వాహనదారులకు శుభవార్త

Modifications of motor vehicle law Orissa - Sakshi

మోటారు వాహన చట్టం సవరణ

వాహనాల కొనుగోలుకు ప్రోత్సాహం

రాష్ట్ర క్యాబినెట్‌లో నిర్ణయం

భువనేశ్వర్‌: వాహన కొనుగోలుదార్లుపట్ల రాష్ట్ర ప్రభుత్వం కరుణించింది. ఈ సందర్భంగా విధించే పన్నును కుదించింది. ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో శనివారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య ప్రసాద్‌ పాఢి మీడియాకు క్యాబినెట్‌ సమావేశం వివరాల్ని సంక్షిప్తంగా వివరించారు. వాహనాల కొనుగోలును పురస్కరించుకుని 5 అంచెల్లో వసూలు చేస్తున్న పన్నును 3 అంచెలకు కుదించారు. ఈ నేపథ్యంలో ఒడిశా మోటారు వాహన చట్టం–1975 సవరణకు రాష్ట్ర క్యాబినెట్‌ అంగీకరించింది. వాహన కొనుగోలు ధరల ఆధారంగా పన్ను విధిస్తారు.

రూ.5 లక్షల లోపు విలువైన వాహనం కొనుగోలుపై 6 శాతం పన్ను విధిస్తారు. రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య విలువ చేసే వాహనాల కొనుగోలుపై 8 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రూ.10 లక్షలు పైబడి విలువ చేసే వాహనాలపై రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం పన్ను వడ్డిస్తుంది.

అద్దె వసూలులో సంస్కరణ
సాంకేతిక సమాచారం, స్టార్టప్‌ ప్రాజెక్టుల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అద్దె వసతుల్ని కల్పిస్తుంది. సబ్సిడీ ధరలతో అద్దె వసూలు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో 6 భవనాలు ఈ మేరకు అందుబాటులో ఉన్నట్లు క్యాబినెట్‌ తెలిపింది. ప్రతి చదరపు అడుగుకు రూ.20 చొప్పున అద్దె వసూలు చేస్తారు.

కార్మిక సంస్కరణలు
రాష్ట్రంలో కార్మిక సంస్కరణలపట్ల క్యాబినెట్‌ దృష్టి సారించింది. ప్రతి జిల్లాకు ఇద్దరు చొప్పున కార్మిక అధికారుల్ని నియమించేందుకు క్యాబినెట్‌ నిర్ణయించింది. వీరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా 314 సమితులు, నోటిఫైడ్‌ ఏరియా కౌన్సిళ్లు, మునిసిపాలిటీలు, మునిసిపల్‌ కార్పొరేషన్లలో అదనంగా కార్మిక అధికారులు పని చేస్తారని క్యాబినెట్‌ తెలిపింది. ఇలా 11 ప్రతిపాదనలకు రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదం లభించినట్లు ప్రదాన కార్యదర్శి వివరించారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top