
బెంగళూరు : కర్ణాటక రాష్ట్ర సాంఘిక, సంక్షేమ శాఖల మంత్రి హచ్.ఆంజనేయ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. టీ తేవాలని సిబ్బందిని కోరారు ఆ మంత్రి. అయితే టీ తేవడం కాస్త ఆలస్యం కావడంతో ఆంజనేయ తన సిబ్బంది మీద అగ్గిమీద గుగ్గిలమయ్యారు. తాను పని చెబితే త్వరగా చేయడానికి ఇంత నిర్లక్ష్యమా అంటూ టీ తెచ్చిన సిబ్బందిపై మండిపడ్డ మంత్రి, అంతటితో ఆగకుండా తిట్ల దండకానికి దిగారట.
చెప్పినపని ఆలస్యంగా ఎందుకు చేశావంటూ అసభ్య పదజాలంతో సిబ్బందిని దూషించినట్లు తెలుస్తోంది. మంత్రిగారి చేష్టలు ఆనోటా ఈనోటా పాకి వైరల్ కావడంతో రాష్ట్ర మంత్రి తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి, అందులోనూ సాంఘిక, సంక్షేమ మంత్రిగా పనిచేస్తున్నా.. సిబ్బందితో ఎలా ప్రవర్తించాలన్న కనీస మర్యాద కూడా తెలియదా అని ఆంజనేయను ప్రశ్నిస్తున్నారు.