విద్యార్థుల బంగారు భవిష్యత్తు రూపకల్పనలో తల్లిదండ్రులతోపాటు గురువుల పాత్ర కూడా కీలకమని భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు.
సాక్షి, బళ్లారి : విద్యార్థుల బంగారు భవిష్యత్తు రూపకల్పనలో తల్లిదండ్రులతోపాటు గురువుల పాత్ర కూడా కీలకమని భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు. ఆయన సోమవారం నగరంలోని నంది స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వార్షిక క్రీడా పోటీలను ప్రారంభించి మాట్లాడారు. హైస్కూల్ స్థాయి నుంచి క్రీడల పట్ల అవగాహన పెంపొందించుకోవాలన్నారు. చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. తన మాదిరిగా క్రికెట్‌లో ఎదగడం చాలా సులభమన్నారు.
ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీలో కూడా 100 మంది భారత క్రికెట్‌కు ఎంపిక అవుతారని సూచించారు. నంది స్కూల్ యజమాన్యం ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాల, కాలేజీ ఎంతో చక్కగా ఉందని కొనియాడారు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే ఉపాధ్యాయుల సలహాలు, సూచనలు అవసరమన్నారు. తాము చదువుకునే రోజుల్లో వసతులు చాలా తక్కువ ఉండేవని, అయితే నేడు ఎన్నో సౌకర్యాలున్నాయని విద్యార్థులు వాటిని ఉపయోగించుకుని ముందుకెళ్లాలన్నారు.
శాస్త్ర సాంకేతిక రంగం కూడా ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ప్రభుత్వాలు కూడా విద్యకు ఎంతో ప్రాధాన్యత కల్పిస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని మంచి పౌరులుగా ఎదిగి దేశానికి కీర్తి తీసుకుని రావాలని అభిలషించారు. అనంతరం నంది స్కూల్ విద్యార్థుల క్రీడలను ఆయన వీక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌పీ చేతన్‌సింగ్ రాథోడ్, నంది పాఠశాల చైర్మన్ ఉమేర్ అహ్మద్, ఏఎస్‌పీ సీకే బాబా తదితరులు పాల్గొన్నారు.