శివాజీ విగ్రహానికి రూ.100 కోట్లు


ముంబై: నగరంలోని అరేబియా సముద్ర తీరంలో ఏర్పాటుచేయనున్న ఛత్రపతి శివాజీ విగ్రహం కోసం రూ.వంద కోట్లను రాష్ట్ర సర్కార్ కేటాయించింది. ఈ మేరకు బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదం వేశారు. ఐతే ఇది ప్రపంచంలోనే ఎతైన విగ్రహామని తెలిపిన సీఎం చవాన్ ఎంతమేర ఉంటుందో వెల్లడించేందుకు నిరాకరించారు. దీనికోసం అంతర్జాతీయ బిడ్‌లు నిర్వహిస్తామని తెలిపారు.



సముద్రంలో అలలు వచ్చిన విగ్రహానికి ఎలాంటి నష్టం జరగకుండా ఉండేలా స్మారక రూపకల్పనకు ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. ఈ ప్రాంతం రాజ్ భవన్ నుంచి 1.2కిలోమీటర్లు, గిర్గావ్ నుంచి 3.6 కిలోమీటర్లు, నారీమన్ పాయింట్ నుంచి 2.6 కిలోమీటర్లు ఉంటుందన్నారు. గుజరాత్‌లోని ప్రతిపాదిత 182 మీటర్ల సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం కంటే దక్షిణ ముంబైలోని మెరీన్ డ్రైవ్‌లో శివాజీ విగ్రహాన్ని ఏర్పాటుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తును మొదలెట్టింది.



 ఎన్నికలకు ముందే శివాజీ స్మారక పనులు

 సాక్షి, ముంబై: అరేబియా సముద్రంలో ప్రతిపాదిత ఛత్రపతి శివాజీ స్మారక నిర్మాణ పనులకు లోక్‌సభ ఎన్నికలకు ముందే శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం ఆరాటపడుతోంది. వీటి పనులను పర్యవేక్షిస్తున్న  ముంబై జిల్లా ఇన్‌చార్జి మంత్రి జయంత్ పాటిల్ నేతృత్వంలోని కమిటీ  పర్యావరణ శాఖ మినహా మిగతా శాఖల నుంచి అనుమతులన్నీ తీసుకొచ్చింది. పర్యావరణ శాఖ నుంచి అనుమతి పొందేందుకు అవసరమైన ప్రతిపాదనను పదిహేను రోజుల్లో పంపించనున్నట్లు మంత్రాలయ వర్గాలు పేర్కొన్నాయి.



స్మారకం నిర్మిస్తున్న ప్రాంతం మహారాష్ట్ర తీర ప్రాంత(సీఆర్‌జడ్)-4 పరిధిలోకి వచ్చింది. దీంతో నియమ, నిబంధనాల్లో కొంత వెసులుబాటు కల్పించాలని కేంద్ర పర్యావరణ శాఖ ప్రత్యేకంగా సీఆర్‌జెడ్‌కు సిఫార్సు చేసింది. దీంతో కీలక అడ్డంకులన్నీ తొలగిపోవడంతో ఇక శంకుస్థాపన చేయడమే మిగిలిపోయింది. అయితే శివాజీ విగ్రహా స్మారకాన్ని చూసేందుకు వచ్చే పర్యాటకులు అత్యవసర పరిస్థితుల్లో ఎలా బయటపడాలనేదానిపై బీఎంసీకి, అక్కడికి చేరుకునేందుకు ఎలాంటి రవాణా వ్యవస్థ ఏర్పాటుచేయాలనే దానిపై ట్రాఫిక్ పోలీసు శాఖకు నివేదికలు రూపొందించే బాధ్యతలు అప్పగించారు.



ఈ శాఖల నుంచి నివేదికలు రాగానే అనుమతి కోసం పర్యావరణ శాఖకు ప్రతిపాదన పంపిం చనున్నట్లు మంత్రాలయ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే శివాజీ స్మారకం ఊహా చిత్రాన్ని జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్ రూపొందించిందని వెల్లడించాయి. కాగా, ఈ శివాజీ విగ్రహ స్మారక నిర్మాణంపై ప్రభుత్వం చొరవ చూస్తుంటే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఈ అంశాన్ని కూడా వినియోగించుకోవాలనుకుంటున్న ఊహగానాలు ఊపందుకున్నాయి. నగరంలోని అరేబియా సముద్రంలో ఛత్రపతి శివాజీ భారీ స్మారకాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలని కొన్ని సంవత్సరాల క్రితం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం గేట్ వే ఆఫ్ ఇండియా, శివాజీపార్క్, బాంద్రా, గిర్గావ్ (చర్నిరోడ్) తదితర తీర ప్రాంతాలను ఎంపిక చేసింది. చివరకు మెరైన్ డ్రైవ్ లోని అరేబియా సముద్రంలో ఒడ్డు నుంచి 1.5 కి.మీ. దూరంలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.



దీనికోసం ప్రత్యేకంగా చొరవ తీసుకున్న కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి జయంత్ నటరాజన్ ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ స్మారకం నిర్మాణానికి మార్గం సుగమం కావడంతో జయంత్ పాటిల్ అధ్యక్షతన మంత్రులతో కూడా ఓ కమిటీ ఏర్పాటు చేశారు. అయితే లోక్‌సభ , ఆ తర్వాత శాసనసభ ఎన్నికలు ఉండటం, మార్చిలో ఎప్పుడైన ఎన్నికల ప్రవర్తన నియమావళి (కోడ్) అమలులోకి వచ్చే అవకాశముండటంతో ఆలోపే నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయాలని సర్కార్ ఆరాటపడుతోంది.



లేకుంటే లోక్‌సభ ఎన్నికలు, ఫలితాలు  ఆ తర్వాత శాసన సభ ఎన్నికలు, ఫలితాలు వచ్చేవరకు వేచిచూడాల్సి ఉంటుంది. మెరైన్ డ్రైవ్ తీరప్రాంతం నుంచి 1.5 కిమీల దూరంలో నిర్మించనున్న ఈ స్మారకానికి సముద్రంలో 18 హెక్టార్ల ప్లాట్‌ఫారం నిర్మించాల్సి ఉంది. ఆ ప్రాంతాన్నంత మట్టితో నింపాల్సి ఉండడంతో, అందుకు సంబంధించిన అధ్యయన పనులు చురుగ్గా సాగుతున్నాయి.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top