విజేతలెవరో? | Win the by-elections | Sakshi
Sakshi News home page

విజేతలెవరో?

Aug 24 2013 2:15 AM | Updated on Aug 14 2018 2:50 PM

రాష్ట్రంలో రెండు లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో విజేతలెవరో శనివారం తేలనుంది. బెంగళూరు గ్రామీణ, మండ్య లోక్‌సభ స్థానాలకు బుధవారం పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే.

సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో రెండు లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో విజేతలెవరో శనివారం తేలనుంది. బెంగళూరు గ్రామీణ, మండ్య లోక్‌సభ స్థానాలకు బుధవారం పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. జేడీఎస్‌కు చెందిన మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ. కుమారస్వామి, మాజీ మంత్రి ఎన్. చలువరాయ స్వామి శాసన సభకు ఎన్నిక కావడంతో ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.

బెంగళూరు గ్రామీణ నియోజక వర్గంలో కుమారస్వామి సతీమణి అనిత, కాంగ్రెస్‌కు చెందిన మాజీ మంత్రి డీకే. శివకుమార్ తమ్ముడు సురేశ్‌ల మధ్య రసవత్తరమైన పోటీ నెలకొంది. శాసన సభ ఎన్నికల్లో ఇదే నియోజక వర్గం పరిధిలోని చన్నపట్టణ అసెంబ్లీ స్థానం నుంచి ఓడిపోయిన అనితా కుమారస్వామి తొలుత పోటీకి నిరాకరించినా, కుటుంబ సభ్యుల ఒత్తిడితో బరిలోకి దిగాల్సి వచ్చింది.

బీజేపీ ఇక్కడ బాహాటంగానే ఆమెకు ప్రచారం చేసింది. జేడీఎస్‌కు గట్టి పట్టు ఉన్న ఈ నియోజక వర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడం ద్వారా సత్తా చాటాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కృత నిశ్చయంతో ఉన్నప్పటికీ, పార్టీలోని అంతర్గత కలహాలు ఎక్కడ కొంప ముంచుతాయేమోననే ఆందోళన కూడా ఆయనలో లేకపోలేదు. దీనికి తోడు జేడీఎస్‌కు ప్రాబల్యమున్న అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓటింగ్ బాగా జరగడం, కాంగ్రెస్ ఆధిపత్య ప్రాంతాల్లో స్వల్పంగా ఉండడం పార్టీ నాయకులను కలవరానికి గురి చేస్తోంది.

మండ్య నియోజక వర్గంలో సినీ గ్లామర్ ద్వారా గట్టెక్కాలని కాంగ్రెస్ ప్రయత్నించినప్పటికీ, అభ్యర్థి రమ్య పెంపుడు తండ్రి నామినేషన్ దాఖలు రోజున మరణించడం పార్టీలో విషాదాన్ని నింపింది. ఒకానొక దశలో పోటీకి రమ్య విముఖత వ్యక్తం చేసినప్పటికీ, అప్పటికే పుణ్య కాలం పూర్తయినందున కాంగ్రెస్ నాయకులు ఆమెను బతిమాలుకోవాల్సి వచ్చింది.

ఎట్టకేలకు రంగంలో దిగినప్పటికీ చురుకుగా, ఉత్సాహంగా ప్రచారం చేయలేక పోయారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి, నటుడు అంబరీశ్ ప్రచార భారాన్ని నెత్తిన వేసుకున్నప్పటికీ, అక్కడ కూడా కాంగ్రెస్‌లోని గ్రూపులు పార్టీకి చెరుపు చేస్తాయేమోనని నాయకులు సందేహంతో ఉన్నారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చి మూడు నెలలే కావడం, ఈ స్వల్ప కాలంలోనే అనేక ప్రజాకర్షక పథకాలను ప్రవేశ పెట్టడంతో విజయం ఖాయమనే ధీమా పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నానికల్లా ఫలితాలు వెలువడుతాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement