
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో కమీషన్ల కోసం మంత్రులు కొట్లాడుకుంటున్నారని ఆరోపించారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణలో అగ్రికల్చర్ పోయి.. గన్ కల్చర్ వచ్చింది. రాష్ట్రంలో కమీషన్ల పాలన నడుస్తోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణభవన్‌లో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ..‘రేవంత్ రెడ్డి పాలనలో అరాచకం నడుస్తోంది. కాంగ్రెస్ తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తోంది. రేవంత్ రెడ్డి రాష్ట్రంలో గన్ కల్చర్ తెచ్చారు. కమీషన్ల కోసం మంత్రులు కొట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ పాలనలో అధికారులు భయపడుతున్నారు. తెలంగాణలో అగ్రికల్చర్ పోయి.. గన్ కల్చర్ వచ్చింది. రాష్ట్రంలో కమీషన్ల పాలన నడుస్తోంది.
అసమర్థ, పనికిమాలిన చెత్త ముఖ్యమంత్రిని నాజీవితంలో చూడలేదు. రేవంత్ రెడ్డిని వదిలించుకుంటే తప్ప.. తెలంగాణకు పట్టిన శని పోదు. ముఖ్యమంత్రి అల్లుడు, మంత్రి కొడుకు పంచాయితీలో ఐఏఎస్ అధికారి రిజ్వీ బలి. 500కోట్ల టెండర్ల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్, మంత్రి జూపల్లి మధ్య పంచాయితీ వచ్చింది. మంచిరేవుల భూముల వ్యవహారంలో రేవంత్ తమ్ముడు, మంత్రి కొండా కుటుంబం మధ్య గొడవ. రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే.. కిషన్ రెడ్డి, బండి సంజయ్, అమిత్ షా ఎందుకు మాట్లాడటం లేదు?. రేవంత్.. శంకరాహిల్స్‌లో ఏం చేస్తున్నారో.. సర్వే నంబర్ 83లో ఏం చేయాబోతున్నారో మాకు అన్నీ తెలుసు.
ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య పంపకాల విషయంలో గొడవలతో తెలంగాణ పరువు పోయింది. తన మాట వినలేదని.. మంచి అధికారి మీద మంత్రి జూపల్లి కక్ష తీర్చుకుంటున్నాడు. ముమ్మాటకీ రాష్ట్రాన్ని దండుపాళ్యం ముఠానే నడుపుతుంది. దండుపాళ్యం ముఠాకి నాయకుడు రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ రాజ్యం కాదు.. మాఫియా రాజ్యాం నడుస్తుంది. ముఖ్యమంత్రి కుర్చీలో దావూద్ ఇబ్రహీం తమ్ముడు కూర్చున్నాడు. తన ఇంటి మీదకు ముఖ్యమంత్రే పోలీసులను పంపారని మంత్రి కుమార్తె చెప్పారు. తుపాకీ ఇచ్చింది రేవంత్.. పెట్టింది రోహిణ్ రెడ్డి అని మంత్రి కొండా కుమార్తె చెప్తుంది. మంత్రి కుమార్తె ఆరోపణలపై ఎందుకు విచారణ జరపటం లేదో డీజీపీ శివధర్ రెడ్డి చెప్పాలి.
మంత్రి ఉత్తమ్‌కు సంబంధం ఉందని మంత్రి కొండా సురేఖ కూతురు చేసిన ఆరోపణలపై మంత్రి ఉత్తమ్ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయాలి. పింక్ బుక్, రెడ్ బుక్ లేదు.. ఖాకీ బుక్ మాత్రమే ఉందని శివధర్ రెడ్డి అన్నారు. ఖాకీ బుక్ ఎక్కడో డీజీపీ చెప్పాలి. మంచి అధికారిగా శివధర్ రెడ్డికి పేరుంది. రోహిణ్ రెడ్డి, సుమంత్ ను లోపల వేసి తన నిజాయితీని డీజీపీ నిరూపించుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ ఇల్లా.. సెటిల్మెంట్‌కు అడ్డానా?. కేబినెట్ మీటింగ్‌లోనే మంత్రులు తిట్టుకుంటున్నారు. పొంగులేటి అరాచకాలకు ముఖ్యమంత్రి రేవంత్ ఎందుకు అడ్డుకట్ట వేయటం లేదు?. ముఖ్యమంత్రి, మంత్రుల పంచాయితీ మధ్య అధికారులు నలిగిపోతున్నారు.
ప్రభుత్వ పెద్దల అన్యాయాలకు అండగా నిలిచే అధికారులకు శిక్ష తప్పదు. రాష్ట్రంలో అవినీతి విలయతాండవం చేస్తుంది. ముఖ్యమంత్రి వేల కోట్లు సంపాదిస్తుంటే.. వందల కోట్లు అయినా సంపాదించుకోవాలని మంత్రులు చూస్తున్నారు. తెలంగాణ పరువును సీఎం, మంత్రులు నడిబజారులో నిలబెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు సిగ్గుతో తల దించుకునేలా పరిస్థితులు ఉన్నాయి. పారిశ్రామికవేత్తల తలకు తుపాకీలు పెట్టి బెదిరిస్తున్నారు. ఐఏఎస్ రిజ్వీ చాలా సిన్సియర్ అధికారి. ఆయన్ను బలిపశువును చేశారు. పదేళ్లు సర్వీస్ ఉండగానే వాలంటరీ రిటైర్మెంట్‌కు వెళ్ళే పరిస్థితి తెచ్చారు. జూబ్లీహిల్స్‌లో ఎవరు గెలుస్తారో.. నవంబర్14న మాట్లాడుకుందాం అని వ్యాఖ్యానించారు.