
సూర్యాపేట జిల్లా: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశానికి సంబంధించి స్పీకర్ సరైన నిర్ణయం తీసుకోకపోతే కోర్టుకు పోతామని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి హెచ్చరించారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయం అనేది ఎలా ఉంటుందో తమకు తెలుసన్నారు. ఒకవేళ ఆ నిర్ణయం సరిగా లేకపోతే దానికి సంబంధించిన అంశాన్ని కోర్టులోనే తేల్చుకుంటామన్నారు. కోర్టులో తమకు న్యాయం జరుగుతుందని, ఫిరాయింపు ఎమ్మెల్యేల తీరు హాస్యాస్పదంగా ఉంది. మేం పార్టీ మారలేదని నోటీసుకు సమాధానం ఇవ్వడమేంటి?, పార్టీ మారకపోతే సీఎం రేవంత్ వద్దకు తాజాగా ఎందుకు వెళ్లినట్లు? అని ప్రశ్నించారు.
కాగా, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారని, ఫిరాయింపు నిరోధక చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన కేసులో 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గత నెల 31న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
ఇదే అంశంపై తెలంగాణ స్పీకర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించారు. వారి వద్ద నుంచి వివరణ తీసుకున్నారు. స్పీకర్ పంపిన నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు.. యూ టర్న్ తీసుకున్నారు. తాము కాంగ్రెస్‌లో చేరలేదని బీఆర్‌ఎస్‌లోనే ఉన్నామని స్పష్టం చేశారు.