కుయ్‌.. కుయ్‌ నై..నై

not working 108 vehicles - Sakshi

సాక్షి ప్రతినిధి, ఖమ్మం:  అత్యవసర వైద్య సేవలు అందించి.. ప్రాణాలను నిలపాల్సిన 108, 104 వాహనాలు మూడు రోజులుగా మూలనపడ్డాయి. ఫోన్‌కాల్‌ రాగానే కుయ్‌.. కుయ్‌మంటూ సైరన్‌ ద్వారా ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందించేలా సంకేతాలు ఇస్తూ ప్రభుత్వ ఆస్పత్రులకు రయ్‌.. రయ్‌మని తిరిగే వాహనాలపై పట్టింపు కరువై.. డీజిల్‌ లేక ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. పేదవారి నేస్తంగా భావించే ఈ వాహనాలకు మూడు రోజులుగా డీజిల్‌ పోయలేని దుస్థితి నెలకొంది. అత్యవసర సేవలకు చిరునామాగా నిలిచిన 108 వాహనాలు ఖమ్మం జిల్లాలో 14 ఉండగా.. దాదాపు 12 బండ్లు డీజిల్‌ లేక ఆయా ప్రాంతాల్లో ఆగిపోయాయి. 104 వాహనాలకు 10 రోజులుగా డీజిల్‌ లేకపోవడంతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలోనే నిలిపివేశారు. దీంతో ఆ వాహనాల్లో పనిచేసే సిబ్బంది, డ్రైవర్లు డీజిల్‌ ఎప్పుడు వస్తుందో..? తెలియక అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.  

మూడు రోజులుగా 108 కదలట్లే.. 
అత్యవసర వైద్య సేవలు అందించే 108 వాహనాలను జిల్లాలో ప్రతి రెండు మండలాలకు ఒకటి చొప్పున కేటాయించారు. రోగి ఆరోగ్య పరిస్థితి క్షీణించినప్పుడు, అత్యవసర వైద్య సేవలు అవసరమైనప్పుడు ఉపయోగపడేలా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖరరెడ్డి 108, 104 వాహనాలను ప్రభుత్వ ఆస్పత్రులకు అనుసంధానం చేస్తూ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏర్పాటు చేశారు. వేలాది మంది ప్రాణాలను కాపాడి.. సామాన్య ప్రజలకు ఎనలేని సేవలు అందించాయి. ప్రస్తుతం ఆ వాహనాలపై పర్యవేక్షణ లేకపోవడం, మరమ్మతులపై అధికారులు దృష్టి సారించకపోవడం.. చివరకు కనీసం డీజిల్‌ కూడా పోయని దైన్యం నెలకొనడంతో అసలు సేవలకే ఎసరొచ్చింది. మూడు రోజులుగా 108 వాహనం రోగులకు సేవలు అందించట్లేదని, సైరన్‌ మోతలు ఆగిపోయాయని ప్రభుత్వ ఆస్పత్రికి అత్యవసర సేవలకు వచ్చిన రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేలకొండపల్లి, కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మంరూరల్, ఖమ్మంఅర్బన్, కామేపల్లి, బోనకల్, కల్లూరు, సత్తుపల్లి, ఏన్కూరు, తల్లాడ, కొణిజర్లలో ఈ వాహనాలు ఉన్నాయి. రోజుకు 150 నుంచి 200 కిలోమీటర్లు వరకు 108 వాహనాలు సేవలు అందించే అవకాశం ఉందని అంచనా. రెండు రోజులకోసారి రూ.2వేల డీజిల్‌ను ఆ వాహనానికి కొట్టిస్తారు. ఖమ్మంలోని పెట్రోల్‌ బంక్‌లో బిల్లు బకాయి రూ.3లక్షలు పేరుకుపోవడంతో.. డబ్బులు కట్టాల్సిందేనని బంక్‌ యాజమాన్యం ఇంధనం పోయట్లేదు. 108 వాహనాల పర్యవేక్షణ బాధ్యతను చూసే ఏజెన్సీ.. రెండు రోజుల్లో నగదు చెల్లిస్తామని నచ్చజెప్పినా ఫలితం కరువైంది. ఒక్క మధిరలో ఉన్న వాహనం మాత్రమే అక్కడి పెట్రోల్‌ బంక్‌ యాజమాన్యం అప్పు ఇవ్వడానికి అంగీకరించడంతో నిరాటంకంగా నడుస్తోంది.  

అంతా అయోమయం.. 
108 వాహనాల్లో పనిచేసే సిబ్బందికి వేతనాలు సైతం నెలలో ఏ రోజు వస్తాయో..? వాటి కోసం ఎన్ని రోజులు నిరీక్షించాలో..? తెలియని దుస్థితి నెలకొంది. ఇటు ప్రజలకు వైద్య సేవలు అందించలేక.. తమకు సకాలంలో వేతనాలు అందక తీవ్ర ఇబ్బంది పడుతున్నామని ఉద్యోగులు చెబుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు గ్రామీణ ప్రాంతాల నుంచి అత్యవసర సేవల కోసం వచ్చే రోగుల సంఖ్య మూడు రోజులుగా తగ్గినా.. వైద్యాధికారులు సైతం 108 వాహనాలు ఎందుకు రోడ్డెక్కడం లేదనే విషయాన్ని పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. 104 వాహనాలు నిర్ణీత ప్రదేశాలకు వెళ్లి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వివిధ వ్యాధులకు సంబంధించి సేవలు అందిస్తాయి. వాటికి సైతం డీజిల్‌ లేకపోవడం.. బడ్జెట్‌ రాలేదన్న సాకుతో వాహనాలన్నింటినీ జిల్లా కేంద్రంలోనే నిలిపివేయడంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు కరువయ్యే పరిస్థితి నెలకొంది. కాగా.. 108 వాహనాలు నిలిచిపోవడంపై వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌ వాకాటి కరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై జిల్లా ఆరోగ్య శాఖ అధికారుల నుంచి ఆరా తీశారు. 104 వాహనాలకు డీజిల్‌ విషయమై ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఇక్కడి అధికారులకు సూచించారు. 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top