
సాక్షి,హైదరాబాద్: కొందరు ఏ పార్టీలో ఉన్నామో చెప్పుకోలేదని దుస్థితిలో ఉన్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గద్వాల్ ఎమ్మెల్యే బీఆర్‌ఎస్ మీటింగ్‌లకు ఎందుకు రావడం లేదు?.కాంగ్రెస్ కండువా వేసుకుని సిగ్గులేకుండా బీఆర్‌ఎస్‌లో ఉన్నానంటున్నాడు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వెంటనే వేటువేయాలి’అని డిమాండ్ చేశారు.
మరోవైపు తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం చర్చాంశనీయంగా మారింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల విషయంలో మూడు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ క్రమంలో గత వారం తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. వీరి భేటీలో ఏం చర్చించారనే అంశం గురించి తెలియాల్సి ఉంది.
‘ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్’ అంటే ఒప్పుకోం
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కేసు విచారణలో భాగంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.మూడు నెలల్లోగా ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ శాసనసభ స్పీకర్‌కు ఆదేశించింది. పదో షెడ్యూల్ ప్రకారం, స్పీకర్‌కు రాజ్యాంగ రక్షణ లేదని పేర్కొంది. తెలంగాణ హైకోర్టు తీర్పును కొట్టివేసింది. తద్వారా స్పీకర్ నిర్ణయం ఆలస్యం చేయడం సరికాదని స్పష్టం చేసింది. ‘ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్’ అనే పరిస్థితిని అంగీకరించలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అనర్హత పిటిషన్లను సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉంచడం సమంజసం కాదని పేర్కొంది.పార్టీ ఫిరాయింపులకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని సూచించింది.
ఫిరాయింపులు ఎమ్మెల్యేలు వీళ్లేనా?
2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌లో గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలు తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్‌లు ఉన్నారు.వీరిలో గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి ఏ పార్టీలో ఉన్నారనేది ప్రశ్నార్ధకంగా మారింది. తాను ఇప్పటికీ గద్వాల్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనని కృష్ణమోహన్‌రెడ్డి అంటుంటే.. కేటీఆర్ మాత్రం గద్వాల్ ఎమ్మెల్యే బీఆర్‌ఎస్‌నని చెప్పుకుని.. పార్టీ కార్యక్రమాలకు ఎందుకు గైర్హాజరవుతున్నారని ప్రశ్నిస్తున్నారు.