బస్సు రంధ్రం నుంచి పడి మృతి చెందిన ఆరేళ్ల చిన్నారి శ్రుతి కుటుంబానికి రూ. పది లక్షలు నష్ట పరిహారం చెల్లించే విధంగా సియాన్ స్కూల్
సాక్షి, చెన్నై: బస్సు రంధ్రం నుంచి పడి మృతి చెందిన ఆరేళ్ల చిన్నారి శ్రుతి కుటుంబానికి రూ. పది లక్షలు నష్ట పరిహారం చెల్లించే విధంగా సియాన్ స్కూల్ యాజమాన్యానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రెండు నెలల్లోపు ఈ మొత్తం చెల్లించాలని పేర్కొంది. 2012 జూలై 25వ తేదీ సాయంత్రం తాంబరం - ముడిచ్చూర్ మార్గంలో చో టు చేసుకున్న ఓ ఘటన రాష్ర్ట వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రైవేటు స్కూ లు బస్సుల్లో పిల్లలకు కల్పించిన భద్రత ఏ పాటిదో ఈ ఘటన స్పష్టం చేసింది. తాంబరం సమీపంలోని సియాన్ మెట్రిక్యులేషన్ స్కూల్‌కు చెందిన బస్సు ముడిచ్చూర్ మార్గంలో వెళ్తుండగా, ఆ బస్సు లో ఉన్న రంధ్రం ఓ ఆరేళ్ల చిన్నారి పాలి ట మృత్యువుగా మారింది.
ముడిచ్చూర్ ప్రాంతానికి చెందిన ముక్కు పచ్చలారని విద్యార్థిని శ్రుతి రోడ్డు మీదున్న జనం చూస్తుండగానే రంద్రం నుంచి కింద పడి చక్రాల కింద చిద్రం కావడం ఆగ్రహావేశాలకు దారి తీసింది. అంతే కాదు, కోర్టు ఆగ్రహంతో ప్రైవేటు స్కూలు బస్సుల కంటూ ప్రభుత్వం ప్రత్యేకంగా నిబంధనలు విధించే స్థాయికి ఈ ఘటన తీసుకెళ్లింది. నేటికీ ప్రతి ఏటా విద్యా సంవత్సరం ఆరంభంలో అన్ని బస్సుల్ని తనిఖీ చేయాల్సిందే. తనిఖీల అనంతరం ఇచ్చిన అనుమతితోనే ముందుకు సాగాల్సి ఉన్నది.
ఈ ఘటన ఎందరో పిల్లల భద్రతకు బాసటగా మారినా, ఆ చిన్నారి శృతి తల్లిదండ్రుల్ని నేటికీ ఓదార్చలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో తన బిడ్డ మృతికి సియాన్ స్కూల్ యాజమాన్యం కారణం అని శ్రుతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో ఆ యజమాని విజయన్ అరెస్టు అయ్యారు. కొన్నాళ్లకు ఆయన బయటకు వచ్చేశారు. తదుపరి శ్రుతి కుటుంబం గురించి ఆలోచించే వాళ్లెవ్వరు. తన బిడ్డ మృతికి కారణమైన సియాన్ యాజమాన్యంపై కోర్టులో సమరానికి ఆ కుటుంబం సిద్ధమైంది. నష్ట పరిహారం కోసం శ్రుతి తండ్రి సేతుమాధవన్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారణ మైలాపూర్‌లోని రాష్ట్ర వినియోగ దారుల ఫోరంలో సాగుతూ వచ్చింది.
వాదనలు ముగిశాయి. తుది తీర్పు, ఆదేశాల కోసం ఆ కుటుంబం ఎదురు చూసింది. ఆ మేరకు బుధవారం న్యాయమూర్తి జయరామన్, ఫోరం సభ్యురాలు భాగ్యవతిలతో కూడిన బెంచ్ శృతి కుటుంబానికి రూ. పది లక్షలు నష్ట పరిహారం చెల్లించాలని సియాన్ స్కూల్ యాజమాన్యాన్ని ఆదేశించారు. రెండు నెలల్లోపు ఈ మొత్తాన్ని చెల్లించాలని, లేని పక్షంలో వడ్డీ సహా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ విచారణను ముగించారు.