ఉచిత వై ఫై
పట్టణంలో వైఫై సేవలను ప్రారంభించడానికి వసయి-విరార్ మున్సిపల్ కార్పొరేషన్ (వీవీఎంసీ) సన్నాహాలు చేస్తోంది.
ముంబై సెంట్రల్, న్యూస్‌లైన్: పట్టణంలో వైఫై సేవలను ప్రారంభించడానికి వసయి-విరార్ మున్సిపల్ కార్పొరేషన్ (వీవీఎంసీ) సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ప్రయోగాత్మకంగా పట్టణంలోని కొన్ని చోట్ల ‘వైఫై’ రూటర్లను ఏర్పాటు చేయనుంది. పట్టణవాసులకు ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం తొలిసారి. వైఫై కనెక్టివిటీ ద్వారా ప్రజలు తమ మొబైళ్లు, కంప్యూటర్లలో ఇంటర్నెట్‌ను వినియోగించుకోవచ్చు.
కార్పొరేషన్ ఈ సేవను ఉచితంగా ప్రారంభించనుంది. ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నామని, ఇందుకోసం ప్రణాళికను కూడా రూపొందించామని నాలాసొపారా ఎమ్మెల్యే కె. ఠాకూర్ పేర్కొన్నారు. అందువల్లనే ఈ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామన్నారు.‘వైర్‌లెస్ ఇంటర్‌నెట్’, ‘వైఫై’లను ‘వైర్‌లెస్ ఫిడిలిటీ’ అని కూడా పిలుస్తారు. ఇంటర్నెట్‌ను వినియోగించుకోవాలంటే రూటర్లు తప్పనిసరి. వీటిద్వారా వైఫై అనుసంధానమవుతుంది.
ఈ రూటర్లను ప్రధాన వీధులు, బహిరంగ ప్రాంతాలు, నివాసాల వద్ద ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ విభాగానికి చెందిన నిపుణుల బృందాన్ని నియమించనున్నారు. వైఫై సిగ్నల్ అందాలంటే అందుకు స్థిరమైన ఫ్రీక్వెన్సీ తప్పనిసరి. ఈ నేపథ్యంలో వీవీఎంసీ... 4జీ నెట్‌వర్క్‌ను వినియోగించనుంది. కాగా ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చేందుకు కొంత సమయం పట్టే అవకాశముంది.


