మీకు చేరాల్సిన లేఖ దశాబ్ద కాలం లేటు!

Odisha Postman Laziness - Sakshi

పంచకుండా పోగుబడిన 6000 ఉత్తరాలు!

పదేళ్ళుగా ఉత్తరాలు బట్వాడా చేయని పోస్ట్‌మాన్‌

మీకు రావాల్సిన పాస్‌పోర్టు కోసం ఎదురుచూస్తున్నారా? మీకు రావాల్సిన బ్యాంకు పాస్‌పుస్తకం ఏదైనా మిస్సయ్యిందా? లేదా మీరెదురుచూస్తోన్న ఏటీఎం కార్డు మీకింకా చేరలేదా? మీ స్నేహితుడి సమాధానం కోసం వేచిఉన్నారా? ఏం ఫరవాలేదు. కాస్త ఆలస్యంగా అయినా మీకు చేరుతుంది. కాకపోతే ఓ దశాబ్ద కాలం లేటవుతుందంతే. కాకపోతే మీకు రావాల్సిన కాల్‌లెటర్‌ కూడా ఓ దశాబ్దకాలం లేటవుతుందంతే! ఒరిస్సాలోని ఒధాంగా గ్రామంలో జగన్నాథ్‌ పూహాన్‌ అనే ఓ పోస్ట్‌మాన్‌ ఇలాగే సర్దిచెప్పుకొని తను ఇవ్వాల్సిన ఉత్తరాలన్నింటినీ పోస్టాఫీసులోనే పోగేసాడు. ఉత్తరాలూ, ఏటీఎం కార్డులూ, పాస్‌పోర్టులూ, రకరకాల పోస్టల్‌ ప్యాకెట్లూ ఇలా ఒకటేమిటి మొత్తం 6000 ఉత్తరాలను పంచకుండా తన ఆఫీసులోనే ఉంచేసుకున్నాడు. పంచకుండా పేరుకుపోయిన పాత తపాలా భాండాగారం పోస్ట్‌ఆఫీసు కార్యాలయం మార్పుతో బట్టబయలైంది.

ఒరిస్సాలోని సదురు పోస్టాఫీసుని వేరే బిల్డింగ్‌లోకి మార్చడంతో అక్కడ కుప్పలుకుప్పలుగా పేరుకుపోయిన విలువైన సమాచారాన్నందించే ఉత్తరాలతో స్థానికుల పిల్లలు ఆటలు ఆడుకోవడాన్ని పెద్దలు గమనించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అసలేంజరిగిందని ఆరాతీస్తే ఆ ప్రాంతంలోని సదరు పోస్ట్‌మాన్‌ గత దశాబ్దకాలంగా ఉత్తరాలను బట్వాడా చేయడం లేదని తేలిపోయింది? అయితే ట్రాకింగ్‌కి అవకాశమున్న స్పీడ్‌ పోస్టలూ, రిజిస్టర్‌ పోస్ట్‌ ఉత్తరాలను మాత్రం సమయానికి అందించేసి, మిగిలిన వాటిని ఓ మూలన పడేసేవాడు అసిస్టెంట్‌ పోస్ట్‌మాస్టర్‌ అయిన జగన్నాథ్‌ పూహాన్‌. ఇదే విషయమై పోస్ట్‌మాన్‌ని నిలదీస్తే తన దీనావస్థని చెప్పుకొచ్చాడు. ఆ ప్రాంతమంతటికీ తానొక్కడ్నే పోస్ట్‌మాన్‌ననీ, జీవితకాలమంతా ఇల్లిల్లూ తిరిగి ఉత్తరాలు పంచే తనకు గత పదేళ్ళుగా కాళ్ళు పనిచేయడం లేదనీ తన దీనావస్థని చెప్పుకొచ్చాడు. అయినా చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పలేదు, చివరకు సస్పెండ్‌ అయ్యాడు. పాపం దశాబ్దకాలం తర్వాత కూడా ఆ ఉత్తరాలను పోస్టల్‌ శాఖ పంచేకార్యక్రమం ఏర్పాటు చేసింది. పాడై చిరిగిపోయినవి పోగా, శిథిలావస్థలో ఉన్నవి తీసేసి మిగిలిన వాటిల్లో దాదాపు 1500 ఉత్తరాలను పంపిణీచేసింది. అందులో 2011లో ఇండియన్‌ నావీ స్థానిక యువకుడికి పంపిన ఎంప్లాయ్‌మెంట్‌ లెటర్‌ కూడా ఉంది. స్థానికులెవ్వరూ కూడా తమకు రావాల్సిన ఉత్తరాలు ఎందుకు రావడం లేదని ఆరా తీయకపోవడమేంటా అని పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ జుట్టుపీక్కుంటోంది.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top