తనపై వస్తున్న అవినీతి ఆరోపణలను నిరూపిస్తే ప్రాణాలు వదులుతానని మంత్రి అన్నారు.
ముంబై: తాను అవినీతికి పాల్పడినట్లు వస్తున్న ఆరోపణలను నిరూపిస్తే ప్రాణాలను వదులుతానని మహారాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి గిరీశ్ బాపత్ అన్నారు. మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్(ఎమ్ఎల్సీ) వేదికగా ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి ఆరోపణలను నిరూపిస్తే కేవలం రాజకీయ సన్యాసం ఒక్కటే కాదని.. అసలు ఈ భూమి మీద నుంచి తాను సెలవు తీసుకుంటానని అన్నారు. ఎమ్ఎల్సీ వేదికగా ప్రతిపక్ష లీడర్ ధనంజయ్ ముండే చేసిన ఆరోపణలకు ఆయన పై విధంగా స్పందించారు. ఎన్సీపీ ఇప్పటివరకు పలువురు మంత్రులపై అవినీతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పంకజా ముండే, ఎడ్యుకేషన్ మినిష్టర్ వినోద్ టవ్దేలపై ఎన్సీపీ ఆరోపణలు చేసింది. పౌర సరఫరాల శాఖలో పప్పుధాన్యాల ధరలను ఎక్కువ చేసి ప్రజలకు విక్రయించారని ఇందులో దాదాపు రూ.2,500-2,800 కోట్ల మేర అవినీతి జరిగిందని ధనంజయ ఆరోపించారు. తాను చేసిన ఆరోపణలు తప్పని తేలితే అదే శాఖ మంత్రి కింద సర్వెంట్ గా పనిచేస్తానని సవాలు విసిరారు. 15 ఏళ్ల పాటు బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆధారాలు ఆరోపణలు ఎన్నో కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం మీద చేసిందని అన్నారు. ప్రస్తుతం అధికార బీజేపీ తప్పు చేసిందని తన వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు.