మెట్రో రైళ్లలో వాడే స్మార్ట్ కార్డును డీటీసీ బస్సులతోపాటు క్లస్టర్ బస్సుల్లో వాడే సదుపాయం ఢిల్లీవాసులకు త్వరలోనే లభించనుంది.
సాక్షి, న్యూఢిల్లీ: మెట్రో రైళ్లలో వాడే స్మార్ట్ కార్డును డీటీసీ బస్సులతోపాటు క్లస్టర్ బస్సుల్లో వాడే సదుపాయం ఢిల్లీవాసులకు త్వరలోనే లభించనుంది. ఢిల్లీ ప్రభుత్వం వద్ద చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రతిపాదనను లెప్టినెంట్ గవర్నర్ ఆమోదించి ఎన్నికల కమిషన్ అనుమతి కోసం పంపారు. మెట్రో స్మార్డ్ కార్డును బస్సులలో కూడా ప్రయాణికులు ఉపయోగించడానికి అనువుగా చేయడం కోసం బస్సులలో టికెట్ జారీ చేయడానికి ఉపయోగించే టెక్నాలజీలో మార్పులు చేయడమో లేక మెట్రో స్మార్ట్ కార్డును స్వీకరించేలా దానిని మార్పు చేయడమో చేస్తామని రవాణా విభాగం అధికారులు అంటున్నారు.
2011 డిసెంబర్లో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ దేశవ్యాప్త కార్డును విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఆ తరువాత ఢిల్లీ మెట్రో 2012లో మెట్రోతో పాటు మెట్రో ఫీడర్ బస్సులలో ఉపయోగించగల మోర్ ఢిల్లీ కార్డును విడుదల చేసింది. డీటీసీ బస్సులలో కూడా స్మార్ట్ కార్డు ఉపయోగించగల సదుపాయాన్ని కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఈ ప్రతిపాదన పెండింగులోనే ఉండిపోయింది. అయితే ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినందువల్ల రవాణా విభాగం అధికారులతో చర్చించి స్మార్ట్ కార్డును బస్సులలో కూడా ఉపయోగించే సదుపాయాన్ని ప్రయాణికులకు కల్పిస్తామని మెట్రో అధికారులు అంటున్నారు.