కుందులి ఘటనపై ఉలికిపాటు | NHRC orders probe into Kunduli gang rape case | Sakshi
Sakshi News home page

కుందులి ఘటనపై ఉలికిపాటు

Feb 1 2018 12:49 PM | Updated on Nov 6 2018 7:53 PM

NHRC orders probe into Kunduli gang rape case - Sakshi

భువనేశ్వర్‌: కొరాపుట్‌ జిల్లా కుందులి గ్రామంలో గ్యాంగ్‌రేప్‌కు గురై ఆత్మహత్యకు పాల్పడిన బాలిక సంఘటనపై  జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ప్రత్యక్షంగా రంగంలోకి దిగినట్లు ప్రకటించిన విషయం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓ కుదుపు కుదుపుతోంది. దీంతో మేలుకున్న ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఈ సంఘటనపై విచారణ జరుపుతున్న న్యాయ కమిషన్‌ పరిధిని విస్తరించాలని ఆదేశించారు.  బుధవారం ఈ మేరకు  ఆయన ఉత్తర్వుల్ని జారీ చేశారు.  లోగడ సామూహిక అత్యాచారంపట్ల న్యాయకమిషన్‌ విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. తాజాగా ఆమె ఆత్మ హత్యకు పాల్పడడం రాష్ట్రంలో తీవ్ర కలకలం రేకెత్తించింది. ఈ నేపథ్యంలో   బాలిక ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితుల్ని ఆరా తీసే రీతిలో విచారణ జరపాలని న్యాయ కమిషన్‌ విచారణ పరిధి విస్తరణకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. జిల్లా జడ్జి హోదా కలిగిన అధికారి న్యాయ విచారణ నిర్వహిస్తారు. కమిషన్‌ ఆఫ్‌ ఇంక్వైరీ చట్టం–1952 పరిధిలో ఈ విచారణ కొనసాగుతుంది. కొరాపుట్‌ పోలీసులు నిర్వహిస్తున్న విచారణ బాధ్యతల్ని రాష్ట్ర క్రైం శాఖ చేపడుతుంది. స్థానిక పోలీసుల్ని విచారణ నుంచి తప్పిస్తారు.

ఫోరెన్సిక్‌ వివాదమే కారణమా!
కుందులిలో బాలికపట్ల సామూహిక అత్యాచారం సంఘటనపై వైజ్ఞానిక పరీక్షలు నిర్వహించిన రాష్ట్ర ఫోరెన్సిక్‌ ల్యాబొరేటరీ జారీ చేసిన నివేదిక వివాదాస్పదంగా మారింది. ఈ సంస్థ రూపొందించిన ప్రాథమిక, తుది నివేదికల్లో పొంతన లేకుండా పోయింది. ప్రాథమిక నివేదికలో అత్యాచారానికి గురైన బాలిక లోదుస్తులపై వీర్యపు మరకల్ని గుర్తించారు. ఈ మరకలు ఇద్దరు వేర్వేరు వ్యక్తులకు చెందినవిగా కూడా ధ్రువీకరించారు. తుది నివేదిక రూప కల్పనలో ఇటువంటి ఛాయలపట్ల ప్రస్తావన లేకపోవడంతో వివాదానికి బీజం పడింది. ప్రాథమిక నివేదికలో   బాలికపట్ల సామూహిక అత్యాచారం సంకేతాలు స్పష్టం కాగా తుది నివేదికలో ఇటువంటిదేమీ లేనట్లు సూచించడం చర్చనీయాంశంగా మారింది. ఇంతలో   బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ వైపరీత్యాన్ని ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి న్యాయ కమిషన్‌ విచారణ పరిధిని విస్తరించి బాలిక ఆత్మహత్య ఉదంతాన్ని జోడించి విచారణ కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 22వ తేదీన బాలిక ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. 

కేంద్ర ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు డీజీపీ సిఫారసు
కుందులి బాలిక సామూహిక అత్యాచారం సంఘటనపై రాష్ట్ర ఫోరెన్‌సిక్‌ ల్యాబొరేటరీ నివేదిక వివాదాస్పదం అయింది. ఈ పరిస్థితుల్లో వివాదం తొలగించేందుకు ఈ నివేదికతో పాటు సామూహిక అత్యాచారం ప్రాథమిక సాక్ష్యాధారాల్ని కేంద్ర ఫోరెన్సిక్‌ ల్యాబొరేటరీ(సీఎఫ్‌ఎస్‌ఎల్‌)కి సిఫారసు చేసినట్లు రాష్ట్ర డీజీపీ డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ శర్మ బుధవారం తెలిపారు. రాష్ట్ర ఫోరెన్సిక్‌ ల్యాబొరేటరీ నివేదికలో తారతమ్యాలపట్ల నిగ్గు తేల్చేందుకు డీజీపీ లోగడ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ వివాదాన్ని తొలగించేందుకు ఉన్నత స్థాయి పరీక్షల కోసం కోల్‌కత్తాలో పనిచేస్తున్న కేంద్ర ఫోరెన్సిక్‌ ల్యాబొరేటరీకి సిఫారసు చేసినట్లు సీఐడీ పోలీసు సూపరింటెండెంట్‌ వివరించారు. బాధిత బాలిక నమూనాల్ని కేంద్ర ఫోరెన్సిక్‌  ల్యాబొరేటరీకి పంపేందుకు స్థానిక న్యాయస్థానం ముందస్తు అనుమతి పొందినట్లు డీజీపీ స్పష్టం చేశారు.

ప్రాథమిక నివేదిక లీకేజీయే వివాదాలకు ప్రేరణ
అత్యంత గోప్యంగా పదిల పరచాల్సిన రాష్ట్ర ఫోరెన్సిక్‌ ల్యాబొరేటరీ నివేదిక బట్టబయలైంది. పరీక్షలు నిర్వహించే బాధ్యతాయుతమైన నిపుణుల అధీనంలోనే ఈ నివేదిక వివరాలు ఉంటాయి. ఈ పరిస్థితుల్లో ప్రాథమిక నివేదిక బహిరంగం కావడంతో ఆ విభాగం అవాక్కయింది. ఈ దిశలో విచారణ జరుగుతోంది. బాధ్యుల్ని గుర్తించిన మేరకు తగినస్థాయిలో చర్యలు చేపడతామని రాష్ట్ర ఫోరెన్సిక్‌ ల్యాబొరేటరీ డైరెక్టర్‌ లోగడ ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement