
బ్లాక్‌ను వదిలించుకుంటున్నారు
నల్లకుబేరులు బ్లాక్ మనీని వదిలించుకోవడానికి దారులు వెతుకుతున్నారు.
కార్పొరేట్ సంస్థల సరికొత్త వ్యూహం
ఏడాది జీతం ఒకేసారి పెద్ద నోట్ల మార్పు బాధ్యత
ఉద్యోగులదే అదే బాటలో టీటీడీ కాంట్రాక్ట్ సంస్థలు
తిరుపతి (అలిపిరి): నల్లకుబేరులు బ్లాక్ మనీని వదిలించుకోవడానికి దారులు వెతుకుతున్నారు. కార్పొరేట్ సెక్టార్‌లో కోట్లకు పడగతెత్తిన అపర కుబేరులు బీరువాల్లో దాచిన నల్లధనాన్ని క్షణాల్లో వైట్‌గా మారుస్తున్నారు. తమ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఏడాది జీతం ఒకేసారి చెల్లిస్తున్నారు. కార్పొరేట్ సంస్థలకు ఏమాత్రం తీసిపోమంటూ టీటీడీ కాంట్రాక్ట్ సంస్థలు కూడా అదేబాట ఎంచుకున్నారుు. వారి వద్దనున్న బ్లాక్ మనీని తాత్కాలిక ఉద్యోగులకు వేతనాల రూపంలో పెద్ద నోట్లు ఇచ్చి వదిలించుకుంటున్నారు. జిల్లాలోని ఆస్పత్రులు, విద్యా సంస్థల్లో ఈ తంతు ఎక్కవగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఒక్క తిరుపతి నగరంలోనే గుర్తింపు పొందిన 100 ఆస్పత్రులు ఉన్నారుు. ఖరీదైన ఆస్పత్రులు 25కుపైగా ఉన్నారుు. జిల్లా వ్యాప్తం గా తీసుకుంటే వీటి సంఖ్య 200 దాటుతుంది. జిల్లాలో కార్పొరేట్ విద్యాసంస్థలు లెక్కలేనన్ని ఉన్నారుు. వీరి వద్దనున్న బ్లాక్ మనీని వదిలించుకునే క్రమంలో తమ సంస్థలోని సిబ్బందికే జీతాల రూపంలో అంటగడుతున్నారు.
టీటీడీలోనూ..
టీటీడీ కాంట్రాక్టర్లు కూడా కార్పొరేట్ సంస్థలకు తీసిపోని విధంగా వారి వద్ద పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులకు నెలజీతాల కింద పెద్ద నోట్లను పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు నెల జీతం వారి బ్యాంకు ఖాతాల్లోకి వచ్చి చేరుతుంది. కాంట్రాక్టర్లు వారి వద్దనున్న నల్లధనాన్ని వదిలించుకునేందుకు నేరుగా నగదును పంపిణీ చేసి చేతులు దులుపుకుంటున్నారు.
ఉద్యోగుల అవస్థలు..
ఏడాది జీతం ఒకేసారి అందుకున్న కా ర్పొరేట్ ఉద్యోగులకు ఏమిచేయాలో పాలుపోవడం లేదు. బ్యాంకుల్లో డిపాజిట్, విత్‌డ్రా సేవల్లో ఆర్బీఐ పరిమితిని విధించింది. దీంతో ఉద్యోగులు అధిక మొత్తంలో డిపాజిట్లు చేస్తే లేనిపోని తలనొప్పొలు తెచ్చుకున్నట్లు అవుతుంది. నెల జీతం కోసం ఎదురు చూసే ఉద్యోగులకు ఏడాది జీతం ఒకేసారి వచ్చినందుకు ఆనందపడాలో.. బాధపడాలో అర్థంగాక తలలు పట్టుకుంటున్నారు.
నిద్రావస్థలో నిఘా..
నల్లకుబేరుల వ్యూహాలను చిత్తు చేయాల్సిన నిఘా విభాగం నిద్దరోతోంది. ఇప్పటికే బడాబాబులు సామాన్య ప్రజలు, బంగారు దుకాణాలను వదల్లేదు. ఇక వారి సొంత సంస్థల్లో పనిచేసే వారికి కూడా జీతాల రూపంలో బ్లాక్ మనినీ అంటగడుతున్నారు. ఈ తంతు జిల్లాలో గుట్టుగా నడుస్తోంది. అధికారులు నిఘా వేస్తే ఆ మొత్తాలు ప్రభుత్వానికి చేరుతుంది.
బ్యాంక్ మేనేజర్‌కు తీవ్ర అస్వస్థత
మదనపల్లె టౌన్: పని ఒత్తిడితో బ్యాంకు మేనేజర్ తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన మదనపల్లెలో శనివారం చోటు చేసుకుంది. పట్టణంలోని సీటీఎం ఐసీఐసీఐ బ్యాంకు క్లస్టర్ మేనేజర్‌గా జనార్దన్ (50) పనిచేస్తున్నారు. పెద్ద నోట్లు రద్దు చేసిన నాటి నుంచి విధి నిర్వహణలో జనార్దన్‌పై పని ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సహచర సిబ్బంది ఆయన్ను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో బెంగళూరు తీసుకెళ్లారు.