‘రావెలా.. చేతగాని మాటలొద్దు’

‘రావెలా.. చేతగాని మాటలొద్దు’


గుంటూరు: ‘రావెల కిషోర్‌బాబు.. తస్మాత్‌ జాగ్రత్త.. చేతగాని, ధైర్యంలేని మాటలొద్దు. దమ్ముంటే.. టైము.. ఎప్పుడు, ఎక్కడో చెప్పు... బహిరంగ చర్చకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు సిద్ధం’..అని వైఎస్‌ఆర్‌ సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున సవాల్‌ విసిరారు. ‘గుంటూరు నగరంలోని లాడ్జి సెంటర్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్దనైనా.. వెంకటేశ్వర విజ్ఞాన మందిరం సమీపంలో ఉన్న బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహం వద్దనైనా చర్చ పెట్టుకుందామా’ అని ప్రశ్నించారు.24 గంటల్లో మంత్రి రావెల చెబితే.. బహిరంగ చర్చకు తాను ఒక్కడినే వస్తానని తేల్చిచెప్పారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు వైఎస్సార్‌ సీపీ నేతలు చర్చకు రావాలని విసిరిన సవాల్‌పై మేరుగ ఘాటుగా స్పందించారు. గుంటూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. అధికారిగా పని చేసి రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ‘ఎన్ని రాజకీయ పార్టీల గడపలు తొక్కావో’.. అనే అంశంపై చర్చకు సిద్ధమేనా అని ప్రశ్నించారు. మంత్రి అయిన తరువాత పనితీరు.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడుగులకు మడుగులొత్తుతూ.. దళిత జాతి సంక్షేమాన్ని తాకట్టు పెడుతూ.. కళ్ళులేని కబోదిలా వ్యవహరిస్తున్న తీరుపై చర్చిద్దామా.. అని నిలదీశారు.రావెల కుమారుడు హైదరాబాద్‌లో మైనారిటీ మహిళ చేయి పట్టుకున్న విషయంలో గానీ.. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ జానీమూన్‌ కుటుంబాన్ని చంపుతానని బెదిరించిన విషయంలో గానీ.. అభివృద్ధి, సంక్షేమం అని చెబుతూ దళిత వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న అంశంలో గానీ తాము చర్చకు సిద్ధమే అన్నారు. రాజ్యాంగబద్ధంగా దళితులకు కోసం వెచ్చించాల్సిన సబ్‌ప్లాన్‌ నిధులకు సంబంధించిన పోర్ట్‌పోలియో మంత్రిగా ఉండి.. నిధులు దారి మళ్లించే జీవో జారీ విషయంలో చర్చించుకుందామా అని సవాల్‌ విసిరారు. దళిత, గిరిజనులకు సంబంధించి మంత్రిగా వ్యవహరిస్తూ.. ఏ ఒక్క మంచి పని కూడా చేయలేని అసమర్థత పైన, బాబు వస్తే జాబు ఖాయమని చెప్పి నేడు దళిత, గిరిజనులు చేతులు చాచి అడుగుతున్నా ఒక్క ఉద్యోగం కూడా ఇప్పించలేని చేతకానితనంపైన చర్చిద్దామన్నారు.ఇంతవరకు ట్రైబల్‌ ఎడ్వయిజరీ బోర్డు గురించి పట్టించుకోకుండా, నియోజకవర్గంలో దళితులు చనిపోతే పట్టించుకోకుండా, చంద్రబాబు అమ్ముల పొదిలో రామబాణాన్ని అని చెప్పుకొనే అవినీతి బాణాలను గురించి చర్చిద్దామా అని ప్రశ్నించారు. వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై కూస్తున్న కారు కూతలపైన చర్చిద్దామని సవాల్‌ విసిరారు. సమావేశంలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి, నేతలు కొలకలూరి కోటేశ్వరరావు, బండారు సాయిబాబు, అత్తోట జోసఫ్, శిఖా బెనర్జీ, దాసరి కిరణ్, కొరిటిపాటి ప్రేమ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Back to Top