రజనీ భవిష్యత్తుపై కేరళ పండితుడి జోస్యం | Rajinikanth the future Chief minister of Tamil Nadu, Astrologers are so sure about it | Sakshi
Sakshi News home page

రజనీ భవిష్యత్తుపై కేరళ పండితుడి జోస్యం

May 18 2017 10:29 AM | Updated on Sep 17 2018 5:18 PM

రజనీ భవిష్యత్తుపై కేరళ పండితుడి జోస్యం - Sakshi

రజనీ భవిష్యత్తుపై కేరళ పండితుడి జోస్యం

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ రంగప్రవేశంతో పాటు ఆయన పొలిటికల్‌ ప్యూచర్‌పై ఎడతెగని చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే.

చెన్నై: సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ రంగప్రవేశంతో పాటు ఆయన పొలిటికల్‌ ప్యూచర్‌పై ఎడతెగని చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. రాజకీయాల్లోకి రావాలా వద్దా అనే అంశంపై సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఆయన అభిమానులను ఎన్నడూ నిరాశ పరచనని హామీ ఇచ్చారు. దీంతో రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తారనే వార్తలు విస్తృతంగా వైరల్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ ప్రవేశానికే అభిమానులతో రజనీకాంత్‌ సమావేశాలని రాష్ట్రంలోని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

తన ఆలోచనలకు అభిమానుల సలహాతో పదును పెట్టేందుకు సిద్ధమైన ఆయన రాజకీయ అరంగేట్రం ఇక ఎంతో దూరంలో లేదని అంటున్నారు. ఆ శుభదినం ఈ నెల 19వ తేదీ అయినా ఆశ్చర్యం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. రజనీకాంత్‌ రాజకీయాల్లోకి ప్రవేశిస్తే స్వాగతిస్తామని కాంగ్రెస్, డీఎంకే, బీజేపీ తదితర పార్టీలు అప్పుడే ప్రకటించేశాయి. కేరళలోని ఒక ప్రముఖ జోస్యుని వద్ద రజనీకాంత్‌ సన్నిహితుడు ఒకరు జాతకం చూపగా, రాజకీయాల్లో రజనీ రాణిస్తారు, ముఖ్యమంత్రి అవుతారని ఆయన జోస్యం చెప్పినట్లు సమాచారం.

కాగా రాష్ట్రంలోని అభిమానులను జిల్లాలవారీగా విభజించి వారితో సమావేశమయ్యే కార్యక్రమం ఈ నెల 15వ తేదీన రజనీకాంత్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే. రెండు రోజుల్లో కన్యాకుమారి, కరూరు, దిండుగల్లు, తిరునెల్వేలి, తూత్తుకూడి, తేని జిల్లాలకు చెందిన సుమారు 1500 మందికిపైగా అభిమానులను ఆయన కలుసుకుని, ఫొటోలు దిగారు. గుర్తింపు కార్డులు ఉన్న అభిమానులను మాత్రమే లోనికి అనుమతించి ఫొటోలు దిగనిస్తున్నారు. మూడో రోజు కార్యక్రమాల్లో భాగంగా నిన్న ఉదయం తొమ్మిది గంటలకు రాఘవేంద్ర కల్యాణ మండపానికి రజనీకాంత్‌ చేరుకున్నారు. గుర్తింపు కార్డుల్లేని అభిమానుల బైటనే ఉండిపోవడం గమనించి, కారు దిగారు. ఆయనను చూడగానే ‘రజనీకాంత్‌ వాళ్గ(రజనీకాంత్‌ వర్ధిల్లాలి), ‘తలైవర్‌ రజనీ వాళ్గ’ ( అధినేత వర్ధిల్లాలి) అంటూ నినాదాలు చేశారు.

రజనీకాంత్‌ అందరికీ అభివాదం చేస్తూ పలకరించి ఆ తరువాత లోనికి వెళ్లిపోయారు. తిరువణ్ణామలై, శివగంగై, విళుపురం జిల్లాలకు చెందిన అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వారందరికీ వరుస సంఖ్యలను కేటాయించి జిల్లాకు 250 మంది చొప్పున ఎంపిక చేసి ఫొటోకు అనుమతించారు. ఈ సందర్భంగా ఈ సమావేశానికి హాజరైన అభిమానులు రాజకీయాల్లోకి రావాలని ఆయనపై ఒత్తిడి చేశారు.

ఈ సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో రజనీ మాట్లాడుతూ అభిమానులతో సమావేశం కావడం, ఫొటోలు తీసుకోవడం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తోందని చెప్పారు. రాజకీయాల్లోకి రావడంపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని అన్నారు. నాలుగో రోజైన గురువారం (ఇవాళ) కడలూరు, తంజావూరు, పాండిచ్చేరి, కారైక్కాల్‌ జిల్లాలకు చెందిన అభిమానులు హాజరు కానున్నారు. ఈ నెల 19వ తేదీతో సమావేశాలు ముగుస్తుండగా, మిగిలిన జిల్లాల అభిమానుల కోసం రెండో దశ సమావేశాలు వచ్చేనెల నిర్వహిస్తారని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement