
రజనీ రాజకీయ ప్రవేశంపై జోరుగా ఉహాగానాలు
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లో వస్తారా? తమిళనాట మరోసారి ఈ విషయం తెరపైకి వచ్చింది.
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లో వస్తారా? తమిళనాట మరోసారి ఈ విషయం తెరపైకి వచ్చింది. ఎన్నికలు వచ్చినప్పుడల్లా రజనీ రాజకీయాల్లో వస్తారంటూ ప్రచారం జరుగుతోంది. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీ ఆయన ఇంటికి వెళ్లి కలిశారు. ఆ తర్వాత రజనీ బీజేపీలో చేరుతారంటూ ప్రచారం సాగింది. తాజాగా ఇదే విషయం చర్చనీయాంశమైంది.
జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ స్థానం నుంచి ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న గంగై అమరన్.. రజనీకాంత్‌తో సమావేశమయ్యారు. అమరన్ ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు సోదరుడు. రజనీతో అమరన్ కలవడంపై తమిళనాట సర్వత్రా చర్చ జరుగుతోంది. రజనీ త్వరలో బీజేపీలో చేరుతారని ఊహాగానాలు జోరందుకున్నాయి. గతంలో కూడా ఆయన సొంతంగా పార్టీ పెడతారని ప్రచారం జరిగింది. పలువురు ప్రముఖులు స్వయంగా కలసి, మరికొందరు బహిరంగం ఆయన్ను రాజకీయాల్లోకి ఆహ్వానించారు. అయితే వస్తానని కానీ రానని కాని ఆయన ప్రకటించలేదు. బీజేపీలోకి తమిళ సూపర్ స్టార్ చేరుతారా లేదా అన్నది కూడా ప్రస్తుతానికి సస్పెన్ష్.