వైట్‌ ‘మనీప్లాన్’ | new-strategy-to-corporate-houses over change old currency | Sakshi
Sakshi News home page

వైట్‌ ‘మనీప్లాన్’

Nov 21 2016 4:38 PM | Updated on Apr 3 2019 5:16 PM

పండ్ల వ్యాపారి.. కూరగాయల విక్రేత.. వ్యవసాయ కూలీ, ఆటో వాలా.. ఇలా రోజు వారీ వ్యాపారాలు, పనులతో జీవనం సాగించే వారిపై పెద్ద నోట్ల రద్దు ఫెను ప్రభావం చూపుతోంది.

ముందస్తుగా వేతనాలు చెల్లిస్తున్న పెద్ద సంస్థలు 
పలువురు ఉద్యోగుల ఖాతాల్లో జీతాల జమ 
 
 
నర్సంపేట: పండ్ల వ్యాపారి.. కూరగాయల విక్రేత.. వ్యవసాయ కూలీ,  ఆటో వాలా.. ఇలా రోజు వారీ వ్యాపారాలు, పనులతో జీవనం సాగించే వారిపై పెద్ద నోట్ల రద్దు ఫెను ప్రభావం చూపుతోంది. రూ. 500, 1000నోట్ల రద్దుతో మార్కెట్లకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. కాగా గిరాకీ లేక చిరు వ్యాపారులు ఇలా విలవిలలాడుతుంటే భారీగా నల్లధనం ఉన్న బడా వ్యాపారులు, కొందరు విద్యాసంస్థలు, కొన్ని ఆస్పత్రుల యాజమాన్యాలు తమ వద్ద ఉన్న నల్లధనం వదిలించుకునేందుకు రకరకాల ఎత్తులు వేస్తున్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని పలు విద్యాసంస్థలు, ఆస్పత్రులు, వస్త్ర, ఇతర దుకాణ యాజమానులు తమ వద్ద పనిచేసే ఉద్యోగులకు రెండేళ్ల వేతనాలు ముందుగానే వారికి ఇచ్చేస్తున్నారని సమాచారం.
 
రూరల్‌ జిల్లాలో ప్రముఖ ఇంజనీరింగ్‌ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, ఇతర పాఠశాలల యజమాన్యాలు తమ సంస్థల్లో పని చేసే నమ్మకస్తులు ఉండటంతో వారి వారి ఖాతాల్లో నల్ల ధనాన్ని జమ చేస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఓ ఇంజినీరింగ్‌ కళాశాల గతంలో చెక్‌ల రూపంలో జీతాలు చెల్లించగా పెద్ద నోట్ల రద్దుతో నగదు రూపంలో జీతాలు ఇవ్వడంతో చర్చనీయంగా మారింది. రూ. 2.50లక్షల లోపు ఖాతాలో పడినా ఆదాయపు పన్ను సమస్య ఉండకపోవడంతో ఖాతాల్లో డిపాజిట్‌ చేసుకోవాలని సూచిస్తూ గడువు డిసెంబర్‌ చివరి వరకు ఉండటంతో మిగతా సంస్థల యాజమాన్యాలు వారి వారి సంస్థల్లో పని చేసే నమ్మకస్తుల ఖాతాల్లో నల్లధనాన్ని జమ చేసేందుకు బుజ్జగింపులు ప్రారంభించి నట్లు సమాచారం.
 
ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులు, ప్రైవేట్‌ విద్యాసంస్థల్లోని ఉపాధ్యాయులకు ఇంతకన్నా ఎక్కువ మొత్తం వారి దగ్గర ఉండటంతో ఏదో రకంగా మీరే సర్దుకోవాలని వారిని బుజ్జగిస్తూ పెద్ద నోట్లు ఇస్తున్నారు. భారీ మొత్తం ఒకేసారి వస్తుండటం. తమ తమ కుటుంబ సభ్యులు, బంధువుల పేర్ల మీద ఖాతాల్లో జమ చేసుకునే అవకాశం ఉండటంతో వారు వీటిని స్వీకరిస్తున్నారు. ఆయా యాజమాన్యాలకు అందులో పనిచేసే వీరికి ఎలాగూ అవగాహన ఉంటుంది. కనుక ఎలాంటి సమస్య రాదనే ఉద్దేశం వారిది. కొంతలో కొంతైనా తమ నల్లధనం తెల్లధనంగా మారుతుంది కదా అ ని యాజమాన్యాలు భావిస్తున్నాయి. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో ఈ విషయం ఇప్పటికే చర్చనీయంశంగా మారింది. ఎవరి ఎత్తు గడల్లో వారున్నారు.
 
చిన్నోళ్లకు పెద్ద కష్టాలు...
పెద్ద నోట్ల రద్దుతో భవన నిర్మాణం, ఇతర పనులకు వెళ్లే వ్యవసాయ కూలీల పరిస్థితి దారుణంగా ఉంది. గతంలో భార్యాభర్తలు కలిసి ఒకే పనికి వెళ్తే రూ.700 వరకు వచ్చేవి.రూ.500, వందనోట్లు రెండు ఇచ్చే వారు. పెద్ద నోట్ల రద్దుతో ఈ పనులకు పిలిచే వారే కరువయ్యారు. దీంతో మహిళలు పనులకు వెళ్లలేక ఇంటి వద్దనే ఉండడంతో మగవారు ఏదో ఒక పని చూసుకొని వెళ్తున్నారు. పనులకు వెళ్లినప్పటికీ కూలీ డబ్బులు కొద్ది రోజుల తర్వాత ఇస్తామని యాజమానులు చెప్పడంతో కూలీల పరిస్థితి దయనీయంగా మారింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement