుణ్నే మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. ఈనెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ(BRS Silver jubilee) సభను విజయంతం చేయాలని సంగారెడ్డిలో బీఆర్ఎస్ కార్యకర్తలకు హరీష్ రావు పిలుపునిచ్చారు. బుధవారం సంగారెడ్డిలో బీఆర్ఎస్ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రస్తుతం కేసీఆర్ వైపు చూస్తోంది. రేవంత్ రెడ్డి పాలన గురించి ప్రజలకు అర్థమైంది. ఎల్ఆర్ఎస్ పేరుతో వసూళ్లు చేస్తున్నారు. జీవో 58,59ను కాంగ్రెస్ ప్రభుత్వం బొంద పెట్టింది. రైతు రుణమాఫీ, 4వేల ఫించను సహా సంక్షేమ పథకాలన్నీ మూలన పడ్డాయి.13 లక్షల పేదల పిల్లలకు కళ్యాణ లక్ష్మీ ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది. రేవంత్ మాయ మాటలతో మోసం చేశారు. కేసీఆర్ తెలంగాణను నిలబెడితే.. రేవంత్ పడగొట్టారు. తెలంగాణ రాష్ట్రంలో జీఎస్టీ గ్రోత్, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్,ఇతర ఆదాయాలు తగ్గిపోయాయి.కేసీఆర్ చెట్టు పెడితే రేవంత్ రెడ్డి చెట్లు నరికాడు. చివరికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 4వందల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని, అడవిలోని మూగజీవులను చంపిన శాపం రేవంత్‌దే. కేసీఆర్‌ది సాగు భాష..రేవంత్ రెడ్డిది చావు భాష.ఢిల్లిలో ధర్నా,సమావేశం పెడితే రేవంత్ రెడ్డి పిలిస్తే రాహుల్ గాందీ రాలేదు.రేవంత్ పాలన ఆగమాగం అయ్యింది.. మంత్రులే ఆయన మాట వినే పరిస్థితి లేదు.దేవుని మీద ఒట్టు పెట్టి.. దేవున్నే మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం కునారిల్లిపోయింది. అన్ని వర్గాలు దివాళా తీశారు.మెట్రో రైలు, ఫార్మా ప్రాజెక్టులు ముందుకు సాగటం లేదు.కాంగ్రెస్ పాలనలో తాగునీరు, కరెంటు కష్టాలు మొదలయ్యాయి.ఏడాది తిరగకుండానే లక్షా50 వేల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చారు. తెలంగాణను అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్‌ది. పదేళ్ల కేసీఆర్ పాలన దేశంలో నంబర్ వన్ గా మారింది.. ధాన్యాగారంగా మారింది. ప్రజలు ప్రస్తుతం కేసీఆర్‌ను కోరుకుంటున్నారు. వరంగల్ జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలి’ అని పిలుపు నిచ్చారు. -
కేటీఆర్ వ్యాఖ్యల ఎఫెక్ట్.. బీజేపీ ఎంపీల కీలక సమావేశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయ ఆసక్తికరంగా మారింది. తెలంగాణ బీజేపీ ఎంపీలు నేడు సమావేశం కానుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణల నేపథ్యంలో బీజేపీ ఎంపీలు భేటీ అవుతున్నారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి నివాసంలో వీరంతా సమావేశం కానున్నారు. ఈ సందర్బంగా హెచ్‌సీయూ భూముల వివాదంపై ఎంపీలు చర్చించనున్నారు.అంతకుముందు బీజేపీ, కాంగ్రెస్ నేతలపై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ..‘రాష్ట్రంలో నెగటివ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలు బీఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టినవి కాదు. లగచర్ల, మూసీ పునరుజ్జీవనం, హెచ్‌సీయూ విషయంలో బాధితులే మా వద్దకు వచ్చారు. ఏఐ వీడియోలు అంటూ ప్రతిపక్షంపై కేసులు పెడుతున్నారు. ప్రభుత్వ సంస్థ నెహ్రూ జూలాజికల్ పార్క్ నివేదికలోనే అక్కడ జింకలు, నెమళ్లు ఉన్నాయని చెప్పింది. జంతువుల వ్యధకు కారణమైన వారిపై కచ్చితంగా కేసులు పెట్టాల్సిందే. రెండు జాతీయ పార్టీల జుట్టు ఢిల్లీ చేతిలో ఉంది. ఒకరు ఢిల్లీ నేతల చెప్పులు మోస్తే.. ఇంకొకరు ఢిల్లీకి బ్యాగులు మోస్తారు. బహిరంగ సభకు అనుమతి ఇవ్వకపోతే కోర్టుకు వెళతాం. HCU విషయంలో ప్రభుత్వం న్యాయస్థానాలను కూడా తప్పుదోవ పట్టించింది. సంజయ్ దత్, సల్మాన్ ఖాన్, సైఫ్ ఆలీ ఖాన్ లాంటి వాళ్లు జింకలను చంపితే జైలుకు వెళ్లారు. మరి ఇక్కడ జింకలను చంపిన వారిపై కేసులు పెట్టారా?ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రంలో జరుగుతున్న భారీ భూ కుంభకోణాన్ని బయటపెడతా. హెచ్‌సీయూలో 400 ఎకరాలు కాదు దాని వెనకాల వేల ఎకరాల భూముల వ్యవహారం ఉంది. ఈ కుంభకోణంలో ఓ బీజేపీ ఎంపీ కూడా ఉన్నారు. అన్ని ప్రజలకు వివరిస్తా. కాంగ్రెస్, బీజేపీలకు ఉమ్మడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్‌ను కాపాడుతుంది బండి సంజయ్’ అని వ్యాఖ్యానించారు. -
‘నిరూపిస్తే.. మీ ఇంట్లో గులాంగిరీగా పనిచేస్తా.. లేకపోతే...’
హనుమకొండ జిల్లా: కావాలనే తన క్యారెక్టర్ దెబ్బతీయడానికి ఒక ఎమ్మెల్యే, మరో మాజీ ఎమ్మెల్యే కలిసి అభూత కల్పనలు స్పష్టిస్తున్నారని విమర్శించారు స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. తాను అవినీతికి, కబ్జాలకు పాల్పడినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, ఆ ఇద్దరికీ చీము నెత్తురు ఉంటే తన సవాల్ ను స్వీకరించాలని కడియం శ్రీహరి డిమాండ్ చేశారు.దేవునూర్ గుట్టల వ్యవహారంపై హన్మకొండ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కడియం శ్రీహరి మీడియా సమావేశం మాట్లాడుతూ ఎమ్మెల్యే పళ్ళ రాజేశ్వర్ రెడ్డి.. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పై విరుచుకుపడ్డారు. ‘ నేను, నా కుటుంబ ఆక్రమిస్తున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారనీఆ భూములను కాపాడడానికి ప్రయత్నం చేస్తుంటే కబ్జా అనడం సిగ్గుచేటని కడియం ఆరోపించారుఆధారాలు ఉంటే ప్రజలు ముందు పెట్టాలని తప్పు ప్రచారం చేసే పత్రికలకు, చానెల్స్ కు, వ్యక్తులకు ఆధారాలు ఉంటే బయట పెట్టలని డిమాండ్ చేసారు. నిజమని నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి జీనామా చేస్తా. లేదంటే న్యాయపరంగా వెళ్లాడనికి వెనకడను అని హేచ్చరించారు. 30 ఏళ్ల రాజకీయాలలో ఒక గంట కబ్జా చెయ్యలేదని, ఆధారాలు నిరూపిస్తే పల్లా, తాటికొండ రాజయ్యల ఇంట్లో గులాంగీరీగా పనిచేస్తా అని కడియం అన్నారు. ఆధారాలు నిరూపించకపోతే నా ఇంట్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి, తాటికొండ రాజయ్య గులాంగిరి చెయ్యాలని డిమాండ్ చేశారు -
‘రేవంత్, కేటీఆర్ జాన్ జబ్బలు’
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లపై మరోసారి మండిపడ్డారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఎంపీ బండి సంజయ్.‘ రేవంత్ రెడ్డి, కేటీఆర్ జాన్ జబ్బలు. ఇద్దరూ కలిసే రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. కేటీఆర్ జైలుకు వెళ్లకుండా కాపాడుతున్నదే రేవంతే. చెన్నై డీలిమిటేషన్ మీటింగ్ కు ఇద్దరూ కలిసే వెళ్లారు. హైదరాబాద్‌లో త్వరలో జరగబోయే మీటింగ్‌ను ఇద్దరూ కలిసే ప్లాన్ చేస్తున్నరు. ఆ ఇద్దరూ కలిసే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎంపీలతో ఓటేయించారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరూ కలిసే మజ్లిస్ ను గెలిపించేందుకు సిద్దమయ్యారు. గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ రేవంత్ ను కాపాడేందుకే కేటీఆర్ బీఆర్ఎస్ ను బరిలో దించలేదు. తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్పినా కేటీఆర్ బుద్ది మారలేదుఇద్దరూ ఏకమై బీజేపీని దెబ్బతీసేందుకు మళ్లీ కుట్రలు చేస్తున్నరు. హెచ్ సీయూ భూములపై దమ్ముంటే సీబీఐ విచారణకు సిద్ధమా?, రేవంత్ రెడ్డిని కాపాడేందుకు కేంద్రంలో ఉన్నది కేసీఆర్, రేవంత్ సర్కార్ కాదు. భూదందా, అవినీతిపరులపై ఉక్కుపాదం మోపే మోదీ సర్కార్ కొనసాగుతోంది. సీబీఐ విచారణకు సిద్దమైతే హెచ్‌సీయూ భూ కుట్రదారుల భాగోతాన్ని బట్టబయలు చేస్తాం’ అని ధ్వజమెత్తారు బండి సంజయ్. -
KTR: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్,సాక్షి: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (ktr) సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో రెండు రోజుల్లో రాష్ట్రంలో జరుగుతున్న భారీ భూ కుంభకోణాన్ని బయటపెట్టనున్నట్లు తెలిపారు.వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరిగే పార్టీ రజతోత్సవ సభ (BRS Silver Jubilee Celebrations) కోసం బీఆర్ఎస్ (brs) ఏర్పాట్లు ముమ్మరం చేసింది. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలు మేరకు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు సమావేశాలు ఏర్పాటు చేసుకుని జన సమీకరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తున్నారు.ఈ తరుణంలో కేటీఆర్ బీఆర్ఎస్ రజతోత్సవ సభ,హెచ్‌సీయూ భూముల వ్యవహారంతో పాటు రాష్ట్ర రాజకీయాలపై మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ‘25 ఏళ్లు పూర్తి చేసుకున్న రెండవ తెలుగు ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్. అందుకే భారీ ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేశాం. బీఆర్ఎస్ పార్టీ చరిత్రలో ఇది అతిపెద్ద బహిరంగ సభ అవుతుంది. ఈ సారి డిజిటల్ మెంబర్షిప్ ప్రవేశపెడుతున్నాం. అన్ని జిల్లా కార్యాలయాల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తాం. సిల్వర్ జూబ్లీ సందర్భంగా నెలకో కార్యక్రమం జిల్లాల్లో నిర్వహిస్తాం.అమెరికా దుందుడుకు నిర్ణయాల వల్ల స్టాక్ మార్కెట్లో లక్షల కోట్లు నష్టపోయారు. మోదీ ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు. ఇంత జరుగుతున్నా మౌనం ఎందుకు?. తర్వాత దెబ్బ తెలంగాణపై పడబోతుంది. తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున ఫార్మా ఎగుమతులు ఉంటాయి. వాటిపై ఎఫెక్ట్ ఉండబోతుంది. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.రాష్ట్రంలో నెగటివ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలు BRS పార్టీ మొదలుపెట్టినవి కాదు. లగచర్ల,మూసీ పునరుజ్జీవనం, హెచ్‌సీయూ విషయంలో బాధితులే మా వద్దకు వచ్చారు. ఏఐ వీడియోలు అంటూ ప్రతిపక్షంపై కేసులు పెడుతున్నారు. ప్రభుత్వ సంస్థ నెహ్రూ జూలాజికల్ పార్క్ నివేదికలోనే అక్కడ జింకలు, నెమళ్లు ఉన్నాయని చెప్పింది. జంతువుల వ్యధకు కారణమైన వారిపై కచ్చితంగా కేసులు పెట్టాల్సిందే. రెండు జాతీయ పార్టీల జుట్టు ఢిల్లీ చేతిలో ఉంది. ఒకరు ఢిల్లీ నేతల చెప్పులు మోస్తే.. ఇంకొకరు ఢిల్లీకి బ్యాగులు మోస్తారు. బహిరంగ సభకు అనుమతి ఇవ్వకపోతే కోర్టుకు వెళతాం. HCU విషయంలో ప్రభుత్వం న్యాయస్థానాలను కూడా తప్పుదోవ పట్టించింది. సంజయ్ దత్, సల్మాన్ ఖాన్, సైఫ్ ఆలీ ఖాన్ లాంటి వాళ్లు జింకలను చంపితే జైలుకు వెళ్లారు. మరి ఇక్కడ జింకలను చంపిన వారిపై కేసులు పెట్టారా?ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రంలో జరుగుతున్న భారీ భూ కుంభకోణాన్ని బయటపెడతా. హెచ్‌సీయూలో 400 ఎకరాలు కాదు దాని వెనకాల వేల ఎకరాల భూముల వ్యవహారం ఉంది. ఈ కుంభకోణంలో ఓ బీజేపీ ఎంపీ కూడా ఉన్నారు. అన్ని ప్రజలకు వివరిస్తా. కాంగ్రెస్, బీజేపీలకు ఉమ్మడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.రేవంత్ రెడ్డిని కాపాడుతుంది బండి సంజయ్’ అని వ్యాఖ్యానించారు. -
‘నేను ప్రజలకు కాపలా కుక్కను.. నీలాగా గుంట నక్కను కాదు’
జనగామ జిల్లా : స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిల మధ్య వాగ్వాదం రోజురోజుకూ ీవ్రతరమవుతోంది. ఈ నేతలు ఇద్దరు కౌంటర్ల మీద కౌంటర్ల ఇచ్చకోవడంతో జిల్లాలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. తాజాగా కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలకు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తనను బొచ్చు కుక్క అన్న వ్యాఖ్యలను తనదైన శైలిలో తిప్పికొట్టారు పల్లా.తాను కుక్కనేనని, కాకపోతే ప్రజలకు విశ్వాసంగా పని చేసే కాపలా కుక్కనన్నారు. అదే సమయంలో కడియం శ్రీహరిని గుంట నక్కతో పోల్చారు. నీలాగా గుంట నక్కను కాదంటూ మండిపడ్డారు. ‘ఘన్‌పూర్‌కు మున్సిపాలిటీ వస్తే ఆపేసారు, డిగ్రీ కాలేజీ ఆపేసారు, లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసారు, 100 పడకల ఆస్పత్రిని ఆపేశారు. నవాబ్‌పేటకు లైనింగ్ వస్తే దాన్ని కూడా ఆపేశారు. ఆపేసే చరిత్ర వాళ్లది.. పనులు చేయడమనే చరిత్ర మనది’ అంటూ మండిపడ్డారు.ఇటీవల తనను ‘బొచ్చు కుక్క’ అనేలా మాట్లాడిన కడియంను పల్లా గట్టిగానే తిప్పికొట్టారు. “అవును నేను కుక్కనే..నా ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే, వారిని కాపాడేందుకు కాపలా కుక్కగా ఉంటాను. నీలాగా గుంట నక్కను మాత్రం కాదు,” అని పల్లా స్పష్టంగా చెప్పారు. ‘అటవీ భూములపై జరుగుతున్న ఆక్రమణల గురించి కూడా స్పందించారు.ముసలితనానికి అటవీ భూముల మీద కన్నేస్తున్నారు. ఒకరిపై 25 ఎకరాలు, మరొకరిపై మరో 25 ఎకరాలు ఆ భూములను కాపాడటానికి నేను రేసు కుక్కలా ఉంటా’ అని తెలిపారు.కేసీఆర్ , బీఆర్ఎస్ పార్టీకి విశ్వాసం ఉన్న కుక్కను. ప్రజలను కాపాడటంలో ఎప్పుడూ ముందుండే లక్షణాలు నాకు ఉన్నాయి. నిన్ను ఎదుర్కొనే గుణాలు కూడా నా వద్ద ఉన్నాయి’ అని కూడా హెచ్చరించారు. -
‘తెలంగాణకు ఏం ఎలగబెట్టారని ఒక్క చాన్స్’
హైదరాబాద్: కేంద్ర మంత్రులు, తెలంగాణ బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ మరోసారి మండిపడ్డారు. అసలు తెలంగాణకు బీజేపీ ఏం చేసిందని ఒక్క చాన్స్ అడుగుతున్నారంటూ ధ్వజమెత్తారు. తెలంగాణకు ఏమి తెచ్చారో కేంద్ర మంత్రులైన కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు వైట్ పేపర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.‘11 ఏండ్లు తెలంగాణ కు ఏమి తెచ్చారో వైట్ పేపర్ రిలీజ్ చేయండి.. చర్చకు సిద్ధమా.. మోదీ, అమిత్ షాలు ఆర్డర్ వేస్తేనే కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు పని చేస్తారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 20 వేల ఎకరాల ప్రభుత్వ భూములు కరిగిపోతే ఎందుకు పట్టలేదు. 10 వేల ఎకరాల భూములను కేసీఆర్, కేటీఆర్ లు అమ్ముకుంటే కిషన్ రెడ్డి ఏం చేస్తుండు. ఇప్పడు కిషన్ రెడ్డి ఒక్క చాన్స్ కావాలని ప్రాధేయపడుతున్నాడు. తెలంగాణకు ఏమి ఎలగబెట్టారని ఒక్క చాన్స్ అడుగుతున్నారు. మూడుసార్లు మోదీని ప్రధానిని చేస్తే రాష్ట్రానికి ఏమీ ఎలగబెట్టారు. తెలంగాణ ప్రజలు కిషన్ రెడ్డికి ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా అవకాశం ఇస్తే ఏం చేశా. మీకు ప్రజలు చాన్స్ ఇవ్వరు. తెలంగాణ బీజేపీ అధికారంలోకి రావడం కల. విభజన హామీలు కిషన్ రెడ్డికి,బండి సంజయ్ కి పట్టదు. వారిద్దరూ పగటి కలలు కంటున్నారు’ అని విమర్శించారు. -
తెలంగాణలో ఏడుగురు కొత్త ఎమ్మెల్సీలు ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇటీవల ఎన్నికైన ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు. రెండు టీచర్స్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలతో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Sukhender Reddy) ప్రమాణ స్వీకారం చేయించారు.ఇటీవల తెలంగాణలో జరిగిన రెండు టీచర్స్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీకి చెందిన అంజిరెడ్డి, మల్క కొమురయ్య ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త ఎమ్మెల్సీలతో మండలి గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రమాణం చేయించారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy), ఎంపీలు రఘునందన్‌రావు, లక్ష్మణ్ హాజరయ్యారు.అలాగే, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలగా (MLA quota MLCs) కాంగ్రెస్ నుంచి ఏకగ్రీవం ఎన్నికైన విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, నెల్లికంటి సత్యంలతో కూడా గుత్తా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఇదే సమయంలో నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ (P.R.T.U) అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి (Sripal Reddy) ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. -
బీజేపీకి ఒక్క చాన్స్ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీకి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడాలని ప్రజలను కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి కోరారు. ఇప్పటివరకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు అవకాశం ఇచ్చారని, ఒక్కసారి బీజేపీకి కూడా అవకాశం ఇస్తే పారదర్శక పాలన ఎలా ఉంటుందో చూపిస్తామని అన్నారు. బీజేపీ ఆవిర్భావ దినోత్స వాన్ని పురస్కరించుకుని ఆదివారం బీజేపీ రాష్ట్ర కా ర్యాలయంలో ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించా రు. బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేయటం.. భారతదేశ గౌరవాన్ని పెంచటం, అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను నిలబెట్టడమే బీజేపీ లక్ష్య మని పేర్కొన్నారు. రైల్వేస్టేషన్లో చాయ్ అమ్ముకున్న సాధారణ వ్యక్తి కుమారుడిని ఈ దేశానికి ప్రధానిని చేసిన ఘనత బీజేపీకే దక్కిందని తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో మూడు దఫాలుగా అత్యంత సమర్థవంతమైన, పారదర్శక పాలనను బీజేపీ అందిస్తోందని తెలిపారు. బీజేపీవైపు చూస్తున్న తెలంగాణ ప్రజలు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యాయని కిషన్‌రెడ్డి విమర్శించారు. అందుకే ప్రజలు బీజేపీవైపు చూస్తున్నారని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో 77 లక్షల మంది తెలంగాణ ప్రజలు బీజేపీకి అండగా నిలిచారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 స్థానాల్లో విజయం అందించారని గుర్తుచేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ గెలుపు తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మజ్లిస్ ఆగడాలను అరికడతాం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎంఐఎంను పెంచి పోషిస్తున్నాయని కిషన్‌రెడ్డి విమర్శించారు. జీహెచ్ఎంసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మజ్లిస్ పార్టీని గెలిపించేందుకు ఆ రెండు పార్టీలు పోటీపడుతున్నాయ ని ఆరోపించారు. మర్రి చెన్నారెడ్డిని సీఎం పదవి నుంచి దించేందుకు మజ్లిస్ హైదరాబాద్‌లో కల్లోలం సృష్టించిందని, తీగలగుట్ట వద్ద 400 మంది దళితులు, హిందువులపై హత్యాకాండకు ఒడిగట్టిందని ఆరోపించారు. మజ్లిస్ దౌర్జన్యాల వల్ల పాతబస్తీ నుంచి హిందువులు వలస పోతున్నారని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మజ్లిస్ పార్టీ ఆగడాలను అడ్డుకుంటుందని ప్రకటించారు. 14వ తేదీ వరకు బీజేపీ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించాలని, పార్టీ కార్యకర్తలు తమ ఇళ్లపై పార్టీ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. 14 నుంచి 22 వరకు అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను ఘ నంగా నిర్వహించాలని సూచించారు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కే.లక్ష్మణ్ మాట్లాడుతూ.. తెలంగాణలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. రేవంత్‌రెడ్డి రబ్బర్ స్టాంప్ ముఖ్యమంత్రికాంగ్రెస్ సర్కార్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపాటు కరీంనగర్ టౌన్: సీఎం రేవంత్‌రెడ్డి రబ్బర్ స్టాంప్‌లా మారారని కేంద్ర హోంశాఖ స హాయ మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చే శారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం బండి సంజయ్ మొదట కరీంనగర్‌లోని తన నివాసంలో.. తరువాత పార్టీ జిల్లా కార్యాలయంలో కార్యకర్తలతో కలసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. సచివాలయంలో రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ మంత్రుల కమిటీతో సమీక్ష చేయడమేంటని ప్రశ్నించారు. మంత్రివర్గ విస్తరణ విషయంలో కాంగ్రెస్ అధిష్టానానిదే తుది నిర్ణయమని పీసీసీ అధ్యక్షుడు చెప్పడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఎవరుండాలి? ఎవరు వద్దు అనేదానిపై ముఖ్యమంత్రికి విచక్షణాధికారం ఉంటుందని, తెలంగాణలో పాలన భ్ర ష్టు పట్టిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని మండిపడ్డారు. కాగా, 45 ఏళ్లుగా బీజేపీ అనేక ఒడిదొ డుకులు, అవమానాలను అధిగమించిందన్నారు. 16 రాష్ట్రాల్లో సొంతంగా.. 6 రాష్ట్రాల్లో కూటమి ద్వారా ప్రభుత్వాలను కొనసాగిస్తోందన్నారు. సన్న బియ్యం కోసం కేంద్రం కిలోకు రూ.37 ఖర్చు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం భరించేది కేవలం రూ.10 మాత్రమే అన్నారు. అలాంటప్పుడు రేషన్ షాపుల వద్ద ప్రధాని ఫొటో ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు నుంచి బియ్యం వరకు ప్రతిపైసా కేంద్రమే చెల్లిస్తోందన్నారు. -
బండి సంజయ్‌కు టీపీసీసీ స్ట్రాంగ్ కౌంటర్
హైదరాబాద్: కేంద్ర మంత్రి, ఎంపీ బండి సంజయ్ కు టీపీసీసీ స్ట్రాంగ్ కౌంటరిచ్చింది. నోటికొచ్చింది మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని, బండి సంజయ్ ఖబర్దార్ అంటూ హెచ్చరించారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ మేరకు మహేష్ కుమార్ గౌడ్ పత్రికా ప్రకటన విడుదల చేశారు.‘ దమ్ముంటే బీసీల 42 శాతం రిజర్వేషన్లను 9 వ షెడ్యూల్లో చేర్చేలా చట్టబద్ధత కోసం ప్రధానిని ఒప్పించే దమ్ముందా?,* ఢిల్లీ పెద్దలకు భయపడే తెలంగాణ బిజెపి నేతలు బీసీల ధర్నాకు మొహం చాటేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఢిల్లీ పెద్దలకు గులాం గిరి చేసిన పనులు మర్చిపోయావా బండి సంజయ్. రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి చెప్పులు మోసిన చరిత్ర నీది నోటికొచ్చింది మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ పార్టీ అనేది జాతీయ పార్టీ. ఏదైనా సమిష్టి నిర్ణయాలు ఉంటాయి. అసెంబ్లీ పార్లమెంట్ ఎమ్మెల్సీ ఎన్నికల వలె స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీ బిఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందం ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేకనే రహస్య మిత్రులు బిఆర్ఎస్ తో చీకటి ఒప్పందం. బండి సంజయ్ లో రోజురోజుకు అభద్రత భావం పెరిగిపోతుంది. మోదీ, అమిత్ షా అనుమతి లేకుండా కనీసం టిఫిన్ కూడా చెయ్యడు. సొంత పార్టీ కార్యకర్తలే బండి సంజయ్ వైఖరిపై గుర్రుగా ఉన్నారు. అధ్యక్ష పదవి రాదని తెలిసి బండి సంజయ్ ఆగమాగం అయితుండు. గుర్తింపు కోసమే తాను కేంద్రమంత్రిని అని మర్చిపోయి దిగజారి బండి సంజయ్ మాట్లాడుతుండు. బీజేపీలో ఉనికి కోసం బండి సంజయ్ ఆరాటం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి బండి సంజయ్ కి కనిపించకపోవడం విడ్డూరం. సుదీర్ఘ కాలం అయినా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నియామకం చేసుకోలేని బీజేపీకి కాంగ్రెస్ హై కమాండ్ గురించి మాట్లాడే హక్కే లేదు. సీఎం రేవంత్ రెడ్డి పూర్తి పట్టు సాధించి బట్టే బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులకు ఆమోదం లభించిందని అవగాహన లేకుండా బండి మాట్లాడుతున్నారు. హెచ్ సీయూ అంశం ఉన్నత న్యాయ స్థాన పరిదిలో ఉంది. ప్రభుత్వం కమిట్ వేసింది. రాజకీయ అవసరాల కోసం బండి సంజయ్ మాట్లాడడం సమంజసం కాదు. మైనార్టీ హక్కుల కోసం నిలబడి కాంగ్రెస్ వక్ఫ్ బోర్డు బిల్లు పై నిర్ణయం తీసుకుంది.కార్పొరేట్ సంస్థలను నయన భయానా బెదిరించి నిధులు రాబట్టుకున్న బీజేపీ నంబర్ వన్ గా నిలిచింది.సన్న బియ్యం బీజేపీ ఇస్తుంటే దేశం మొత్తం ఇవ్వచ్చు కదా?, సన్న బియ్యంతో తెలంగాణలో నిరుపేదలకు అసలైన పండుగను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. దేశ చరిత్రలో నిలిచిపోయే కుల గణన, బీసీ బిల్లు, ఎస్సీ వర్గీకరణ సన్న బియ్యంను కాంగ్రెస్ హయంలో అమలు అయ్యాయి’ అని స్పష్టం చేశారు. -
హెచ్‌సీయూ వివాదం.. కేటీఆర్ బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: కంచ గచ్చిబౌలి, హెచ్‌సీయూ రక్షణకు చేతులు కలపాలంటూ తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, పర్యావరణ ప్రియులకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. హెచ్‌సీయూ భూముల వివాదం నేపథ్యంలో రేవంత్ సర్కార్ తీరును లేఖలో ఎండగట్టారు. 400 ఎకరాల పర్యావరణం ప్రమాదంలో పడింది. 734 జాతుల మొక్కలు, 220 పక్షులు, 15 సరీసృపాలు, 10 క్షీరదాల ఆవాసం నాశనం కాకుండా ఆపుదాం అంటూ కేటీఆర్ పిలుపునిచ్చారు.‘‘ప్రభుత్వం ఆర్థిక లాభం కోసం పర్యావరణంపై దాడి చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం పర్యావరణం నాశనం చేసే ప్రణాళికలు కొనసాగిస్తోంది. విద్యార్థుల నిరసనకు సలాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు శాంతియుతంగా అడవి రక్షణకు పోరాడుతున్నారు. విద్యార్థులపై అపవాదులు, యూనివర్సిటీని తరలించే బెదిరింపులు ప్రభుత్వ రియల్ ఎస్టేట్ మనస్తత్వానికి నిదర్శనం’’ అంటూ కేటీఆర్ మండిపడ్డారు.ఎకో పార్క్ పేరుతో సరికొత్త మోసం. అడవిని కాపాడే బదులు భూమి ఆక్రమణకు ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. నిరసనలు కొనసాగితే హెచ్‌సీయూని "ఫోర్త్ సిటీ"కి తరలిస్తామని హెచ్చరిక తప్పు. పర్యావరణ పరిరక్షణ కోసం విద్యార్థులకు మద్దతుగా నిలవాలి. కంచ గచ్చిబౌలి, యూనివర్సిటీని కాపాడుతామని పార్టీ నుంచి హామీ హామీ ఇస్తున్నాము. సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించి, భూమి విక్రయాన్ని రద్దు చేయాలి’’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు. -
‘హైదరాబాద్‌లో కూర్చొని మాట్లాడటం కాదు.. అది చేసిన కేసీఆర్ పుణ్యం’
సాక్షి, సిద్దిపేట: కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ఉత్తర తెలంగాణకు వర ప్రదాయిని.. హైదరాబాద్‌లో కూర్చొని కాళేశ్వరం కూలిందని చెప్పడం కాదు అంటూ ఘాటు విమర్శలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును చిన్నచూపు చూస్తున్నది. అన్ని రకాలుగా ప్రభుత్వాన్ని నిద్ర లేపే ప్రయత్నం చేశాం అంటూ వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆదివారం.. చిన్న కోడూరు మండలం చౌడారం గ్రామం వద్ద బిక్క బండకు వెళ్లే కాలువకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్బంగా హరీష్‌రావు మాట్లాడుతూ..‘కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నేడు రంగనాయక సాగర్ రిజర్వాయర్ నుండి బిక్క బండ గుట్టకు నీళ్ళు విడుదల చేయడం జరిగింది. గత ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో భూసేకరణ కోసం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును చిన్నచూపు చూస్తున్నది. ఇవ్వాళ ప్రాజెక్టులో నీళ్ళు ఉన్నాయి. రంగనాయక సాగర్ లో, కొండపోచమ్మ, మిడ్ మానేరు లో నీళ్ళు ఉన్నాయి. కక్షపూరితంగానే ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. కొత్తగా ఒక్క ఎకరం భూ సేకరణ చేయడం లేదు.కేసీఆర్ ప్రాజెక్టులు కట్టి సిస్టం అంత రెడీ చేశారు. పంపు హౌస్‌లు, రిజర్వాయర్లు, సబ్ స్టేషన్లు, మెయిన్ కెనాల్స్, డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ అన్ని రెడీగా ఉన్నాయి. కేవలం భూ సేకరణ చేసి కాలువలు తవ్వి రైతులకు నీళ్లు ఇవ్వాల్సింది ఉంది. కానీ, ఈ సంవత్సరం కాలంలో ఒక్క ఎకరా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కింద భూసేకరణ చేయలేదు. చేయకపోవడం వల్ల చాలా చోట్ల కూడా రైతులు సొంత డబ్బులు పెట్టుకొని రైతులే స్వచ్ఛందంగా కాలువలు తవ్వుకొని నీళ్లు తీసుకున్న సందర్భం ఉన్నది.కొండెంగులకుంట, బిక్కబండ రైతులు అందరూ వస్తే.. స్వంత డబ్బులతో మిషన్లు పెట్టి.. స్వంత డబ్బులు పెట్టీ, భూ సేకరణలో నష్ట పోతున్న వారికి డబ్బులు ఇచ్చి కాలువలు తవ్వి నీళ్లు అందిస్తున్నాం. ప్రభుత్వం పనిచేయట్లేదు. ప్రేమతో పని చేయాలి కానీ కక్షతో పని చేస్తున్నది. నిన్న కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడాను. పిల్ల కాలువలు తవ్వితే రైతులకు ఆయకట్టు పెరుగుతుంది. కనీసం 15, 20 కోట్లు భూసేకరణకు విడుదల చేయండి అని కోరాను.చిన్న కోడూరు మండలం చౌడారం గ్రామం వద్ద బిక్క బండకు వెళ్లే కాలువ కు నీటిని విడుదల చేసిన మాజీ మంత్రి @BRSHarish గారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ..- కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నేడు రంగనాయక సాగర్ రిజర్వాయర్ నుండి బిక్క బండ గుట్టకు నీళ్ళు విడుదల చేయడం జరిగింది.- గత ఏడాదిన్నర… pic.twitter.com/o9z1QQTWWm— Office of Harish Rao (@HarishRaoOffice) April 6, 2025అసెంబ్లీలో కూడా కట్ మోషన్ ఇచ్చి నిరసన తెలపడం జరిగింది. అన్ని రకాలుగా ప్రభుత్వాన్ని నిద్ర లేపే ప్రయత్నం చేశాం. కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ఉత్తర తెలంగాణకు వర ప్రదాయిని. కోకాకోలా ఫ్యాక్టరీ కూడా కాళేశ్వరం నీళ్లు ఉండబట్టి వచ్చింది. రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు. ప్రభుత్వం ఆలస్యం చేయకుండా కుంగిన ఒకటో రెండో పిల్లర్లను మరమ్మతులు చేసి నీళ్ళు ఇవ్వాలని కోరుతున్న. కాంగ్రెస్ వచ్చాక ఖమ్మంలోని పెద్దవాగు, సుంకిశాల, SLBC సొరంగం, వట్టెం ప్రాజెక్టులు కూలిపోయాయి. కాళేశ్వరం అంటే మెగా ప్రాజెక్టు. కాళేశ్వరం ద్వారా సిద్ధిపేట నియోజకవర్గంలో 52 వేల ఎకరాలకు నీళ్లు అందిస్తున్నాం. ఇది కేసీఆర్ చేసిన పుణ్యం. హైదరాబాద్ లో కూర్చొని కాళేశ్వరం కూలిందని చెప్పడం కాదు. సిద్ధిపేట ఒక్కటే కాదు ఎన్నో నియోజకవర్గాలకు నీళ్ళు అందుతున్నాయి. ఇప్పటికైనా గోబెల్స్ ప్రచారం ఆపి భూ సేకరణ చేసి కాలువలు తవ్వి రైతాంగానికి నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
అన్న వచ్చిండంటే.. తమ్ముళ్లకు పండగే..
పాపన్నపేట(మెదక్): మెతుకుసీమ గులాబీ దళంలో పట్టు సాధించడానికి ‘కంఠప్ప’ పావులు కదుపుతున్నాడు. మెదక్ అసెంబ్లీ టికెట్‌పై కన్నేసిన ఆయన మొదట జిల్లా అధ్యక్ష పదవిపై ఆశలు పెంచుకుంటున్నాడు. ఈనెల 27న వరంగల్‌లో జరగనున్న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ అనంతరం పార్టీ సంస్థాగత ఎన్నికలపై దృష్టి పెడతారన్న సంకేతాల మేరకు ఆయన గులాబీ సైనికులను మచ్చి క చేసుకునే పనిలో పడ్డాడు. ఈక్రమంలో పాపన్నపేట మండల నాయకులకు వేసవి టూర్ ఆఫర్ చేశాడు. త్వరలోనే విహారయాత్రకు తరలివెళ్లేందుకు తమ్ముళ్లు తెగ ఆరాట పడుతున్నారు.అక్కను మరిచి.. అన్న పంచన చేరిఇంత వరకు అక్క మాట జవ దాటని వీర విధేయులు సైతం.. కంఠప్ప పంచన చేరుతున్నారు. పాపన్నపేట మండలంలోని బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యులైన పంచ పాండవులు. గ్రూపు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. నియోజకవర్గ పర్యటనకు వచ్చినప్పుడల్లా వెంట తిరిగిన తమ్ముళ్లకు సాయంత్రం ఆయన విందు ఇచ్చి మచ్చిక చేసుకుంటున్నాడు. ఈనెల 1న గాంధారిపల్లిలో భారీ విందు ఏర్పాటు చేసి తమ్ముళ్లను ఖుషీ చేశాడు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ సంపాదించగలిగతే కాంగ్రెస్‌లో ప్రస్తుతం క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న తన మాజీ అనుచరులు తనకు మద్దతు ఇస్తారన్న నమ్మకం ఆయనలో కనిపిస్తుంది. ఎమ్మెల్యే టికెట్ కోసం గత ఏడేళ్లుగా అలుపెరుగని పోరాటం చేస్తున్న ఆయన భారీగా ఖర్చు చేస్తున్నాడు.గత ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించడానికి తన వంతు ప్రయత్నం చేసి విఫలుడయ్యాడు. పరాజయ భారంతో అక్క కొంత కాలం మౌన దీక్ష పాటించింది. అయితే ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు పట్టు వదలని విక్రమార్కుడిలా తన కంటూ బలమైన కేడర్‌ను తయారు చేసుకునే పనిలో పడ్డాడు. ఈ పరిణామాన్ని సునిశితంగా గమనిస్తున్న అక్క పార్టీ అధ్యక్ష పదవిని బీసీకి కట్ట బెట్టాలనే డిమాండ్‌తో కంఠప్పకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఏడుపాయల జాతరలో రథోత్సవానికి ఇద్దరు నాయకులు కలసి వస్తారని, పార్టీవర్గాలు సమాచారం ఇచ్చాయి. ఈ మేరకు ఒక వర్గం నాగ్సాన్పల్లిలో.. మరోవర్గం లక్ష్మీనగర్‌లో సేద దీరాయి. కానీ ఏం జరిగిందో ఏమో గాని మొదట అక్క కొంత మంది నాయకులతో కలసి విడిగా ఏడుపాయలకు వచ్చారు. ఆమె వెళ్లిన కొంత సేపటికి అన్న వెంట అధిక సంఖ్యలో గులాబీ నాయకులు తరలివచ్చారు. ఒకే పార్టీలో నెలకొంటున్న వర్గ విభేదాలు రోజు రోజుకు ముదిరి పాకాన పడుతున్నాయి. ఈ ఇద్దరు పార్టీ నాయకులు ఎక్కడా ఎదురు పడకుండా చూసుకుంటున్నారు. ఒక వేళ కనిపించినా ఎడముఖం.. పెడముఖం అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఈ పరిణామాలు పార్టీకి నష్టం చేకూర్తున్తున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. -
HCU విషయంలో కాంగ్రెస్ ఇంచార్జ్ సూచనలేంటి?: బండి సంజయ్
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో రబ్బర్ స్టాంప్ పాలన కొనసాగుతోందని ఎద్దేవా చేశారు కేంద్రమంత్రి బండి సంజయ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలన మీద పట్టులేకుండా పోయింది. రాష్ట్ర మంత్రులను ఏఐసీసీ నిర్ణయించడం ఏంటి? అని ప్రశ్నించారు. అలాగే, ఎంఐఎంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.కేంద్రమంత్రి బండి సంజయ్ తాజాగా కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ..‘ఢిల్లీలో వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఓటు వేసింది. తెలంగాణాను మజ్లీస్‌కు అంటగట్టడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ యత్నిస్తున్నాయి. మజ్లీస్ కబంధ హస్తాల నుండి తెలంగాణాను కాపాడమే మా లక్ష్యం. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం బీజేపీదే. రేషన్ బియ్యానికి కేంద్రం 37 రూపాయలు ఖర్చు పెడితే రాష్ట్రం 10 రూపాయలు ఖర్చు చేస్తోంది. తెలంగాణాలో ఇచ్చే రేషన్ బియ్యం మోదీ ఇస్తున్నవే.మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మేము బియ్యానికి పది రూపాయలు ఖర్చు బెడుతున్నామని చెబుతున్నారు. కేంద్రం అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తుంది. ముఖ్యమంత్రికి పాలన మీద పట్టు లేకుండా పోయింది. ముఖ్యమంత్రి రబ్బర్ స్టాంపుగా మారాడు. రబ్బర్ స్టాంపు పాలన తెలంగాణాలో కొనసాగుతోంది. రాష్ట్ర మంత్రులను ఏఐసీసీ నిర్ణయించడం ఏంటి?. హెచ్‌సీయూ విషయంలో మంత్రులు ఏం చేయాలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ సూచనలు ఇవ్వడం ఏంటి?. తెలంగాణాలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే అవినీతి రహిత రాష్ట్రంగా కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ అవినీతి పాలన అంతమొందించాల్సిన సమయం ఆసన్నమైంది’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
మాకు బలం లేకపోవడం వల్లే బరిలో నిలవలేదు
హైదరాబాద్,సాక్షి: బలం లేని చోట బీజేపీ ఎలా గెలుస్తుంది? అంటూ హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలపై మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందంలో భాగంగానే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పోటీ. కాంగ్రెస్ పోటీలో లేదు. మేము బీజేపీకి మద్దతు ఇచ్చే పరిస్థితి ఉండదు. బలం లేని చోట బీజేపీ ఎలా గెలుస్తుంది?బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందంలో భాగంగానే బీజేపీ నామినేషన్ వేసింది. 112 ఓట్లలో బీజేపీకి కేవలం 27 ఓట్లు మాత్రమే ఉన్నాయి. మాకు బలం లేకపోవడం వల్లే బరిలో నిలవలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము తటస్థంగా ఉన్నాం. ఏ పార్టీకి మద్దతు తెలపడం లేదు.బీజేపీ ఎలా గెలుస్తుంది క్రాస్ ఓటింగ్ ఎంకరేజ్ చేస్తున్నారా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ నాయకునికి బినామీగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థిని పెట్టకుండా బీజేపీకి లోపాయికారి ఒప్పందంతో మద్దతు తెలిపింది’ అని వ్యాఖ్యానించారు. -
నేడు ఉత్తరాఖండ్‌కు మంత్రులు పొన్నం, సీతక్క
సాక్షి, హైదరాబాద్: సామాజిక న్యాయం సాధికారతపై కేంద్ర సామాజిక న్యాయ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ అధ్యక్షతన ఈనెల 7, 8 తేదీల్లో డెహ్రాడూన్‌లో జరగనున్న చింతన్ శిబిర్ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హాజరు కానున్నారు. ఇందులో భాగంగా మంత్రులు ఆదివారం మధ్యాహ్నం ఉత్తరాఖండ్‌కు బయలుదేరనున్నారు.వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, దేశానికి దిక్సూచిగా నిలిచిన కులగణన, బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు తదితర అంశాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సదస్సులో ప్రసంగిస్తారు. అదేవిధంగా రాష్ట్రంలో వయోవృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్ల సంక్షేమం, అభివృద్ధి కోసం చేస్తున్న కృషి, అమలవుతున్న పథకాలను మంత్రి సీతక్క ఈ సందర్భంగా వివరించనున్నారు. -
బీజేపీ సమావేశంలో ఈటెల ఆసక్తికర వ్యాఖ్యలు
మేడ్చల్: జిల్లా బీజేపీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఎంపీ ఈటెల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదవిని పొందేటప్పుడు ఉండే ఆరాటం.. పని చేసేటప్పుడు కూడా ఉండాలని బీజేపీ శ్రేణులకు చురకలంటించారు. పార్టీలో అటెండెన్స్ సిస్టం ఉండొద్దని, చేతులు ఎత్తే పద్ధతి ఉండొదన్నారు ఈటెల. ఇది ఇన్సల్ట్ చేసే పద్ధతి అని ఈటెల పేర్కొన్నారు.‘ పదవుల్లో పొందిన వారు కష్టపడి పార్టీ కోసం పని చేయాలి. ఆరాటం అనేది రెండు విషయాల్లో ఉండాలి. ఒక వేళ పదవులు పొంది.. పని చేయకపోతే వారు రాజీనామా చేయండి. ఇందులో రాజీపడే ప్రసక్తే లేదు. డివిజన్ అధ్యక్షుడు ఆపైన నాయకులు 24 గంటలు అందుబాటులో ఉండాలి. ఆలా ఉండకపోతే పార్టీకి రాజీనామా చేయండి. ఈ రాష్ట్రంలో రాబోయే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమేనని చర్చ జరుగుతోంది. దానిని అందిపుచ్చుకునేందుకు మనమంతా సిద్ధంగా ఉండాలి’ అని ఈటెల పేర్కొన్నారు. -
ఆ మూడు జిల్లాల ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం
సిద్దిపేట: మళ్లీ ఎన్నికలు వస్తే అధికారం తమదేనని అంటున్నారు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో రజతోత్సవ సంబరాలకు బీఆర్ఎస్(టీఆర్ఎస్) సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో వరుసగా జిల్లాల ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశమవుతున్నారు. దీనిలోభాగంగా ఈరోజు(శనివారం) ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లా నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లి ఫాంహౌస్ లో ఈ మూడు జిల్లాల నేతలతో కేసీఆర్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారితో కేసీఆర్ మాట్లాడుతూ.. ‘ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిపోయింది. రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్ల కూడా తగ్గిపోయాయి. రైతులకు ఎలాంటి మేలు జరగడం లేదు. కాంగ్రెస్ సర్కార్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మళ్లీ ఎన్నికల్లో అధికారం మనదే’ అని కేసీఆర్ శ్రేణులకు ధైర్యం నూరిపోశారు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే భారీ బహిరంగ సభకు ఎలా సన్నద్ధం కావడంపై కేసీఆర్ పార్టీ నాయకులకు వివరించినట్లు తెలుస్తోంది. పార్టీ నాయకులతో పాటు ప్రజలను బహిరంగ సభకు తరలించే అంశాలను ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. -
బీఆర్ఎస్, కాంగ్రెస్ ఓటర్లు ఎంఐఎంకు వ్యతిరేకంగా ఓటెయ్యాలి: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఓటర్లు ఎంఐఎంకు వ్యతిరేకంగా ఓటువేసి బీజేపీని గెలిపించాలని కిషన్‌రెడ్డి కోరారు.కేందమంత్రి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘హైదరాబాద్ లోకల్ బాడీ ఎన్నికలలో ఎంఐఎం వ్యతిరేకులంతా బీజేపీ వైపు నిలబడాలి. ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ మూడు పార్టీలు ఒక్కటే. లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా గెలుస్తోంది. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయవచ్చు. సంఖ్యా బలంతో సంబంధం లేకుండా మేము పోటీ చేస్తున్నాం. ఒక్క బీఆర్ఎస్ ఓటర్లనే కాకుండా కాంగ్రెస్ ఓటర్లను కూడా ఎంఐఎంకు వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరుతున్నాం. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతీ బూత్‌లో పార్టీ జెండా ఎగురవేస్తాం. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం తర్వాత రాష్ట్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తవుతుంది’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. -
MLC Elections: బలం మజ్లిస్‌దే!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక రసవత్తరంగా మారింది. ఎన్నికల్లో ఓటర్ల (కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు) బలం ఎంఐఎం (మజ్లిస్)కే ఎక్కువగా ఉన్నందున ఆ పార్టీ అభ్యర్థి గెలవడం నల్లేరు మీద నడకేనని, ఆ లెక్కన మిగతా పార్టీలేవీ కూడా తమ అభ్యర్థిని కూడా బరిలో దింపకుండా ఎన్నిక ఏకగ్రీవమే కాగలదని ఇప్పటిదాకా అందరూ భావించారు. నామినేషన్ల చివరి రోజున ఊహించని విధంగా బీజేపీ కూడా తమ అభ్యర్థిని బరిలో దింపడంతో పోలింగ్ నాటికి ఏం జరగనుందన్నది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల్లో తమ పార్టీకి బలం లేదన్నది బీజేపీకి తెలియనిది కాదు.. అయినా రంగంలోకి దిగిందంటే లోపాయికారీగా ఏదో జరుగుతోందన్న ప్రచారానికి తావిచి్చంది. జీహెచ్ఎంసీలో 25 అసెంబ్లీ నియోజకవర్గాలు, 150 వార్డులున్నప్పటికీ, ఈ ‘స్థానిక’ ఎన్నికల్లో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు, 81 కార్పొరేటర్ల డివిజన్లు మాత్రమే ఉన్నాయి. దీంతో పాటు ఈ స్థానిక సంస్థలో ఓటేసేందుకు ఎంపిక చేసుకున్న ఎమ్మెల్సీలు, ఎంపీలు సైతం ఉన్నారు. ఈ ఎన్నికకు సంబంధించి ఓటర్లుగా బీజేపీ నుంచి తాజాగా ఒక రాజ్యసభ సభ్యుడు డా. కె.లక్ష్మణ్, ఇద్దరు ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలు చేరారు. ఓటర్లుగా చేరేందుకు ఇక ఎవరికీ అవకాశం లేదు. గడువు ముగిసిపోయింది. రాబోయే మేయర్ స్థానంపై అవగాహనతో..? ఇటీవల కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన విజయశాంతి, అద్దంకి దయాకర్, బీఆర్ఎస్ నుంచి ఎన్నికైన దాసోజు శ్రవణ్ ఇంకా ప్రమాణం చేయనందున వారు ఓటర్లు కాలేదని సమాచారం. తాజా సమాచారం మేరకు సైతం అన్ని పార్టీల కంటే ఎంఐఎంకే ఎక్కువ బలం ఉంది. ఆ పార్టీకి చెందిన ఓటర్లు 49 మంది ఉన్నారు. ఇక తర్వాత స్థానాల్లో బీజేపీ, బీఆర్ఎస్లు ఉన్నాయి. కాంగ్రెస్ ఎలాగూ తమ అభ్యర్థిని బరిలోకి దింపదని, ఎంఐఎంకు మద్దతునిస్తుందని, రాబోయే జీహెచ్ఎంసీ మేయర్ స్థానాన్ని సైతం దృష్టిలో ఉంచుకొని ఈ అవగాహనకు వచి్చనట్లు చెబుతున్నారు. అంతేకాకుండా.. ఇటీవల జరిగిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం తమ అభ్యర్థిని బరిలో దించకుండా కాంగ్రెస్‌కు మద్దతునట్లుగానే అందరూ భావిస్తున్నారు. మద్దతు కూడగట్టే ధీమాలో బీజేపీ.. మారుతున్న రాజకీయ పరిస్థితులతో ఎంఐఎంతో పోరాడి గెలిచేందుకు తాము ఇతర పార్టీల మద్దతు కూడగట్టగలమనే ధీమాలో బీజేపీ ఉన్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి కార్పొరేటర్లు, ఎమ్మెల్యేల ఎన్నికలప్పుడు ఒక పార్టీలో ఉండి ఇప్పుడు వేరే పార్టీలో చేరిన వారు కూడా ఎందరో ఉన్నారు. వారిలో ఎందరు ఇప్పుడు తాముంటున్న పార్టీ అభ్యర్థికే ఓటు వేస్తారో చెప్పలేని పరిస్థితి. దాంతో కాంగ్రెస్ మద్దతిచ్చే ఎంఐఎంకు ఎందరు ఓటు వేస్తారో కూడా చెప్పలేమంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారు తమపై పెత్తనం చెలాయిస్తున్నారనే అభిప్రాయం కాంగ్రెస్ కార్పొరేటర్లలో ఉంది. వాస్తవానికి కార్పొరేటర్ ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్‌నుంచి ఇద్దరు కార్పొరేటర్లు మాత్రమే గెలిచినప్పటికీ, వారీ ఎన్నికలో ఓటర్లు కారు. ఇక కార్పొరేటర్లలో.. బీఆర్ఎస్ నుంచి వచి్చన కార్పొరేటర్లే కాంగ్రెస్ ఓటర్లుగా ఉన్నారు. ఇలా వివిధ అంశాలు, వ్యక్తిగత పరిచయాలు, అభిమానాలు, తదితరమైన వాటితో తాము బలంగా పోటీనివ్వగలమన్న ధీమాతోనే బీజేపీ బరిలో దిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వైఖరి ఏమిటన్నది కూడా ఆసక్తిగా మారింది. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ వేటికవిగా మిగతా రెండూ ఒకటేనని ఆరోపిస్తుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏం జరగనుంది? బీఆర్ఎస్ ఎటు మొగ్గుచూపనుంది? కాంగ్రెస్, బీజేపీలు ఏం చేయనున్నాయి? అనేది కూడా ఆసక్తికరంగా మారింది. -
మీ అనుమతితోనే ఈ విధ్వంసమా?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ బోధిస్తున్న నీతి సూత్రాలను తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తుంగలో తొక్కుతున్నారని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు విమర్శించారు. ఓ వైపు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పర్యటిస్తూ రాజ్యాంగ విలువల గురించి మాట్లాడుతుండగా, రేవంత్ తన అనాలోచిత చర్యలతో రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని మండిపడ్డారు. రాహుల్‌గాందీని ఉద్దేశిస్తూ హరీశ్‌రావు శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. రేవంత్ నాయకత్వంలో రాష్ట్రంలో వికృత పాలన సాగుతోందని ఆరోపించారు.‘పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడేలా చట్టం చేస్తామని మీరు అంటున్నా, రేవంత్‌రెడ్డి మాత్రం బీఆర్ఎస్ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించారు. హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరిట బుల్డోజర్లతో పేదల ఇండ్లు కూలుస్తున్నా, మీరు మౌనంగా ఎందుకు ఉంటున్నారు? రేవంత్ విధ్వంసపూరిత వైఖరితో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జంతుజాలం ఆవాసాన్ని కోల్పోయింది. వర్సిటీ అంశంలో మీ పార్టీ అనుబంధ విభాగం ఎన్ఎస్యూఐ సహా అన్ని వర్గాలు రేవంత్ ప్రభుత్వ తీరును ఖండించాయి’అని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ విధ్వంసం మీ అనుమతితోనే సాగుతోందా? ‘రోహిత్ వేముల ఆత్మహత్య సమయంలో హెచ్‌సీయూ సందర్శన వచ్చిన మీకు.. బీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసు ఎస్కార్ట్‌తో పంపి నిరసన తెలిపే అవకాశం కల్పించింది. ఆపదలో అండగా ఉంటానని హెచ్‌సీయూ విద్యార్థులకు మీరు హామీ ఇచ్చినా.. రేవంత్ దుర్మార్గాలపై మౌనం వహించడం ఆశ్చర్యకరం. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చేంతరవరకు వర్సిటీలో కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసకాండ కొనసాగించింది. క్రోనీ కాపిటలిజం, అదానీ వ్యాపార విస్తరణపై దేశవ్యాప్తంగా మీరు పోరాటం చేస్తున్నారు.కానీ మీ సీఎం రేవంత్ తెలంగాణలో అదానీకి ఎర్ర తివాచీ పరిచారు. నల్లగొండలో అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ, లగచర్లలో ఫార్మా విలేజ్ మూలంగా భూములు కోల్పోతున్న రైతులపై దాడులు జరుగుతున్నా మీరు మౌనంగానే ఉన్నారు. తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం కొనసాగిస్తున్న దమనకాండ, విధ్వంస పాలన మీ అనుమతితో కొనసాగుతోందా?’అని రాహుల్‌గాం«దీని హరీశ్‌రావు ప్రశ్నించారు. -
‘ఇక్కడ ఇద్దరు మంత్రులున్నా ఏం లాభం?’
నల్లగొండ జిల్లా : జిల్లాలో ఇద్దరు మంత్రులున్నా ఏం లాభమని విమర్శించారు బీఆర్ఎస్ సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు ఎమ్మెల్యేలు.. మంత్రులుగా ఉండి కూడా ధాన్యం కొనుగోళ్లపై సమీక్షలు జరపలేదని తప్పుబట్టారు. నల్లగొండ బీఆర్ఎస్ కార్యాలయంలో జగదీష్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ‘ రైతులు అన్ని విషయాల్లో మోసపోయారు. రుణమాఫీ, రైతు భరోసా, ధాన్యం కొనుగొళ్లు లేవు. మంత్రులు కమిషన్ లు తింటూ దళారులకు అమ్ముడుపోయారు. జిల్లాలో ధాన్యానికి మద్దతు ధర రావడం లేదు. నల్లగొండ లో ఓ మంత్రికి సోయి లేదు. కమీషన్లు దందాలో నిమగ్నమయ్యాడు. ప్రశ్నిస్తే వారిపై కేసులు పెట్టి భయపెడుతున్నారు. మంత్రులు హెలికాప్టర్లలో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ నిబంధనలు ప్రకారం నడుచుకోవాలి కానీ కాంగ్రెస్ కార్యకర్తలగా మాట్లాడొద్దు’ అని సూచించారు జగదీష్ రెడ్డి. -
‘మాటల్లో అహంకారం, బలుపు తగ్గించుకో’
జనగామ జిల్లా: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చిల్పూరు మండలం చిన్న పెండ్యాల మీడియా సమావేశంలో రాజేశ్వర్ రెడ్డిపై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాజయ్యలు చౌకబారు విమర్శలు మానుకోవాలి. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకో. మాటల్లో అహంకారం, బలుపు తగ్గించుకో. కేసీఆర్ వెంట ఉండి బిఆర్ఎస్ పార్టీని భ్రష్టు పట్టించినవ్. అధికారాన్ని, కేసీఆర్ ను అడ్డం పెట్టుకుని ఆస్తులు సంపాదించుకున్నావ్. అవినీతి అక్రమాలతో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ వ్యక్తివి నువ్వు. నా గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. మొన్నటి ఎన్నికల్లో ఎలా గెలిచావో అందరికీ తెలుసు. కేసీఆర్ వెంట తిరిగి ఆస్తులు కూడ బెట్టుకున్నావ్. అలాంటి ఆలోచన నాకు లేదు. ఉమ్మడి వరంగల్ కు, స్టేషన్ ఘనపూర్ కు నేను చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధం’ అని కడియం శ్రీహరి సవాల్ విసిరారు. కడియంకు సిగ్గుండాలి..కేసీఆర్ చేసిన పనులను తామే చేశామని చెప్పుకోవడానికి కడియం శ్రీహరికి సిగ్గుండాలని విమర్శించారు పల్లా రాజేశ్వర్ రెడ్డి,. స్టేషన్ ఘన్ పూర్ అభివృద్ధికి కడియం అడ్డుపడ్డారని, 100 పడకల ఆస్పత్రి ప్రారంభాన్ని సైతం ఆపారని పల్లా మండిపడ్డారు. -
హైదరాబాద్ లోకల్‌బాడీ ఎంఐఎం ఎమ్మెల్సీ అభ్యర్థి ఖరారు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ అసన్ ఎఫెండ్‌ను ఆ పార్టీ ఖరారు చేసింది. 2009లో నూర్ ఖాన్ బజార్, 2016లో డబిర్ పురా కార్పొరేటర్‌గా ఆయన గెలుపొందారు. 2019లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎంఐఎం అవకాశం ఇచ్చింది. 2023లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా పదవి కాలం పూర్తవ్వగా.. తిరిగి హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంఐఎం అవకాశం ఇచ్చింది.కాగా, హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు బీజేపీ, ఎంఐఎం అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ తరపున ఎన్ గౌతంరావు, ఎంఐఎం తరపున మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండీ నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటివరకు నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి.బీజేపీ, ఎంఐఎంతో పాటు మరో రెండు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు దాఖలయ్యాయి. పోటీకి దూరంగా ఉండాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ నిర్ణయించాయి. కాంగ్రెస్ మద్దతుతో ఎంఐఎం ఏకగ్రీవం అవుతుందనే సమయంలో బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. బీజేపీ నామినేషన్‌తో ఎమ్మెల్సీ ఎన్నిక అనివార్యమైంది. దీంతో బీజేపీ, ఎంఐఎం అభ్యర్థుల మధ్యే పోటీ నెలకొననుంది. ఈ నెల 23న ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. 25 తేదీన కౌంటింగ్ నిర్వహించి.. ఫలితాలు ప్రకటించనున్నారు.