పింప్రి-చించ్వాడ్, పుణేలలో జిల్లా అధికార యంత్రాంగం ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభమైంది.
పుణే: పింప్రి-చించ్వాడ్, పుణేలలో జిల్లా అధికార యంత్రాంగం ఓటరు నమో దు ప్రక్రియ ప్రారంభమైంది. పుణే, పింప్రి-చించ్వాడ్‌లతోపాటు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ కొత్త ఓటర్లను నమోదు చేయనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ ప్రక్రియలో ఓటర్లుగా నమోదైన వారు త్వరలో జరగనున్న శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో తమ ఓటుహక్కును వినియోగించుకోవచ్చు. దీంతోపాటు పాత ఓటర్లు కూడా ఇందులో పాల్గొని వయసు, చిరునామా మార్పిడి తదితర వివరాలను పొందుపరుచుకునేందుకు వీలు కల్పించారు.
ఈ నెల 17న ప్రారంభమై న ఓటర్ల నమోదు ప్రక్రియ వచ్చే నెల 17వ తేదీదాకా కొనసాగుతుందని సంబంధిత అధికారి ఒకరు తెలియజేశారు. పుణే నగర పరిధిలో మొత్తం 60 లక్షల ఓటర్లు ఉన్నారు. పుణే సిటీ, పింప్రి-చించ్వాడ్‌లతోపాటు జిల్లాలోని గ్రామీణ పరిధిలో కలిపి మొత్తం 21 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇం దులో 11 నియోజకవర్గాలు నగర పరిధిలోనే ఉన్నాయి. ఓటర్ల నమోదు ప్రక్రి య సందర్భంగా అందిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పరిశీలించి ఆ తర్వాత ఓటర్ల జాబితాకు జత చేస్తారు. వచ్చే ఏడాది జనవరి ఏడో తేదీన తుది జాబితాను ప్రకటిస్తారు.
సమీప కేంద్రంలో సంప్రదించండి
ఈ విషయమై సంబంధిత అధికారి ఒకరు మాట్లాడుతూ దరఖాసుల కోసం తమకు సమీపంలోని పోలింగ్ కేంద్రంలో సంప్రదించాలని తెలిపారు. ఇందుకోసం అన్ని నియోజకవర్గాల్లో కలిపి మొత్తం రెండు వేలమంది అధికారులను సంబంధిత యంత్రాంగం నియమించిందన్నారు. తమ తమ దరఖాస్తులను రిటర్నింగ్ అధికారి (ఆర్‌ఓ)కి సమర్పించాలన్నారు. ఆరో నంబర్ ఫాంను పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు.
దీంతోపాటు వయసు, నివాస ధ్రువీకరణ, గుర్తింపు కార్డు తదితర పత్రాలను జత చేయాల్సి ఉంటుందన్నారు. తప్పొప్పుల సవరణ కోసం ఎనిమిదో నంబర్ ఫాంను పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. జనవరి ఒకటో తేదీనాటికి దరఖాస్తుదారుల వయసు 18 సంవత్సరాలు నిండాలన్నారు.