
పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష ఫలితాల్లో ప్రతిభ చాటిన అభ్యర్థులు
తుది ఫలితాలను విడుదల చేసిన హోం మంత్రి అనిత
168 మార్కులతో గండి నానాజీకి మొదటి స్థానం
రెండు, మూడు స్థానాల్లో రమ్యమాధురి, అచ్యుతరావు
సాక్షి, అమరావతి/అచ్యుతాపురం/దత్తిరాజేరు: పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల నియామక పరీక్షల్లో విశాఖపట్నానికి చెందిన గండి నానాజీ 168 మార్కులతో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచారు. విజయనగరానికి చెందిన జి.రమ్యమాధురి 159 మార్కులతో రెండో స్థానంలో, రాజమహేంద్రవరానికి చెందిన మెరుగు అచ్యుతరావు 144.5 మార్కులతో మూడో స్థానంలో నిలిచారు. రాష్ట్రంలో 3,580 సివిల్ కానిస్టేబుల్, 2,520 ఏపీఎస్పీ కానిస్టేబుల్ మొత్తం.. 6,100 పోస్టుల భర్తీ కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి నియామక ప్రక్రియ చేపట్టింది.
అందులో భాగంగా ప్రిలిమినరీ, దేహదారుఢ్య, మెయిన్స్ పరీక్షల అనంతరం తుది ఫలితాలను పోలీసు నియామక మండలి శుక్రవారం ప్రకటించింది. మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో హోం మంత్రి వంగలపూడి అనిత తుది ఫలితాలు విడుదల చేశారు. మొత్తం 5.03 లక్షల మంది దరఖాస్తు చేయగా.. ప్రిలిమినరీ పరీక్షకు 4.59 లక్షల మంది హాజరయ్యారు. వారిలో 95,208 మంది దేహదారుఢ్య పరీక్షలకు అర్హత సాధించారు. వారిలో అర్హత సాధించిన 38,914 మందికి మెయిన్స్ పరీక్షలు నిర్వహించగా.. 33,921 మంది అర్హత సాధించారు.
రిజర్వేషన్ల వారీగా ఎంపికైన 6,100 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. 3,580 సివిల్ కానిస్టేబుల్ పోస్టుల్లో 1,063 మంది మహిళలున్నారు. కానిస్టేబుల్ పోస్టుల కోసం ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను పోలీసు నియామక మండలి వెబ్‌సైట్ www.slprb.ap. gov.in లో అందుబాటులో ఉంచారు. వివరాల కోసం అభ్యర్థులు 9441450639, 9100203323 నంబర్లను సంప్రదించాలని, లేదా slprb@ap.gov.in కు మెయిల్ చేయాలని అధికారులు సూచించింది.
ఇదిలా ఉండగా, పోలీస్ శాఖలో ఖాళీల భర్తీకి త్వరలో మరో నోటిఫికేషన్ విడుదల చేస్తామని హోం మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఎంపికైన కానిస్టేబుళ్లకు సెపె్టంబర్ నుంచి శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, పోలీస్ నియామక మండలి చైర్మన్ ఆర్‌కే మీనా, అదనపు డీజీ ఎన్.మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మేకల కాపరి కుమారుడికి స్టేట్ ఫస్ట్
మేకలు కాస్తూ తండ్రి అయ్యబాబు పడుతున్న కష్టాన్ని చూసి ఆ యువకుడు మధనపడేవాడు. ఏదో ఒకటి సాధించి తీరాలని తపన పడేవాడు. చివరికి అనుకున్నది సాధించాడు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కానిస్టేబుల్ ఫలితాల్లో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం దొప్పెర్ల గ్రామానికి చెందిన గండి నానాజీ రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. తల్లి జయమ్మ బంగారాన్ని తాకట్టు పెట్టి మరీ పరీక్షకు శిక్షణ ఇప్పించింది. భవిష్యత్తులో మరింత కష్టపడి ఉన్నతోద్యోగం సాధించి తీరతానని నానాజీ చెప్పాడు.
అదరగొట్టిన ‘ఆశా’ కుమార్తె
విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం గడసాం గ్రామానికి చెందిన గొర్లె రమ్యమాధురి 159 మార్కులతో రాష్ట్ర స్థాయిలో రెండో స్థానంలో నిలిచింది. రమ్యమాధురి తండ్రి రమణ తన చిన్నతనంలోనే మృతి చెందగా.. ఆశా కార్యకర్త అయిన తల్లి జయమ్మ, పూల దుకాణంలో పనిచేసే అన్నయ్య గౌరీశంకర్ ఆమెను చదివించారు. డిగ్రీ పూర్తయిన వెంటనే పోలీస్ కావాలన్న లక్ష్యంతో కాకినాడలోని ఓ కోచింగ్ సెంటర్‌లో శిక్షణ తీసుకున్నానని, అత్యధిక మార్కులతో లక్ష్యాన్ని సాధించినందుకు సంతోషంగా ఉన్నట్టు రమ్యమాధురి చెప్పింది.