
గండిపేట వద్ద గోదావరి రెండు, మూడో దశ తాగునీటి సరఫరా పథకానికి శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రులు పొన్నం, శ్రీధర్‌బాబు, వివేక్ తదితరులు
గత పాలకులు పదేళ్లు హైదరాబాద్ ప్రజల దాహార్తిని పట్టించుకోలేదు
గోదావరి జలాలు నెత్తి మీద చల్లుకుని తామే ఏదో చేసినట్టు నమ్మించారు: రేవంత్
కాంగ్రెస్ హయాంలోనే నగరానికి కృష్ణా, గోదావరి జలాలు
ప్రస్తుతం ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలు తరలిస్తున్నాం
తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత–చేవెళ్ల కడతామన్న సీఎం
గోదావరి రెండు, మూడో దశ పథకానికి శంకుస్థాపన
16 రిజర్వాయర్లతో పాటు ట్రంపెట్ ఇంటర్ చేంజ్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పదేళ్లలో కృష్ణా, గోదావరి నదుల నుంచి చుక్క నీరు కూడా హైదరాబాద్‌కు తరలించలేదు. గత పాలకులు నగర ప్రజల దాహార్తిని పట్టించుకోలేదు. కాంగ్రెస్ తెచ్చిన గోదావరి జలాలను నెత్తి మీద చల్లుకుని తామే ఏదో చేసినట్టు కొందరు నమ్మించారు. నెత్తి మీద నీళ్లు చల్లుకున్నంత మాత్రాన వాళ్ల పాపాలు తొలగిపోవు..’ అని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. సోమవారం గోదావరి రెండు, మూడో దశ తాగునీటి సరఫరా, మూసీ నది పునరుజ్జీవం పథకాలకు గండిపేట వద్ద ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు.
నిజాం దూరదృష్టి వల్లే నగరానికి తాగునీళ్లు
‘శ్రీపాద ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలను హైదరాబాద్‌కు తరలిస్తున్నాం. కానీ ఆ సంగతి మరిచిపోయి కొందరు మల్లన్నసాగర్ అని మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ హయాంలో అప్పటి సీఎం వైఎస్సార్ చొరవతోనే కృష్టా, గోదావరి జలాలు హైదరాబాద్‌కు వచ్చాయి.
మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మరోసారి గోదావరి జలాల తరలింపునకు ముందడుగు పడింది. వందేళ్లకు పైగా ఈ నగరానికి తాగు నీరు అందుతోందంటే ఆనాటి నిజాం సర్కార్ దూరదృష్టే కారణం. నగరానికి ప్రతి ఏటా 3 శాతం చొప్పున వలసలు పెరుగుతున్నాయి. జనాభా కోటిన్నర దాటడంతో అందుకు తగ్గట్టుగా భవిష్యత్తు ప్రణాళికలు అవసరం..’ అని సీఎం పేర్కొన్నారు.
‘తుమ్మిడిహెట్టి’పై మహారాష్ట్రను ఒప్పిస్తాం
‘గోదావరిపై తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత–చేవెళ్ల కట్టి ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల రైతులకు సాగునీరు అందిస్తాం. దివంగత వైఎస్సార్ తుమ్మిడిహెట్టి వద్దే దీనిని ప్రారంభించారు. అయితే గత బీఆర్‌ఎస్ పాలకులు కాసుల కక్కుర్తితో తలను తొలగించి చేవెళ్ల, తాండూరు, పరిగికి సాగునీరు అందకుండా చేశారు. త్వరలో ఈ ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర సీఎంను కలిసి చర్చించి ఒప్పిస్తాం..’ అని రేవంత్ చెప్పారు.
మూసీ ప్రక్షాళన చేసి తీరతాం..
‘మూసీ మురికికూపంగా మారి విషం చిమ్ముతోంది. ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, భువనగిరి, ఆలేరు ప్రాంతాల్లో నీరు తాగితే పశువులే కాదు, మనుషుల ప్రాణాలు సైతం పోతున్నాయి. పుట్టబోయే బిడ్డలు కూడా అంగవైకల్యంతో పుడుతున్నారు. నల్లగొండ జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు ఎలాగైనా సరే మూసీని పునరుజ్జీవింపజేయాలని స్థానికులు కోరారు. వారికిచ్చిన మాట ప్రకారం మూసీ ప్రక్షాళన చేసి తీరతాం.
గోదావరి జలాల తరలింపు ద్వారా జంట నగరాల తాగునీటి సమస్యను పరిష్కరించడమే కాకుండా మూసీ కాలుష్యాన్ని నివారించడం ద్వారా ఆ సమస్య నుంచి నల్లగొండ జిల్లా ప్రజలకు విముక్తి కల్పిస్తాం. ఫ్యాక్టరీల కాలుష్యం మూసీలో కలవకుండా నియంత్రిస్తాం. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు నిర్వాసితులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుంది. హైదరాబాద్‌ను సుందర నగరంగా తీర్చిదిద్దుతాం..’ అని ముఖ్యమంత్రి అన్నారు.
డిసెంబర్ 9న విజన్ డాక్యుమెంట్ విడుదల
‘వందేళ్లకు సరిపడా ప్రణాళికతో డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్–2047 విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేసి తెలంగాణ సమాజానికి అంకితం ఇవ్వబోతున్నాం. గేట్ వే ఆఫ్ హైదరాబాద్ ప్రాజెక్టు కోసం ప్రణాళికలు సిద్ధం చేశాం.
రాబోయే పదేళ్లలో హైదరాబాద్‌ను అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దడమే కాకుండా లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. మహానగరాన్ని అభివృద్ధి చేయడంలో ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలి. ప్రభుత్వం తలపెట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో కలిసిరావాలి..’ అని సీఎం పిలుపునిచ్చారు.
నియో పొలిస్ ట్రంపెట్ ఇంటర్ చేంజ్ ప్రారంభం
కోకాపేట వద్ద నియో పొలిస్ ట్రంపెట్ ఇంటర్ చేంజ్‌ను సోమవారం సీఎం ప్రారంభించారు. అదేవిధంగా గండిపేట వద్ద హెదరాబాద్ జలమండలి ఆధ్వర్యంలో నిర్మించిన 16 రిజర్వాయర్లను కూడా ప్రారంభించారు. అనంతరం ప్రాజెక్టు ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు.
ఈ కార్యక్రమాల్లో మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్ వెంకటస్వామి, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు.